ఫలించిన పోరాటం.. 2009 బ్యాచ్ ఎస్‌ఐలకు ప్రభుత్వం తీపికబురు
ఎట్టకేలకు 2009వ సంవత్సరం బ్యాచ్ సబ్ ఇన్స్పెక్టర్ల పదోన్నతులకు సంబంధించిన సమస్యకు పరిష్కారం లభించినట్టు తెలిసింది. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ప్రమోషన్ల విషయంపై ఉన్నతాధికారులు
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో :ఎట్టకేలకు 2009వ సంవత్సరం బ్యాచ్ సబ్ ఇన్స్పెక్టర్ల పదోన్నతులకు సంబంధించిన సమస్యకు పరిష్కారం లభించినట్టు తెలిసింది. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ప్రమోషన్ల విషయంపై ఉన్నతాధికారులు త్వరలోనే ఉత్తర్వులు జారీ చెయ్యనున్నట్టు సమాచారం.2009లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చిన నోటిఫికేషన్ ద్వారా హైదరాబాద్ రేంజ్ (మల్టీ జోన్ 2) నుంచి 434 మంది, వరంగల్ రేంజ్ (మల్టీ జోన్ 1) నుంచి 150 మంది ఎస్సైలుగాపోలీస్ శాఖలో చేరారు. ఆ తర్వాత వరంగల్ రేంజ్ నుంచి చేరిన 150 మంది ఎస్సైలు ఇన్స్ పెక్టర్లుగా పదోన్నతులు పొందారు. ఇక, హైదరాబాద్ రేంజ్ నుంచి జాయిన్ అయిన వారిలో 220 మందికి పదోన్నతులు వచ్చాయి. మిగిలిన 214 మంది ఎస్సైలకు మాత్రం ప్రమోషన్లు రాలేదు.
అయితే, వీరి తర్వాత 2012 లో ఎస్సైలుగా చేరిన 40 మందికి సీఐ ప్రమోషన్లు వచ్చాయి. దీనివల్ల 2009 బ్యాచ్ ఎస్సైలు 214 మంది తమ బ్యాచ్ తోపాటు తమకన్నా జూనియర్లుగా పని చెయ్యాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో పదోన్నతి రాని ఎస్సైలు తీవ్ర మానసిక వేదన అనుభవించారు. కొంతకాలం క్రితం ప్రభుత్వం జారీ చేసిన 317 జీవో నేపథ్యంలో డీజీపీ అంజనీ కుమార్ రూల్స్ మార్చి ఒకే రాష్ట్రం ఒకే పదోన్నతిగా విధివిధానాలు రూపొందించారు. అయితే, ఈ ఫైల్ సీఎం వద్ద పెండింగ్ లో ఉండిపోయింది. కాగా, కొత్త.. పాత రూల్స్ ప్రకారం ఎలా చూసినా 2009 బ్యాచ్ ఎస్సైలు పదోన్నతులకు అర్హులే అని బాధిత అధికారులు చెబుతూ వచ్చారు. న్యాయం చేయాలంటూ ఏడాదిన్నరగా ప్రభుత్వం.. పై అధికారులను కోరుతూ వచ్చారు. ఈ క్రమంలో దాదాపు 50 వినతిపత్రాలు సమర్పించారు. సీఎం కార్యాలయం దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. వీరి పోరాటం ఫలించి త్వరలోనే ప్రమోషన్లకు సంబంధించిన ఫైల్ ను క్లియర్ చెయ్యటానికిప్రభుత్వం, పోలీస్ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.