రేవంత్‌ రెడ్డికి ప్రముఖుల శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న రేవంత్ రెడ్డికి తెలుగుదేశం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు.

Update: 2023-12-05 17:19 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న రేవంత్ రెడ్డికి తెలుగుదేశం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగిన ఆయనపై తెలంగాణ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆకాంక్షలను నేరవేర్చాలని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని కోరారు. పరిపాలనలో ప్రత్యేకమైన ముద్ర వేసి తెలంగాణ ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకోవాలని కోరారు.

తెలంగాణ రాష్ట్ర కంట్రీబ్యూటరీ పెన్షన్స్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పవన్ కుమార్, ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, కోశాధికారి నరేష్ గౌడ్ తదితరులు కూడా రేవంత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా హర్షం వ్యక్తం చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆరు గ్యారంటీల అమలులో సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులు ప్రభుత్వానికి సహకారం అందిస్తామని అభివృద్ధిలో భాగస్వాములవుతామని పేర్కొన్నారు. రెండు దశాబ్దాలుగా నలుగుతున్న సీపీయస్ ఉద్యోగుల డిమాండ్ మేరకు పాత పెన్షన్ ఆకాంక్షను నెరవేరుస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎంపికైన టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ శుభాకాంక్షలు తెలిపింది. కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా జర్నలిస్టులకు రక్షణ కల్పించి, దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని, రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులపై ఉన్న అక్రమ కేసులను ఎత్తివేయాలని కోరింది. గడచిన తొమ్మిదిన్నరేళ్ళుగా జర్నలిస్టులకు అవమానాలు, ఛీత్కారాలే మిగిలాయని, ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పని చేస్తున్న మీడియాకు కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేయాలని కోరింది. ఇండ్ల స్థలాలు, హెల్త్ కార్డులు తదితర అంశాలపై దృష్టి పెట్టాలని కోరింది.

Tags:    

Similar News