మ‌హిళా భ‌ద్రత కోసం త్వర‌లో ప్రభుత్వ క‌మిటీ : మంత్రి సీత‌క్క

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మ‌హిళా భ‌ద్రత కోసం త్వరలో ప్రభుత్వం కమిటీ వేస్తుందని రాష్ట్ర మ‌హిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధ‌న‌స‌రి అన‌సూయ సీత‌క్క తెలిపారు.

Update: 2024-08-13 17:03 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మ‌హిళా భ‌ద్రత కోసం త్వరలో ప్రభుత్వం కమిటీ వేస్తుందని రాష్ట్ర మ‌హిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధ‌న‌స‌రి అన‌సూయ సీత‌క్క తెలిపారు. మహిళా భద్రతకు తీసుకోవాల్సిన చ‌ర్యల‌పై మంగళవారం స‌చివాల‌యంలో మంత్రి స‌మీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో మ‌హిళ‌ల‌ భ‌ద్రత కోసం త్వర‌లో స్పెష‌ల్ డ్రైవ్ చేప‌ట్టనున్నట్లు తెలిపారు. మ‌హిళా శిశు సంక్షేమ శాఖ కార్యద‌ర్శి వాకాటి క‌రుణ‌, సెర్ప్ సీఈఓ దివ్యా దేవ‌రాజన్, మహిళా భద్రతా విభాగం డీజీ షిఖా గోయల్, డీఐజీ రెమా రాజేశ్వరితో స్పెష‌ల్ డ్రైవ్ విధి విధానాల‌పై చ‌ర్చించారు. స్వల్పకాలిక ప్రణాళిక‌ల‌తో పాటు దీర్ఘకాలిక ప్రణాళిక‌లు సిద్దం చేయాల‌ని మంత్రి సూచించారు. సొంత నివాసాల్లో, ద‌గ్గరి మ‌నుషుల నుంచి మ‌హిళ‌లకు వేధింపులు పెర‌గ‌డం బాధాక‌రమన్నారు. బాధిత మ‌హిళ‌లు బహిరంగంగా మాట్లాడేలా ధైర్యం క‌ల్పిస్తామ‌న్నారు. స‌మాజంలో ఆలోచ‌న మారే విధంగా ప్రణాళిక రూపొందిస్తామని వెల్లడించారు. విద్యా సంస్థలు, ఇత‌ర సంస్థల్లో అవగాహన క్యాంపేయిన్ లు చేప‌డుతామ‌న్నారు. మ‌హిళా మంత్రులు, ఉన్నతాధికారుల‌తో ఉన్నత స్థాయి క‌మిటీ ఏర్పాటు చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నామ‌న్నారు. మ‌హిళా భ‌ద్రత కోసం స్వయం స‌హాయ‌క సంఘాల స‌హాయాన్ని తీసుకుంటామ‌న్నారు. మ‌హిళా సంఘాల్లో 63 ల‌క్షల మంది స‌భ్యులున్నారని.. మ‌హిళా సంఘ సభ్యుల‌తో గ్రామ స్థాయి నుంచి సోష‌ల్ యాక్షన్ క‌మిటీలు ఏర్పాటు చేస్తామ‌న్నారు. మ‌హిళ‌ల‌ను వేధించ‌కుండా పురుషుల‌కూ అవ‌గాహ‌న కార్యక్రమాలు నిర్వహించాల‌ని స‌మావేశంలో నిర్ణయించారు. మ‌హిళ‌ల‌ను గౌర‌వించ‌డం, నేరాలు జ‌రిగిన‌ప్పుడు ప‌డే శిక్షల‌పై చిన్నప్పటి నుంచే అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని ఇందుకోసం పాఠ్యాంశాల్లోనూ వీటిని చేర్చాల‌ని అభిప్రాయం వ్యక్తం చేసారు. కాగా ఇదే అంశంపై మ‌రోసారి స‌మావేశమ‌వ్వాల‌ని నిర్ణయించారు.  


Similar News