రుణమాఫీ గైడ్ లైన్స్ రిలీజ్.. రూ.2 లక్షలకు పైగా లోన్ ఉన్న రైతులు ఏం చేయాలంటే..?

రూ.2 లక్షల రైతు రుణమాఫీ ప్రాసెస్‌ను ప్రభుత్వం స్పీడప్ చేసింది. ఆగస్ట్ 15వ తేదీ లోపు రుణమాఫీ పూర్తి చేయాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకోగా..

Update: 2024-07-15 11:44 GMT

దిశ, వెబ్‌డెస్క్: రూ.2 లక్షల రైతు రుణమాఫీ ప్రాసెస్‌ను ప్రభుత్వం స్పీడప్ చేసింది. ఆగస్ట్ 15వ తేదీ లోపు రుణమాఫీ పూర్తి చేయాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకోగా.. తాజాగా రూ. 2లక్షల రుణమాఫీకి వ్యవసాయ శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. రేషన్ కార్డు ప్రమాణికంగా తెలంగాణలో భూమి కలిగిన ప్రతి రైతుకు రూ.2 లక్షల మాఫీ చేస్తామని తెలిసింది. 2018 డిసెంబర్ 12 నుండి 2023 డిసెంబర్ 9 వరకు వడ్డీ, అసలు కలిపి రెండు లక్షలు వరకు ఉన్న బకాయిలను మాఫీ చేస్తామని పేర్కొంది. అయితే, రూ.2 లక్షల కంటే ఎక్కువగా రుణం ఉంటే ఏం చేయాలని రైతుల్లో సందేహాం నెలకొన్నది. ఈ క్రమంలో ప్రభుత్వం దీనిపై క్లారిటీ ఇచ్చింది. రూ. 2 లక్షల కంటే ఎక్కువ పంట లోన్ ఉన్న రైతులు.. రూ.2 లక్షలకు పైన ఉన్న రుణాన్ని మొదట కట్టాలి. ఆ తర్వాత అర్హత ఉన్న రైతులకు ప్రభుత్వం మాఫీ కింద రూ.2 లక్షలను రైతు ఖాతాలో జమ చేస్తుంది.

ఉదహరణకు, ఒక రైతు బ్యాంక్ నుండి రూ.3 లక్షల పంట రుణం తీసుకుంటే మొదటగా ఆ రైతు రెండు లక్షలకు పైన ఉన్న లక్ష రూపాయలను బ్యాంక్‌కు చెల్లించాలి. అనంతరం ప్రభుత్వం మిగిలిన రూ.2 లక్షలను లబ్దిదారుడి ఖాతాలో జమ చేస్తుంది. కాగా, గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తే రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. పదేళ్ల తర్వాత తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ.. రైతులకు ఇచ్చిన మేరకు రుణమాఫీకి కసరత్తు స్టార్ట్ చేసింది. ఆగస్ట్ 15 లోపు రూ.2 లక్షల రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకుంది. ఇందులో భాగంగానే ఇవాళ గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. ఈ నెల చివరి నుండి రుణమాఫీ ప్రాసెస్ మొదలుపెట్టి ఆగస్ట్ 15 నాటికి ఫినిష్ చేయనున్నట్లు టాక్.

Tags:    

Similar News