ఒక్క రూపాయి కట్టేది లేదు... రేవంత్ కు హరీష్ రావు బహిరంగ లేఖ

భూముల క్రమ బద్దీకరణపై ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పిందని విమర్శించారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు.

Update: 2024-08-26 09:50 GMT

దిశ, వెబ్ డెస్క్ : భూముల క్రమ బద్దీకరణపై (LRS) ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పిందని విమర్శించారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఎల్ఆర్ఎస్ పథకాన్ని ఉచితంగా అమలు చేస్తామని చెప్పి.. నేడు దానిపై ఫీజులు వసూలు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. ఒక వైపు రైతన్నల ఆవేదన, మరోవైపు ప్రజలు విషజ్వరాలతో అల్లాడుతుంటే.. వాటిని పరిష్కరించాల్సిన ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పై ఫీజు వసూలు చేయాలని పంచాయతీ సెక్రటరీ నుంచి కలెక్టర్ వరకూ.. అధికారులందరిపై ఒత్తిడి చేయడాన్ని తప్పుపట్టారు. రుణమాఫీ లేక, రైతుబంధు రాక రైతులు ఆవేదన చెందుతుంటే.. రోజుకు నాలుగైదు సార్లు అధికారులు వారికి ఫోన్లు చేసి, ఫీజు కట్టకుంటే లే అవుట్లను రద్దు చేస్తామని భయపెడుతున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు.

ఎల్ఆర్ఎస్ ఫీజు పేరుతో ప్రభుత్వం పేద ప్రజల రక్తమాంసాలను పీల్చడమే లక్ష్యంగా చేసుకుందని, రాష్ట్రంలో ప్రజా సంక్షేమం కరువైందని హరీష్ రావు ఆరోపించారు. టార్గెట్లు పెట్టి మరీ ఫీజులు వసూలు చేస్తున్న ప్రభుత్వ వైఖరిని ఖండిస్తున్నామన్నారు. నాడు ఎల్ఆర్ఎస్ అంటే దోపిడీ అని చెప్పిన ప్రభుత్వమే.. నేడు అదే ఎల్ఆర్ఎస్ పేరుతో ఎందుకు దోపిడీ చేస్తుందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు ఫ్రీ అని చెప్పి.. ఇప్పుడు ఫీజు పేరుతో ప్రజలను నిలువునా దోచుకుంటున్నారని విమర్శించారు. ప్రభుత్వ వైఖరి.. ఓడ దాటే దాకా ఓడ మల్లన్న, ఓడ దాటినంక బోడి మల్లన్న అన్న చందంగా ఉందన్నారు. అప్పుడు ఎల్ఆర్ఎస్ కట్టొద్దని చెప్పి.. ఇప్పుడు అదే ఎల్ఆర్ఎస్ పేరుతో దందా సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి సహా.. ప్రస్తుతం కేబినెట్ లో మంత్రులుగా ఉన్న భట్టి, ఉత్తమ్, సీతక్క, కోమటిరెడ్డి లు.. నాడు ఎల్ఆర్ఎస్ పై ఏయే వ్యాఖ్యలు చేశారో హరీష్ రావు లేఖలో పేర్కొన్నారు.

"నో ఎల్ఆర్ఎస్.. నో బీఆర్ఎస్.. మేం అధికారంలోకి రాగానే ఎల్ఆర్ఎస్ పై ఒక్కరూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగా అమలు చేస్తాం" ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిన మాట. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల రక్తాన్ని పీల్చాలన్న ఆలోచనతో ఉంది. వీలైతే కట్టకండి. రాష్ట్ర అప్పులను ఎల్ఆర్ఎస్ రూపంలో ప్రజలనుంచి వసూలు చేస్తున్నారని భట్టి విక్రమార్క అన్నారు. ప్రభుత్వం కొత్తనాటకానికి తెరలేపిందని, ఎల్ఆర్ఎస్ పేరుతో దోచుకుని, దాచుకోవాలని చూస్తుందని సీతక్క అన్నారని లేఖలో పేర్కొన్నారు.

అలాగే.. రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ అయిపోయింది, ఎల్ఆర్ఎస్ అయిపోయింది. నెక్ట్స్ ఎంఆర్ఎస్ తెస్తాడట.. అన్న మాటల్ని కూడా బహిరంగ లేఖలో ఉద్ఘాటించారు హరీష్ రావు. ఇప్పటి మంత్రి కోమటిరెడ్డి.. నాడు ఏకంగా హైకోర్టుకే వెళ్లి.. ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలని పిల్ కూడా దాఖలు చేశారన్నారు.

ఎన్నికల్లో గెలవాలని ప్రజలకు ఎల్ఆర్ఎస్ పై ఆశలు కల్పించారని, ఉచితంగా అమలు చేస్తామని చెప్పి నేడు ఫీజులు వసూలు చేయడం ప్రభుత్వ హామీల డొల్లతనానికి నిదర్శనమన్నారు. ఇప్పటికైనా ఎల్ఆర్ఎస్ పై ఫీజుల వసూళ్ల నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని, ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. అలాగే ఎల్ఆర్ఎస్ పై ఎవరూ ఒక్కరూపాయి కూడా కట్టొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు.


Similar News