యూట్యూబ్ ఛానళ్ళకు గుర్తింపు ఎలా?.. అక్రెడిటేషన్ కార్డుల జారీకి నిబంధనలేంటి?

కేంద్ర సమాచార ప్రసారాల మంత్రిత్వశాఖ (ఐ అండ్ బీ), రిజిస్ట్రార్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఫర్ ఇండియా (ఆర్ఎన్ఐ) తదితర ప్రభుత్వ సంస్థల నుంచి రిజిస్ట్రేషన్లు చేసుకోని యూట్యూబ్ ఛానెళ్ళ గుర్తింపు కోసం తెలంగాణ మీడియా అకాడమీ కసరత్తు మొదలుపెట్టింది.

Update: 2024-09-23 17:29 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర సమాచార ప్రసారాల మంత్రిత్వశాఖ (ఐ అండ్ బీ), రిజిస్ట్రార్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఫర్ ఇండియా (ఆర్ఎన్ఐ) తదితర ప్రభుత్వ సంస్థల నుంచి రిజిస్ట్రేషన్లు చేసుకోని యూట్యూబ్ ఛానెళ్ళ గుర్తింపు కోసం తెలంగాణ మీడియా అకాడమీ కసరత్తు మొదలుపెట్టింది. ఈ ఛానెళ్ళను గుర్తించాలంటే ఏయే అంశాలను ప్రామాణికంగా తీసుకోవాలని సీనియర్ పాత్రికేయులతో పాటు ఆ ఛానెళ్ళ ప్రతినిధుల అభిప్రాయాలను సేకరిస్తున్నది. అందులో తొలి మెట్టుగా రౌండ్ టేబుల్ సమావేశాన్ని సోమవారం నిర్వహించింది. పత్రికలకు ఆర్ఎన్ఐ సర్టిఫికేషన్ గుర్తింపుగా ఉంటుందని, టీవీ ఛానెళ్ళకు ఐ అండ్ బీ లైసెన్స్ ఒక సర్టిఫికేషన్‌గా పనిచేస్తుందని, అదే తరహాలో యూ ట్యూబ్ ఛానెళ్ళకు ప్రభుత్వ గుర్తింపు ఉండాలంటే పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలపై చర్చను లేవనెత్తింది. అనేక రకాల అభిప్రాయాలు వ్యక్తం కావడంతో వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి... మరికొన్ని సమావేశాలు నిర్వహించిన తర్వాతనే స్పష్టత వస్తుందని తెలిపారు.


యూట్యూబ్ ఛానెళ్ళను గుర్తించడంతో పాటు అందులో పనిచేస్తున్నవారు జర్నలిస్టులు అయినందున ప్రభుత్వం నుంచి జారీ అయ్యే అక్రెడిటేషన్ కార్డుల జారీకి అనుసరించాల్సిన విధివిధానాలపైనా ఈ సమావేశంలో చర్చ జరిగింది. కంపెనీ యాక్ట్ కింద ఆ యూ ట్యూబ్ ఛానెళ్ళు రిజస్టర్ కావాలి... ప్రభుత్వం విభాగంలో విధిగా రిజిస్ట్రేషన్ తీసుకోవాలి... లేబర్ డిపార్టుమెంటులో రిజిస్ట్రేషన్‌తో పాటు ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి... పోస్టల్ లైసెన్స్ ఉండాలి... రిజిస్టర్డ్ ట్రేడ్ మార్క్ లైసెన్స్ కలిగి ఉండాలి... జిఎస్టీ రిజిస్ట్రేషన్‌తో పాటు క్రమం తప్పకుండా రిటన్‌లు సమర్పిస్తూ ఉండాలి... నిబంధనలకు అనుగుణంగా ఆఫీస్ సెటప్ ఉండాలి... లేబర్ రూల్స్ ప్రకారం సిబ్బంది నియామకాలు, పేమెంట్స్, పీఎఫ్ ఖాతా తదితరాలు ఉండాలి... ఇలాంటి అనేక రకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ప్రస్తుతం పత్రికలు, టీవీ ఛానెళ్ళకు ఉన్నట్లుగా వెబ్‌సైట్‌ నిర్వహించుకోడానికి నిబంధనలు ఉన్నట్లుగానే యూ ట్యూబ్ ఛానెళ్ళకు కూడా నిర్దిష్టమైన విధానాలు అమలు కావాలని పలువురు పేర్కొన్నారు.

