ప్రజలలో పెరుగుతున్న అసంతృప్తి.. పద్మారావుకు చిక్కులు తప్పవా..?
సికింద్రాబాద్ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
దిశ, సికింద్రాబాద్ : సికింద్రాబాద్ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ 2015లో ప్రతిష్టాత్మకంగా తీసుకుని డబుల్ బెడ్రూం ఇళ్ల పథకాన్ని ప్రకటించారు. అందుకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
ఈ సమయంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్న సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుళ్ల పద్మారావుగౌడ్ నియోజకవర్గంలో పది వేల డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని హామినిచ్చారు. సుమారు ఎనిమిదేళ్లు పూర్తవుతున్నా ఇండ్ల నిర్మాణం, కేటాయింపు పూర్తికాకపోవడంతో పేద ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఎన్నికలప్పుడే హామీలు ఇచ్చి, గద్దెనెక్కాక వాటిని, మరిచిపోవడం పాలకులకు మామూలేననే విమర్శలు వినబడుతున్నాయి.
మంజూరైనవి 419 మాత్రమే..
పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తామని హామీలిచ్చి దాదాపు ఎనిమిదేళ్లు పూర్తయినా ఇప్పటివరకు నియోజకవర్గంలో మంజూరైనవి 419 ఇండ్లు మాత్రమేనని గణాంకాలు చెబుతున్నాయి. తార్నాక డివిజన్ సాయినగర్‌లో 104 , అడ్డగిట్ట డివిజన్ అజాద్ చంద్ర శేఖర్ నగర్‌లో 48, చిలకలగూడా దోబి ఘాట్‌లో 207, సీతాఫల్ మండి దివజన్ లోని సుభాష్ చంద్ర బోస్ నగర్‌లో 60 మొత్తం వాటిలో నిర్మాణం పూర్తై , గృహప్రవేశాలు జరిగినవి 74 మాత్రమే. మిగిలిన వాటిలో 315 నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. మరికొన్ని నిర్మాణం పూర్తైనా లబ్ధిదారులను గుర్తించక నిరుపయోగంగా మిగిలిపోయాయి.
గుడిసెలు కోల్పోయిన వారికి మొండిచేయి...
సికింద్రాబాద్ నియోజకవర్గంలోని అడ్డగుట్ట డివిజన్లో ఆజాద్ చంద్రశేఖర్ నగర్‌లో ఇటీవల డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రారంభించారు. ఇక్కడ మొత్తం 48 మందికి డబుల్ బెడ్రూం ఇండ్లను కేటాయించగా, వారిలో 44 మందికి స్వాధీనం చేశారు. కానీ ఈ ఇండ్ల నిర్మాణానికి భూసేకరణ సమయంలో తొలగించిన గుడిసె వాసుల్లో ఇంకా 90 మందికి ఇళ్లు రాకపోవడం గందరగోళానికి దారితీసింది. దీంతో ఉన్న గుడిసె పోయి ఇస్తామన్న డబుల్ బెడ్ రూం ఇండ్లు రాక స్థల సేకరణలో గుడిసెలు కోల్పోయిన పేదలు పడరాని పాట్లు పడుతున్నారు.
కొత్త పల్లవి ఎత్తుకున్న ఉపసభాపతి...
నియోజకవర్గంలో ఖాళీ ప్రభుత్వ స్థలం లేకపోవడంతో రైల్వే అధికారులతో మాట్లాడి, ఆ స్థలం సేకరించి, అక్కడ పేదలకు డబుల్ బెడ్రూం గృహాలు నిర్మించి ఇస్తామని పలు సందర్భాలలో పద్మారావు చెప్పి ఆ సంగతే మరచిపోయారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో తాజాగా కొత్త పల్లవి అందుకున్నారు. తమ నియోజకవర్గంలో ఖాళీ స్థలం లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించిన నాగోలు, బాటసింగారం, జవహర్ నగర్ ప్రాంతాల్లో ఇళ్లను కేటాయిస్తారనే ప్రచారాన్ని తెరమీదకు తీసుకువచ్చారు.
ప్రజలలో తీవ్ర అసంతృప్తి...
లష్కర్ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూం ఇండ్ల వ్యవహారం స్థానిక ఎమ్మెల్యే, ఉప సభాపతికి రాబోయే ఎన్నికలలో చిక్కులు తెచ్చి పెట్టేలా పరిస్థితులు కనబడుతున్నాయి. ఇచ్చిన హామీలో కేవలం పది శాతం కూడా పూర్తికాకపోవడంతో పేద ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇది ఆయనపై వ్యతిరేకత పెరగడానికి కారణమైంది. స్థల సేకరణ సమయంలో తమ ఇండ్లను ఇచ్చినా నిర్మాణం పూర్తి చేసుకున్న వాటిల్లో కేటాయింపులు ఎందుకు జరపలేదని ఇప్పటికే పలు కుటుంబాలు ఆందోళన బాట పట్టాయి. మొత్తం మీద డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం, కేటాయింపు వ్యవహారంతో ఈ యేడాది చివరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పద్మారావు గెలుపు, ఓటములను ప్రభావితం చేస్తుందనే టాక్ వినబడుతోంది.