TS: రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేంద్రం కీలక నిర్ణయం
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రాష్టంలోని రెండు కొత్త రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని ద్వారా ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్టాల ప్రజలకు లాభం చేకూరనుంది.
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రాష్టంలోని రెండు కొత్త రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని ద్వారా ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్టాల ప్రజలకు లాభం చేకూరనుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో దశాబ్ది ఉత్సవాల పేరిట పెద్దఎత్తున్న ప్రచారం చేసుకుంటున్న సందర్భంలో రాష్ట్ర అవతరణ సందర్భంగా కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ మేరకు రెండు రాష్ట్రాల అనుసంధానతను మరింత బలోపేతం చేసేందుకు రెండు కొత్త సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్లకు అవసరమైన సర్వేకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం–విజయవాడ– తెలంగాణలోని శంషాబాద్ మధ్యలో మొదటిది, విశాఖపట్నం – విజయవాడ – కర్నూలు మార్గంలో రెండో రైల్వే లైన్ కోసం సర్వేకు రైల్వే బోర్డు అంగీకారం తెలుపుతూ.. దక్షిణ మధ్య రైల్వేకు లేఖ రాసింది. ఈ మార్గాల్లో సూపర్ ఫాస్ట్ రైల్వే ప్రాజెక్టు చేపట్టేందుకు అవసరమైన టెక్నికల్ ఫీజిబిలిటీని ఈ సర్వే ద్వారా నిర్ణయిస్తారు. సర్వే అయిన తర్వాత ప్రాజెక్టుపై ముందుడుగు పడనుంది.
ఈ రైల్వే లైన్ల వల్ల తెలుగు రాష్ట్రాలకు కలిగే లబ్ధిని, ఆవశ్యకత గూర్చి కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి పలుమార్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విణి వైష్ణవ్‌ను కలిసి విన్నవించారు. ఈ నేపథ్యంలో రైల్వే బోర్డు తాజాగా ఈ రెండు రూట్లలో సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్ల సర్వేకు నిర్ణయం తీసుకుంది. ఈ రెండు రైల్వే లైన్లు కలిసి 942 కిలోమీటర్ల మార్గంలో (గరిష్టంగా గంటకు 220 కి.మీ వేగంతో ప్రయాణించేలా) రైల్వై లైన్ నిర్మాణానికి అవసరమైన సర్వే నిర్వహించనున్నారు. ఈ సర్వేను 6 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంతో ఈ పనులను చేసేందుకు అధికారులు కసరత్తులు చేపడుతున్నారు.
ఇదివరకే రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త రైల్వే లైన్లు, రైల్వే స్టేషన్ల అభివృద్ధి, వై-ఫైలు, రూ.30వేల కోట్ల విలువైన డబ్లింగ్, ట్రిప్లింగ్ లైన్లు, వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లను కేంద్రం తెలుగు రాష్ట్రాలకు అందించింది. వీటికి అదనంగా తెలంగాణలో వ్యాగన్ తయారీ & ఓవర్‌హాలింగ్ కేంద్రాన్ని, ఎంఎంటీఎస్ (రెండోదశ), సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునీకరణ, చర్లపల్లి టర్మినల్ వంటి పలు ప్రాజెక్టులను కేంద్రం చేపట్టిన సంగతి విదితమే. రాష్టాలలోని రవాణా ద్వారా అనుసంధాతను మరింత మెరుగుపరిచే దిశగా చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగానే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని తెలిసింది.
Also Read..