రైతు రుణమాఫీపై బడ్జెట్ లో ట్విస్ట్!.. హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ గ్యారెంటీలు గాడి తప్పాయి, డిక్లరేషన్లన్నీ డీలాపడ్డాయని హరీశ్ రావు సెటైర్లు వేశారు.

Update: 2024-07-25 12:32 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్నికల్లో గ్యారెంటీల గారడి చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బడ్జెట్ లో అంకెల గారడీ చేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆత్మస్తుతి పరనిందలా ఉందని, ఈ బడ్జెట్ లో ఆరు గ్యారెంటీలు నీరుగారిపోయాయి, సంక్షేమం సన్నగిల్లిందని, అభివృద్ధి అగమ్యగోచరమైందని విమర్శించారు. రాష్ట్ర బడ్జెట్ పై ఇవాళ బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆగస్టు 15 కల్లా రైతు రుణమాఫీ చేస్తామని ఊరూరా దేవునిపై ఒట్లు పెడితే నిజం అని నమ్మాం. కానీ, రూ.31 వేల కోట్లతో ఏక కాలంలో రైతు రుణమాఫీ చేస్తున్నామని బడ్జెట్ ప్రసంగంలో చెప్పిన భట్టి విక్రమార్క బడ్జెట్ లో మాత్రం కేవలం 15,470 కోట్లు మాత్రమే కేటాయించారు. ఈ నిధులతో ఒకేసారి మాఫీ ఎలా సాధ్యం? అని ప్రశ్నించారు.  రుణమాఫీని వాయిదా వేస్తారా బడ్జెట్ లో చూపకుండా ఇంకెక్కడి నుంచి నిధులు తెస్తారని ప్రశ్నించారు. భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలను తీవ్రంగా నిరాశ పరిచిందన్నారు. గ్యారెంటీలు గాడి తప్పాయని, డిక్లరేషన్లన్నీ డీలాపడ్డాయని విమర్శించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలయ్యాయన్నారు. ఎన్నికల్లో హామీలు ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సభలో నిలదీస్తామన్నారు.

దశ, దిశ చూపుతారనున్నాం..

ప్రజలను బురిడీ కొట్టించేందుకు, భ్రమలు పెట్టేందుకు భట్టి విక్రమార్క చాలా ప్రయత్నించారని.. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది మొదటి బడ్జెట్ అని రాష్ట్రానికి ఏదైనా దశ దిశ చూపిస్తారనుకున్నాం. కానీ ఎలాంటి దశ దిశలేకుండా తిరోగమనం వైపు తీసుకువెళ్లే బడ్జెట్ అని హరీశ్ రావు విమర్శించారు. వంద రోజుల్లో అమలు చేస్తామని బాండుపేపర్లలో రాసిచ్చిన ఆరు గ్యారెంటీలకు కేటాయింపులు బడ్జెట్ లో ఎక్కడా అని ప్రశ్నించారు. అవ్వతాతలకు ఇస్తామన్న రూ.4 వేల పెన్షన్ల గురించి, మహాలక్ష్మి కింద మహిళకు ప్రతినెల ఇస్తామన్న రూ. 2500, విద్యార్థులకు ఇస్తామని రూ.5 లక్షల భరోసా కార్డు ప్రస్తావన లేనే లేదన్నారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు, దళితబంధు, గిరిజన బంధు ప్రస్తావనే లేదన్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని మాపై విమర్శలు చేసి ఇప్పుడు రూ.57 వేల కోట్లు అప్పులు తెచ్చుకుంటామని బడ్జెట్ లో ప్రతిపాదించారని ఎద్దేవా చేశారు. మేనిఫెస్టోను ప్రతిబింబించేలా బడ్జెట్ ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అలా లేదని ఆ పార్టీ తన మేనిఫెస్టోను మర్చిపోయిందేమో అనిపిస్తోందన్నారు. అత్యంత పేదలైన అవ్వతాతలను, వితంతు, ఒంటరి మహిళలను, ఆసరా పెన్షన్ లబ్దిదారులనే ఈ ప్రభుత్వం దారుణ వంచన చేసింది. పేదల ప్రభుత్వం అని చెప్పుకునే అర్హత లేదని విమర్శించారు.

ఈ కాంగ్రెస్ గజినీలకు కనిపించడం లేదు..

