దయచేసి వారికి ఇబ్బందులు లేకుండా చూడండి.. సీఎం రేవంత్‌కు గూడూరు విజ్ఞప్తి

రాష్ట్రంలోని పాడి రైతులను, పాల ఉత్పత్తిదారులను కాపాడాలని, వారికి తక్షణమే మేలు చేయాలని బీజేపీ నాయకుడు గూడూరు నారాయణరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు.

Update: 2024-09-23 17:03 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని పాడి రైతులను, పాల ఉత్పత్తిదారులను కాపాడాలని, వారికి తక్షణమే మేలు చేయాలని బీజేపీ నాయకుడు గూడూరు నారాయణరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. ప్రభుత్వ డెయిరీ కంపెనీలు మూడు నెలలుగా రైతులకు బిల్లులు చెల్లించడంలేదని, దీంతో పాల ఉత్పత్తిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పాడి రైతులు తమ పశువులను పోషించలేక కబేళాలకు అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. రైతుల పశుగ్రాసాన్ని కొనుగోలు చేయలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

గతంలో విజయ డెయిరీ, ప్రభుత్వ యాజమాన్యంలోని డెయిరీ డెవలప్‌మెంట్ కంపెనీలు ప్రతి పదిహేను రోజులకు బిల్లులు చెల్లించేవని, అయితే తాజాగా మూడు నెలలుగా రైతులకు బిల్లులు అందడం లేదన్నారు. ఇదిలా ఉండగా రుణమాఫీ పథకం అందరికీ అమలవ్వలేదని దీంతో ఇతర రైతులు సైతం తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని గూడూరు నారాయణరెడ్డి తెలిపారు. రైతు భరోసా కూడా అవ్వలేదని పేర్కొన్నారు. దీంతో రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రాజకీయాలు కాకుండా ముఖ్యమంత్రి.. ప్రజా సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు. అలాగే ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చాలని గూడూరు నారాయణ రెడ్డి డిమాండ్ చేశారు.


Similar News