లైంగిక వేధింపు ఫిర్యాదులకు గ్రీవెన్స్ సెల్: జాతీయ టాస్క్‌ఫోర్స్ మెంబర్ కిరణ్​మాదాల

దేశ వ్యాప్తంగా మెడికల్ కాలేజీలు, ప్రభుత్వాసుపత్రుల్లోని లైంగిక వేధింపు ఫిర్యాదులకు ప్రత్యేకంగా గ్రీవెన్స్ సెల్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని జాతీయ వైద్య టాస్క్‌ఫోర్స్ మెంబరు డాక్టర్ కిరణ్​మాదాల అన్నారు.

Update: 2024-09-21 15:17 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: దేశ వ్యాప్తంగా మెడికల్ కాలేజీలు, ప్రభుత్వాసుపత్రుల్లోని లైంగిక వేధింపు ఫిర్యాదులకు ప్రత్యేకంగా గ్రీవెన్స్ సెల్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని జాతీయ వైద్య టాస్క్‌ఫోర్స్ మెంబరు డాక్టర్ కిరణ్​మాదాల అన్నారు. బాధితులకు నమ్మకం కలిగేలా కేసుల పరిష్కారం జరగాలని తెలిపారు. శనివారం జాతీయ టాస్క్‌ఫోర్స్ ఉప కమిటి మూడో సమావేశం‌లో ఆయన జూమ్‌లో ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్​మాదాల మాట్లాడుతూ.. ప్రభుత్వాసుపత్రుల్లో జాబ్‌ఛార్ట్ అవసరమని పేర్కొన్నారు. దీంతో ద్వారా డాక్టర్లు, నర్సింగ్ ఆఫీసర్లు, ఇతర స్టాఫ్​విధి, విధానాల్లో స్పష్టత ఏర్పడుతుందని అన్నారు. వర్కింగ్ ఎన్విరాన్‌మెంట్ కూడా మెరుగ్గా ఉంటుందని తెలిపారు. జూనియర్ వైద్యుల పని గంటలు 48 నుంచి 74 మద్య ఉండేలా నిర్ణయించాలన్నారు. అయితే, రోగుల రద్దీ దృష్ట్యా అనస్తీషియా, గైనకాలజీ, జనరల్ మెడిసిన్, పిడియాట్రిక్స్ తదితర విభాగాలు, సూపర్ స్పెషాలిటీలను పరిగణన‌లోకి తీసుకుని మార్పులు చేర్పులు ఉండేలా వెలుసుబాటును కల్పించాలని తెలిపారు.

సీనియర్ రెసిడెంట్స్ తప్పనిసరిగా మూడేళ్లు పని చేయాల్సిందేనని రాబోతున్న నిబంధన మంచిదే అయినప్పటికీ, వాళ్లను రెగ్యులర్ మెథడ్‌లో నియమిస్తే బెటర్ అంటూ సూచించారు. వైద్యుల బదిలీల్లో ప్రత్యేక మార్గదర్శకాలు ఉండాలని పేర్కొన్నారు. ఏ కారణం చేతనైనా వైద్యులు చనిపోతే తమిళనాడు తరహాలో వాలంటరీ నిధుల సమీకరణ స్కీమ్ లను అమలు చేయాలన్నారు. ఆయుష్మాన్ భారత్‌ను భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉన్నదని వివరించారు. ప్రభుత్వాసుపత్రుల ప్రతిష్టను దెబ్బతీసేలా చొరవ చూపే వ్యక్తులకు కఠిన శిక్షలు వర్తింపజేసేలా రూల్స్ రూపొందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అన్ని రాష్ట్రాల సెక్రటరీలు, డీఎంఈలు, ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యులు పాల్గొన్నారు. అయితే, మన స్టేట్ నుంచి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని జాతీయ వైద్య టాస్క్‌ఫోర్స్‌లో డాక్టర్ కిరణ్ మాదాల ఒక్కరికే చోటు లభించడం గమనార్హం.


Similar News