హైదరాబాద్ అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందని విమర్శిస్తే కళ్లుండి చూడలేని కబోదులే అలా మాట్లాడుతారని సెటైర్ వేశారు. హైదరాబాద్ అభివృద్ధి విషయంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన కృషిని ఇటీవలే చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. లోకమంతా మొత్తం మెచ్చింది. ఎక్కడో ఉండే హీరో రజినికాంత్ కూడా హైదరాబాద్ అభివృద్ధిని చూసి మెచ్చుకున్నారు కానీ ఇక్కడే ఉన్న కాంగ్రెస్ గజినీలకు మాత్రం అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ ను అభివృద్ధి చేయలేదనడం ఒక జోక్ అని అదుకే ఇక్కడ అన్ని సీట్లలో మమ్మల్ని గెలిపించారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ రంగంలోనూ విజన్ లేదని ఈ బడ్జెట్ ను చూస్తే అర్థం అవుతున్నదని, గత ప్రభుత్వాన్ని నిందించడమే పని గా పెట్టుకుందని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వాన్ని నిందించడమే తప్ప గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దాటవేయడమే పనిగా పెట్టుకున్నారు. కేసీఆర్ చేసిన ఘనతలను తమ ఘనతలుగా చెప్పుకునే ప్రయత్నం చేసింది. ఓ వైపు బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధే చేయలేదని చెబుతూనే మరో వైపు బడ్జెట్ ఎకనమిక్ సర్వే, బడ్జెట్ లో ఈ దేశంలోనే తెలంగాణ టాప్ లో ఉందని చెబుతోందని విమర్శించారు.

గల్లీకో వైన్ షాప్ పెట్టబోతున్నారా?:

రైతుబంధు స్థానంలో రైతుభరోసా అని చెప్పారు. దీంట్లో ఎన్ని కోతలు పెడతారో అని ప్రశ్నించారు. మైనార్టీలకు రూ.4 వేల కోట్లు బడ్జెట్ లో పెడతామని బడ్జెట్ లో ప్రకటించారు. కానీ ఇవాళ బడ్జెట్ లో కేవలం రూ.3 వేల కట్లే కేటాయించారన్నారు. బీసీలకు ఐదేళ్లలో లక్ష కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించి బడ్జెట్ లో 9 వేల కోట్లే కేటాయించారన్నారు. రాష్ట్రంలో 24 విద్యుత్ సరఫరా ప్రజలందరికీ తెలుసన్నారు. ఇరిగేషన్ విషయంలో ప్రభుత్వం అవాకులు చవాకులు పేలింది. దళితబంధు ప్రస్తావన లేదు. గిరిజన బంధు ఊసేలేదు. ఆసరా పెన్షన్లకు పోయిన సారి రూ.7,437 కోట్లు కేటాయిస్తే ఈసారి రూ.7,376 మాత్రమే ప్రకటించారు. అంటే కొత్త పెన్షన్లకు మంగళం పాడినట్లు అర్థం అవుతున్నదన్నారు. ఉద్యోగులకు ప్రభుత్వం 5 డీఏలు బాకీ పడ్డది. బడ్జెట్లో ఆ ప్రస్తావన లేదు. పీఆర్సీ ప్రస్తావన కూడా లేదన్నారు. గత బడ్జెట్లో నేను చూపిన ఎక్సైజ్ ఆదాయం రూ.18 వేల 470 కోట్లు అయితే భట్టి విక్రమార్క ప్రతిపాదించింది రూ.25 వేల 617 కోట్లు. అంటే ఏడు వేల కోట్లు ఎక్కువగా ప్రతిపాదించారని గల్లీకో వైన్ షాప్ పెడతరారా? అని ప్రశ్నించారు. ఎక్సైజ్, వ్యాట్ కలుపుకుంటే 15 వేల కోట్ల ఎక్కువ ఆదాయం రాబడతామని చెప్పారు. అంటే తాగుబోతు తెలంగాణను తయారుచేస్తారా? అని ప్రశ్నించారు.

స్టాంపు డ్యూటీ ఆదాయం 14వేల 295 కోట్లని గత బడ్జెట్లో నేను ప్రతిపాదిస్తే భట్టి 18 వేల 228 కోట్లు అన్నారు. అంటే 4 వేల కోట్ల ఎక్కువ. భూముల విలువ, రిజిస్ట్రేషన్, పన్నుల భారం పెంచుతామని చెప్పకనే చెప్పారని విమర్శించారు. గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించడం లేదని, నెలకు 7 వేల కోట్లను వడ్డీ కింద కడుతున్నామని సీఎం, భట్టి చెబుతున్నారు, వచ్చే ఏడాదికి చెల్లించాల్సిన వడ్డీ 17వేల 729 కోట్లని చూపించారు. ఏది నిజం, ఏది అబద్ధం? అన్నారు. ఒక్క డాక్టర్ పోస్టును కూడా భర్తీ చేయలేదని భట్టి ఆరోపించారు కానీ నా హయంలో 30 వేల పోస్టులను భర్తీ చేశానని సవాల్ చేస్తున్నా. మీ గౌరవాన్ని మీరే తీసుకుంటున్నారని విమర్శించారు. ఈ బడ్జెట్ ప్రజల ఆశలను నీరుగార్చిందన్నారు.

Tags:    

Similar News