MP కోమటిరెడ్డి వ్యవహారంలో టీ-కాంగ్రెస్‌కు స్పష్టత వచ్చిందా?
మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యవహారంపై రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి స్పష్టత వచ్చింది.
దిశ, తెలంగాణ బ్యూరో: మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యవహారంపై రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి స్పష్టత వచ్చింది. పార్టీ అభ్యర్థి గెలవడం అసాధ్యం అనటమే కాకుండా, ఆయన సోదరుడు, బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి సహకరించాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను పార్టీ సీరియస్‌గా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఆయనకు ఏఐసీసీ నుంచి నోటీసులు కూడా వచ్చాయి. దీనికి అనుగుణంగా ఇటీవల ఏఐసీసీ ప్రకటించిన టీపీసీసీ కమిటీల్లో ఎంపీ వెంకట్‌రెడ్డికి ఎక్కడా చోటు దక్కలేదు. కానీ, అనూహ్యంగా ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బుధవారం భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీలోనే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం ఏఐసీసీ కార్యాలయంలో ఖర్గేతో భేటీ అయిన తర్వాత వెంకట్ రెడ్డి ట్విట్టర్వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితులపై ఆయనతో చర్చించామన్నారు.
అరగంట పాటు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఖర్గేతో రాష్ట్రంలోని పార్టీ కార్యకలాపాలపై చర్చించామని, సీనియర్లు పార్టీ వీడడంపై ఖర్గేకు వివరించినట్లు చెప్పారు. ఇక టీపీసీసీ కమిటీల నియామకంలో కొందరు సీనియర్లకు చోటు దక్కని విషయాన్ని కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఖర్గేకు వివరించారని సమాచారం. కాగా, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తమ్ముడు పార్టీ మారిన, ఆయన పార్టీ మారకుండా పనిచేస్తున్నందుకు ఖర్గే మెచ్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంగా ఏఐసీసీ స్థాయిలో ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు పార్టీలో చర్చగా మారింది. అయితే, ఇటీవల పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఢిల్లీకి వెళ్లిన వెంకట్ రెడ్డి ఏఐసీసీ నేతలతో సమావేశమవుతున్నారు. మంగళవారం రాత్రి తారీక్ అన్వర్‌ను కలిసి షోకాస్ నోటీసులపై వివరణ ఇచ్చినట్లు సమాచారం. ఇప్పుడు వెంకట్‌రెడ్డికి ఏఐసీసీ స్థాయిలో పార్టీ పదవి అప్పగిస్తే.. రాష్ట్రంలోని పార్టీ నేతలు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తారో అనే భయం పార్టీ నేతలకు పట్టుకుంది.
Also Read...