ఇంటర్ పరీక్షల్లో సత్తా చాటిన గురుకుల విద్యార్థులు..
ఇంటర్ ఫలితాల్లో గురుకుల పాఠశాలల విద్యార్థులు సత్తా చాటారు.
దిశ, తెలంగాణ బ్యూరో: ఇంటర్ ఫలితాల్లో గురుకుల పాఠశాలల విద్యార్థులు సత్తా చాటారు. ఎస్సీ వెల్ఫేర్లో 92 శాతం, ఎస్టీ గురుకుల కాలేజీల్లో 84 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ మేరకు మంత్రులు సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్లు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్మాట్లాడుతూ.. గురుకుల కాలేజీల్లో 92 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం గర్వకారణం అన్నారు. ప్రైవేటు కాలేజీల్లో 63 శాతం మంది పాస్ కాగా.. సోషల్ వెల్ఫేర్ కాలేజీల్లో 89 శాతం, బీసీ గురుకుల 87 శాతం ఉత్తీర్ణత సాధించారని చెప్పారు.కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం లో 77 శాతం, ప్రభుత్వ జూనియర్ కాలేజిల్లో 54 శాతం మంది ఉత్తీర్ణత సాధించడాన్ని గమనిస్తే ప్రభుత్వ చిత్త శుద్ధి స్పష్టంగా అర్థం అవుతుందన్నారు.
ప్రయివేట్ కాలేజీల్లో కన్నా గురుకుల విద్యాసంస్థల్లో మెరుగైన ఫలితాలు సాధించడం గర్వకారణమన్నారు. అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు, ప్రతిభ కనబరిచేందుకు ప్రోత్సహించిన బోధన సిబ్బందిని మంత్రి అభినందించారు. ఇప్పటికే గురుకుల విద్యాసంస్థల్లో చదివిన విద్యార్థులు దేశ విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసిస్తుండగా.. మరి కొందరు ఐటీ, బ్యాంకింగ్ రంగాల్లో ఉపాధి అవకాశాలు పొందరని గుర్తు చేశారు. ఈ ఫలితాలను పరిశీలిస్తూ ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివించేందుకు పేరెంట్స్ ముందుకు రావాలన్నారు. పదో తరగతి ఫలితాల్లోను మంచి రిజల్ట్స్ వస్తాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆశా భావం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలోని గిరిజన పేదరికాన్ని శాశ్వతంగా తొలగించాలంటే నాణ్యమైన విద్య ఒక్కటే మార్గమని గిరిజన, స్త్రీ ,శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ గారు స్పష్టం చేశారు. ట్రైబల్గురుకుల కాలేజీల్లో ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 73.65 శాతం ఉత్తీర్ణత సాధించగా, సెకండ్ ఇయర్ విద్యార్థులు 84.95 శాతం ఉత్తీర్ణత సాధించారని మంత్రి తెలిపారు. సెకండ్ ఇయర్ ఫలితాల్లో భూక్య గణేష్ ఎంపీసీ 991, పునేం అక్షిత్ బైపీసీ 985 ,ఎమ్ కావ్య ఎంపీసీ 988 మార్కులు సాధించగా, ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో వాంకుడోత్ భువన్ ఎంపీసీ 467/470 మార్కులతో సత్తా చాటారని తెలిపారు.
ప్రైవేట్ కాలేజీలకు దీటుగా విద్యార్థులు ర్యాంకులు సాధించడం గర్వకారణమని మంత్రి పేర్కొన్నారు. గురుకులాల్లో నాణ్యమైన విద్యావిధానం, ఇంగ్లిష్ మీడియంలో బోధన, సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం, పౌష్టికాహారం వంటి విద్యాభివృద్ధి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం సమర్థంగా అమలు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థుల నమోదు పెరిగిందని తెలిపారు. రికార్డు స్ధాయిలో గిరిజన విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించడానికి కృషి చేసిన అధికారులను, ఉపాధ్యాయులు సిబ్బందిని మంత్రి అభినందించారు.