ఆ విషయంలో నాకు అనుమానం ఉంది.. మరోసారి గవర్నర్ Governer ఆసక్తికర వ్యాఖ్యలు
తన ఫోన్ ట్యాపింగ్‌కు గురవుతోందనే అనుమానం ఉందని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: తన ఫోన్ ట్యాపింగ్‌కు గురవుతోందనే అనుమానం ఉందని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ప్రైవసీకి భంగం కలిగేలా ఫోన్ ట్యాప్ చేస్తున్నారని ఈ నెల ఆరంభంలో ఆరోపణలు చేసిన గవర్నర్.. తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరోసారి ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నా ప్రైవసీకి భంగం వాటిల్లుతోంది. గవర్నర్ విషయంలో రాష్ట్రంలో అప్రజాస్వామిక పరిస్థితి నెలకొందని ఆమె అన్నారు. తాను హాజరయ్యే కార్యక్రమాలకు సీఎం కేసీఆర్ తో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కావడం లేదు. ప్రోటోకాల్ పాటించడం లేదు. మా అమ్మ చనిపోతే రాష్ట్రపతి, ప్రధాని ఫోన్ చేసి పరామర్శించినా కేసీఆర్ మాత్రం పరామర్శించలేదన్నారు. ఆగస్టు 15న రాజ్ భవన్ లో జరిగిన ఎట్ హోమ్ కార్యక్రమానికి సీఎం వస్తారని సమాచారం ఇచ్చారు.
సీఎం కోసం తనతో పాటు హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎదురు చూసినా ఆయన రాలేదు. కనీసం హాజరు కావడం లేదనే సమాచారాన్ని కూడా ఇవ్వలేదు. అసెంబ్లీలో తన ప్రసంగం లేకుండా వివక్ష చూపుతున్నారని ఇందు కోసం ఏకంగా అసెంబ్లీలో గవర్నర్ స్పీచ్ అవసరం లేదంటూ తీర్మానం చేశారు ఇదేం వివక్ష అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఇంటర్వ్యూలో పలు అంశాలపై స్పందించిన తమిళిసై.. తాను మహిళా గవర్నర్ అనే కారణంతోనే వివక్ష చూపుతున్నారని తెలంగాణ గవర్నర్ ను అగౌరవపరిచిన చరిత్ర లిఖించబడుతోందని అన్నారు. టీఆర్ఎస్ నేతలు తనను ట్రోల్ చేస్తున్నారని, అగ్నిపథ్ విషయంలో సికింద్రాబాద్ లో ఆందోళన సందర్భంగా రాజ్ భవన్ కు వెళ్లి ఆందోళన చేయాలని కోరుతూ కొందరూ ట్వీట్లు చేశారు. వారికి గవర్నర్ పట్ల ఎలాంటి గౌరవం ఉందో ఆలోచన చేయాలన్నారు. గవర్నర్ పై జరుగుతున్న అవమానాలకు రాష్ట్ర ప్రభుత్వం జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా గవర్నర్ తాజా వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయ్యాయి. గవర్నర్ ఉద్దేశపూర్వకంగానే బీజేపీకి అనుకూలంగా వ్యవహిస్తోందని అందువల్లే ప్రభుత్వం పంపిన బిల్లులు పెండింగ్ లో ఉంచిందని టీఆర్ఎస్ సానుభూతి పరులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
Also Read......