మూడు పార్టీలకు ప్రెస్టీజియస్.. పట్టభద్రులు ఎవరి పక్షం?

పట్టభద్రుల ఉప ఎన్నిక అన్ని పార్టీలకు కీలకంగా మారింది.

Update: 2024-05-21 01:49 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : పట్టభద్రుల ఉప ఎన్నిక అన్ని పార్టీలకు కీలకంగా మారింది. ప్రచారానికి మరో నాలుగు రోజుల సమయం మాత్రమే ఉండడంతో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ స్పీడ్‌ను పెంచాయి. అధికారంలోకి వచ్చాక చేపట్టిన ఉద్యోగ నియామకాలు, ఉద్యోగ సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ వివరిస్తుంటే.. తొమ్మిదిన్నరేళ్లలో చేసిన సంక్షేమాన్ని బీఆర్ఎస్ చెబుతున్నది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తూ బీజేపీ ముందుకెళ్తున్నది. అయితే పట్టభద్రులు ఎవరివైపు నిలుస్తారనేది ఆసక్తికరంగా మారింది.

సంక్షేమాన్ని వివరిస్తూనే..

ఈ ఎమ్మెల్సీ సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ తరపున తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి బరిలో ఉన్నారు. వీరితో పాటు పార్టీ నాయకులు మూడు ఉమ్మడి జిల్లాల్లో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వచ్చాక చేపట్టిన అభివృద్ధి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్, 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు, 200 యూనిట్లలోపు ఉచిత కరెంటు గురించి కాంగ్రెస్ నేతలు వివరిస్తూ యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తొమ్మిదిన్నరేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమం, ఉద్యోగ కల్పన, పరిశ్రమల స్థాపన తదితర అంశాలు, ఆరునెలల్లోనే కాంగ్రెస్ వైఫల్యాలను బీఆర్ఎస్ వివరిస్తున్నది. కేంద్రంలో చేపట్టిన అభివృద్ధి, రాష్ట్రానికి ఇచ్చిన నిధులు కేటాయింపు తదితరఅంశాలతో బీజేపీ ప్రచారం చేస్తున్నది.

ఆగ్రహంగా నిరుద్యోగులు, ఉద్యోగులు

ఖమ్మం –నల్లగొండ- వరంగల్ మూడు ఉమ్మడి జిల్లాల్లో 4,61,806 మంది పట్టభద్రుల ఓటర్లు ఉన్నారు. వరంగల్‌లో 1,72,524, నల్లగొండలో 1,65,778, ఖమ్మంలో 1,23,504 మంది ఓటు హక్కు కలిగి ఉన్నారు. వీరిలో నిరుద్యోగులే అధికం కాగా, ఉద్యోగ, ఉపాధ్యాయులు సైతం ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇక్కడి నుంచి స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నా.. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్యనే ప్రధాన పోటీ నెలకొని ఉన్నది. అయితే నిరుద్యోగులతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయులు మూడు పార్టీల పట్ల కూడా గుర్రుగానే ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడుస్తున్నా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకపోవడం, సరైన నోటిఫికేషన్లు వేయకపోవడం, నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడంతో నిరుద్యోగులు ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తున్నది. పీఆర్సీపై ఉద్యోగులు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇచ్చిన హామీ ప్రకారం రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేయకపోవడంతో నిరుద్యోగులు మండిపడుతున్నారు. గత తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనలో టీఎస్పీఎస్సీ అక్రమాలు, ఉద్యోగ నియామకాలు చేపట్టకపోవడంతో నిరుద్యోగులు, 317 జీఓ తీసుకురావడం పట్ల ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు. అయితే మూడు పార్టీల పనితీరుపై ఆగ్రహంతో ఉన్న పట్టభద్రులు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేస్తారనేది మాత్రం హాట్ టాపిక్‌గా మారింది.

వరంగల్ కీలకం

ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ఉమ్మడి వరంగల్ జిల్లా పట్టభద్రులు కీలకం కానున్నారు. అత్యధికంగా ఇక్కడే 1,72,524 మంది ఓట్లర్లు ఉన్నారు. దీంతో అన్ని పార్టీలు ఇక్కడ ప్రత్యేక దృష్టిసారించాయి. బూత్ స్థాయి కమిటీలను నియమించి ప్రతి ఓటరును కలిసేలా చర్యలు తీసుకుంటున్నాయి. అయితే ఓటర్లంతా విద్యావంతులే కావడంతో రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి పట్టం కడతారా? ప్రతిపక్షపార్టీ అభ్యర్థులను ఆదరిస్తారా? అనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Tags:    

Similar News