ఇదే సమయంలో ఇలాంటి ఆంక్షలు పెట్టడం ద్వారా భావ ప్రకటనా స్వేచ్ఛకు పరిమితులు విధించడమేననే అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని మరికొందరు వ్యాఖ్యానించారు. వార్తలు, చర్చాగోష్ఠులు, ఇంటర్‌వ్యూలు, ప్రత్యేక కథనాలు ప్రసారం చేస్తున్న యూ టూయబ్ ఛానెళ్ళలో కొన్ని రాజకీయ పార్టీలకు అనుకూలంగా, మరికొన్నింటికి వ్యతిరేకంగా ఉద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో స్వీయ నియంత్రణపైనా ఈ సమావేశంలో చర్చ జరిగింది. ఆ యూ ట్యూబ్ ఛానెళ్ళకు ఉండే సబ్‌స్క్రైబర్, వ్యూస్‌ గణాంకాలను ప్రధాన క్రైటేరియగా తీసుకోరాదని, ఈ రెండూ అంగట్లో సరుకుల్లాగా మారినందున అవి వాస్తవికతగా పరిగణనలోకి తీసుకోలేమన్న అభిప్రాయం కూడా వ్యక్తమైంది. వ్యక్తిగత ఎజెండాలతో, ద్వేషాలతో, కక్షపూరిత ధోరణులతో, సమాజాన్ని తప్పుదోవ పట్టించే వైఖరితో ప్రసారాలు చేస్తున్న యూ ట్యూబ్ ఛానెళ్ళను పరిగణలోకి తీసుకోకపోవడమే మంచిదనే అభిప్రాయాన్నీ పలువురు వ్యక్తం చేశారు.

ఎలాంటి చట్టబద్దత లేకుండా యూట్యూబ్ ప్లాట్‌ఫామ్ మీద వేలాది ఛానెళ్లు ఉనికిలోకి వస్తున్నాయని, హద్దు అదుపూ లేకుండా చెలామణి అవుతున్నాయని, వాటికి ప్రభుత్వ గుర్తింపు ఇవ్వడం ద్వారా మీడియా వ్యవస్థకే మచ్చ కలుగుతుందని కూడా మరికొందరు అభిప్రాయపడ్డారు. యూట్యూబర్స్ చేస్తున్న ప్రసారాలు జర్నలిజం నైతిక ప్రమాణాలకు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉన్నదని వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో వ్యక్తమైన అన్ని వాదనలనూ పరిగణనలోకి తీసుకున్న మీడియా అకాడమీ... ఇప్పటికిప్పుడు స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకోలేమని, మరికొన్ని సమావేశాలు నిర్వహించాల్సిన అవసరం ఉన్నదనే అభిప్రాయానికి వచ్చింది. మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, మొదటిసారి ఇలాంటి రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించామని, భవిష్యత్తులో మరిన్ని నిర్వహించి లోతుగా చర్చించిన తర్వాతనే స్పష్టతకు రాగలుగుతామన్నారు. సమకాలీన పరిస్థితుల్లోని సామాజిక పరిణామాలను దృష్టిలో పెట్టుకుని అన్ని అభిప్రాయాలనూ పరిశీలించాల్సి ఉంటుందన్నారు.

మొదటిసారి ఇలాంటి సమావేశాన్ని నిర్వహించడానికి చొరవ తీసుకున్న మీడియా అకాడమీని సీనియర్ పాత్రికేయులు, అభిప్రాయాలను వెలిబుచ్చిన జర్నలిస్టులు అభినందించారు. సియాసత్ మేనేజింగ్ ఎడిటర్ (ఎమ్మెల్సీ) ఆమెర్ ఆలీ ఖాన్, ఆంధ్రజ్యోతి ఎడిటర్ శ్రీనివాస్, ముఖ్యమంత్రి చీఫ్ పీఆర్వో అయోధ్యరెడ్డి, మీడియా అకాడమీ పూర్వాధ్యక్షులు అల్లం నారాయణ, సీనియర్ సంపాదకులు దిలీప్‌రెడ్డి, కట్టా శేఖర్‌రెడ్డి, జర్నలిజం ప్రొఫెసర్ పద్మజా షా, సీనియర్ పాత్రికేయులు ఎంఏ మాజీద్, కరుణాకర్ దేశాయ్, మార్కండేయ, భరత్, స్వరూప, జర్నలిస్ట్ యూనియన్ నాయకులు విరహత్ అలీ, సోమయ్య, పలు యూట్యూబ్ ఛానళ్ల ప్రతినిధులు, రాష్ట్ర సమాచార పౌర సంబంధాల విభాగం జాయింట్ డైరెక్టర్ జగన్, మీడియా అకాడమీ సెక్రటరీ వెంకటేశ్వరరావు, తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.


Similar News