2023 తెలంగాణ బడ్జెట్ అంకెల గారడీ: గూడూరు నారాయణరెడ్డి

రాష్ట్ర బడ్జెట్ ఆచరణకు సాధ్యం కానిదని, ఊహాజనితమైనదని బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకుడు గూడూరు నారాయణ రెడ్డి విమర్శలు చేశారు.

Update: 2023-02-08 16:19 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర బడ్జెట్ ఆచరణకు సాధ్యం కానిదని, ఊహాజనితమైనదని బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకుడు గూడూరు నారాయణ రెడ్డి విమర్శలు చేశారు. మంత్రి హరీశ్ రావు బడ్జెట్ అంకెల గారడీ అని, అంతా విచిత్రంగా ఉందని బుధవారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. బడ్జెట్‌ను సమర్పించడాన్ని కేవలం ఒక విధిగా భావించినట్లు ఉందని ఆయన ఎద్దేవాచేశారు. ఈ బడ్జెట్ పెట్టుబడిదారుకు నిరాశపరిచిందని పేర్కొన్నారు. బడ్జెట్‌లో రాష్ట్ర ఆర్థిక ప్రగతికి భరోసానిచ్చే అంశమే లేదని ధ్వజమెత్తారు. గత 9 సంవత్సరాల రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ గణాంకాలను పరిగణనలోకి తీసుకుంటే అంచనా వ్యయం, ఆదాయం పూర్తి విరుద్ధంగా ఉన్నాయన్నారు.

ప్రభుత్వం నేరుగా లేదా కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న మొత్తం రుణాలు రూ.4.86 లక్షల కోట్లుగా ఉందని నారాయణ రెడ్డి వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో వడ్డీ చెల్లింపునకే రూ.35,013 కోట్లు కేటాయించారని, ఇందులో ప్రగతి ఎక్కడ ఉందని ఆయన ఘాటు విమర్శలు చేశారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.2.90 లక్షల కోట్లు బడ్జెట్‌ అంచనా వేయగా, పన్నుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1.31 లక్షల కోట్లు ఆదాయం వస్తుందని సర్కార్ చూపించారని, మరి రూ.1.59 లక్షల లోటును ప్రభుత్వం ఎలా భర్తీ చేస్తుందో దేవుడికే తెలియాలని సెటైర్లు వేశారు. 2022-23 లో రూ.2.56 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టినప్పటికీ ఏమాత్రం ఖర్చుపెట్టలేదని విమర్శలు చేశారు. కేంద్రంపై నిందలు వేసేందుకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందని ఆయన ధ్వజమెత్తారు.

Tags:    

Similar News