ఎస్సీలు ఎంత ప్రయోజనం పొందారు..?.. లెక్కలు తీసే పనిలో సర్కార్
ఎస్సీ ఎంప్లాయీస్ ఎంత మంది ఉన్నారు? అందులో మాలలు సంఖ్య ఎంత ? మాదిగలు ఎంత మంది? ఇతర ఉపకులాల వారు ఎంత మంది పనిచేస్తున్నారు? అనే లెక్కలు తీసే పనిలో ప్రభుత్వం ఉంది.
దిశ, తెలంగాణ బ్యూరో: ఎస్సీ ఎంప్లాయీస్ ఎంత మంది ఉన్నారు? అందులో మాలలు సంఖ్య ఎంత ? మాదిగలు ఎంత మంది? ఇతర ఉపకులాల వారు ఎంత మంది పనిచేస్తున్నారు? అనే లెక్కలు తీసే పనిలో ప్రభుత్వం ఉంది. ఈ మేరకు ఆర్థిక శాఖ అన్ని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, సొసైటీలు, యూనివర్సిటీల నుంచి వివరాలు సేకరిస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ వివరాలను ఎస్సీ కులాల వర్గీకరణపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీకు అందించనుంది. ఎస్సీ కులాల్లో ఉన్న ఆర్థిక, ఉద్యోగ పరిస్థితులను అంచనా వేసేందుకు ఎంప్లాయీస్ వివరాలను సేకరిస్తున్నట్టు తెలిసింది.
ఎవరు ఎక్కువ ప్రయోజనం పొందారు?
ఎస్సీ కులాల వర్గీకరణపై సీరియస్‌గా కసరత్తు చేస్తోన్న సర్కారు ఇప్పటి వరకు రిజర్వేషన్లతో లబ్ధిపొందిన కులాల వివరాలను సేకరిస్తున్నది. ఇప్పటివరకు ప్రభుత్వ ఉద్యోగుల్లో మాల, మాదిగ, ఉపకులాల వాటా ఎంత ఉందని లెక్కలు తీస్తున్నారు. ఆ వివరాలను తమకు సమర్పించాలని కేబినెట్ సబ్ కమిటీ ఆదేశించినట్టు తెలుస్తున్నది. దీనితో యుద్ధప్రాతిపదికన వివిధ శాఖలు, కార్పొరేషన్లు, సొసైటీలు, వర్సిటీలు తమ వద్ద పనిచేస్తోన్న ఎస్సీ ఎంప్లాయీస్, వారి కులం వివరాలను అందిచినట్టు సమాచారం. ఇప్పటివరకు రిజర్వేషన్లు ఉపయోగించుకుని ఏ కులం ఎక్కువగా ప్రయోజనం పొందింది? ఏ కులం తక్కువ ప్రయోజనం పొందింది? అనే అవగాహన కోసం సబ్ కమిటీ వివరాలు అడిగినట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం అమలవుతోన్న 15 % రిజర్వేషన్లలో ఏ ఎస్సీ కులానికి ఎంత శాతం రిజర్వేషన్లు ఇస్తే బాగుంటుందోనని రికమెండ్ చేసే వెసులుబాటు గురించి సబ్ కమిటీ ఎస్సీ ఎంప్లాయీస్‌ను వివరాలను అడిగినట్టు తెలుస్తున్నది.
త్వరలో ఏకసభ్య కమిషన్ యాక్టివిటీస్?
ఎస్సీ కులాల వర్గీకరణ కోసం ప్రభుత్వం జస్టిస్ షమీమ్ అక్తర్‌ను ఏకసభ్య కమిషన్‌గా నియమించింది. రెండు మూడు రోజుల్లో కమిషన్ యాక్టివిటీస్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వర్గీకరణ కోసం న్యాయపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కమిషన్ ప్రభుత్వానికి సిఫారసులు చేయనుంది. అందులో భాగంగా వర్గీకరణపై ఇప్పటివరకు ప్రభుత్వానికి అందిన విజ్ఞప్తులు, అభ్యంతరాలను కూడా కమిషన్ పరిశీలించడంతో పాటు వర్గీకరణపై ఎస్సీకుల సంఘాల నుంచి నేరుగా అభిప్రాయాలు, అభ్యంతరాలు, సూచనలు తీసుకునే చాన్స్ ఉన్నట్టు తెలుస్తున్నది.