బడ్జెట్ సమావేశాలపై స్పందించిన తమిళిసై.. ప్రభుత్వ తీరుపై అసంతృప్తి

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానుండడంపై గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ స్పందించారు.

Update: 2022-03-05 16:17 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానుండడంపై గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ స్పందించారు. ఆనవాయితీ, సంప్రదాయం ప్రకారం తన ప్రసంగం లేకుండానే ఈ సమావేశాలు ప్రారంభం కావడం రాజ్యాంగ నిబంధనల ప్రకారం, సాంకేతికంగా సమంజసమే అయినా ఐదు నెలల విరామం తర్వాత కూడా 'గత సెషన్ కొనసాగింపు మాత్రమే' అని ప్రభుత్వం పేర్కొనడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సంప్రదాయం ప్రకారం బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ చేసే ప్రసంగం కేవలం రాజ్‌‌భవన్ కార్యాలయం రూపొందించే స్పీచ్ కాపీ కాదని, రాష్ట్ర ప్రభుత్వం గడచిన ఏడాది కాలంలో చేపట్టిన కార్యాచరణకు సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్టు అని మీడియాకు శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ పేర్కొన్నారు.

గవర్నర్ ప్రసంగం లేని కారణంగా ఈ సమావేశాల్లో సభా ముఖంగా ప్రభుత్వాన్ని, దాని పనితీరును చర్చించే అవకాశాన్ని సభ్యులు కోల్పోతున్నారని గవర్నర్ ఆ ప్రకటనలో వ్యాఖ్యానించారు. సభలో అర్థవంతమైన చర్చలకు, పరిపాలనా సంబంధమైన అంశాలను ప్రస్తావించడానికి గవర్నర్ ప్రసంగం ఒక అవకాశంగా ఉంటుందన్నారు. ఇప్పుడు తన ప్రసంగం లేకపోవడంతో సభ్యులు ప్రభుత్వ విధానాలపైనా, గతేడాది కార్యాచరణపైనా చర్చించే అవకాశాన్ని కోల్పోయినట్లయిందన్నారు. రాజ్యాంగాని లోబడి నిబంధనల ప్రకారమే ప్రస్తుత బడ్జెట్ సమావేశాలు గతేడాది ముగిసిన సమావేశాలకు కొనసాగింపుగా ప్రభుత్వం పేర్కొంటున్నదని, అందువల్లనే గవర్నర్ ప్రసంగం ఉండదని పేర్కొన్నదని ఆమె గుర్తుచేశారు.

ప్రభుత్వం తన విజ్ఞత ప్రకారం సాంకేతిక అంశాలను ఉదహరించి గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలను నిర్వహిస్తున్నదని తమిళిసై ఆ ప్రకటనలో పేర్కొన్నారు. గవర్నర్ ప్రసంగంతోనే బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయంటూ ప్రభుత్వం తొలుత తనకు చెప్పిందని ఆమె గుర్తుచేశారు. ఆర్థిక బిల్లును ప్రవేశపెట్టేందుకు తన సిఫారసును ప్రభుత్వం కోరిందని, అదే సందర్భంలో గవర్నర్ ప్రసంగం ఉండదని ప్రభుత్వం ఇప్పుడు చెప్పడం సరికాదని ఆమె పేర్కొన్నారు. అయినా రాజ్యాంగంపై గౌరవంతో, సహకార సమాఖ్య స్ఫూర్తితో రాజకీయాలకు అతీతంగా ఆర్థిక బిల్లును ప్రవేశపెట్టేందుకు సిఫారసు చేసినట్లు ఆమె నొక్కిచెప్పారు.

నిజానికి ఆర్థిక బిల్లు సిఫారసు కోసం సమయం తీసుకునే స్వేచ్ఛ తనకున్నదని, రాజ్యాంగం తనకు కొన్ని అధికారాలను కల్పించిందని, కానీ ప్రజా సంక్షేమాన్ని గమనంలోకి తీసుకుని ఆర్థిక బిల్లును ప్రవేశపెట్టడానికి సిఫారసు చేశానని గుర్తుచేశారు. ప్రజా సంక్షేమాన్ని ప్రాధాన్యతగా భావించినందునే ఈ నిర్ణయం తీసుకున్నానని, ప్రభుత్వం తలపెట్టిన సంక్షేమం వెనకపట్టు పట్టవద్దనే భావనే ఇందుకు కారణమని నొక్కిచెప్పారు. గవర్నర్ ప్రసంగం లేని కారణంగా ప్రభుత్వ పనితీరుపైనా, గతేడాది కార్యాచరణపైనా చర్చించడానికి శాసనసభ్యులకు అవకాశం లభించలేదని, వారి హక్కులకు విఘాతం ఏర్పడిందని ఆమె అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News