ఉప ఎన్నిక‌లు రావ‌డం త‌థ్యం.. హైకోర్డు తీర్పును స్వాగ‌తిస్తున్నాం : ఎక్స్‌లో హరీష్ రావు జోస్యం

పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల అనర్హతపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే.

Update: 2024-09-09 06:43 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల అనర్హతపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. నాలుగు వారాల్లో అనర్హతపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయానికి ( అసెంబ్లీ సెక్రటరీ ) హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ అగ్రనేత, మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా స్పందించారు. ఎమ్మెల్యేల అన‌ర్హ‌త ఫిటీష‌న్‌ల‌ పై తెలంగాణ హైకోర్డు ఇచ్చిన తీర్పును స్వాగ‌తిస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యేల అన‌ర్హ‌త అప్లికేష‌న్ల‌పై హైకోర్డు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ పార్టీ అప్ర‌జాస్వామ్య విధానాల‌కు చెంప పెట్టు అని పేర్కొన్నారు. తెలంగాణ హైకోర్డు తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు అన‌ర్హ‌త‌కు గురికావ‌డం త‌థ్యమన్నారు.

తెలంగాణ హైకోర్డు తీర్పు ప్ర‌జాస్వామ్యాన్ని, రాజ్యాంగ స్పూర్తిని నిల‌బెట్టే విధంగా ఉందన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అన‌ర్హ‌త‌కు గురై ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉప ఎన్నిక‌లు రావ‌డం త‌థ్యమని వెల్లడించారు. అన‌ర్హ‌త కార‌ణంగా ఉప ఎన్నిక‌లు జ‌రిగే నియోజ‌క‌వ‌ర్గాల్లో బీఆర్‌ఎస్ గెలుపు త‌థ్యమని జోస్యం చెప్పారు. హైకోర్డు తీర్పుకు అనుగుణంగా రాష్ట్ర శాస‌న‌స‌భాప‌తి నాలుగు వారాల్లో నిర్ణ‌యం తీసుకుని ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడ‌తార‌ని ఆశిస్తున్నామని తెలిపారు. కాగా, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై వాదనలను ముగించిన ధర్మాసనం.. తాజాగా ఆదేశాలు జారీ చేసింది.

 


Similar News