మెడిసిన్ సప్లై పై సర్కార్ సీరియస్

ఆసుపత్రి నుంచి కోరిన మెడిసిన్స్ అన్నీ పంపిణీ చేస్తున్నా..ఇప్పటికీ మందులు లేవనే ప్రచారం ఎందుకు జరుగుతుంది? అంటూ హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహా అధికారులను నిలదీశారు.

Update: 2025-01-06 16:54 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ఆసుపత్రి నుంచి కోరిన మెడిసిన్స్ అన్నీ పంపిణీ చేస్తున్నా..ఇప్పటికీ మందులు లేవనే ప్రచారం ఎందుకు జరుగుతుంది? అంటూ హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహా అధికారులను నిలదీశారు. సోమవారం ఎమ్ సీహెచ్ ఆర్ డీలో ఫార్మసీ, ఈ-ఔషధి వర్క్ షాపును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహా మాట్లాడుతూ..ప్రజల నిత్య జీవితంతో ముడిపడి ఉండే డిపార్ట్‌మెంట్ హెల్త్ అని గుర్తు చేశారు. అధికారులు ఇచ్చిన రిపోర్టు ప్రకారమే హెచ్‌ఆర్, ఎక్విప్‌మెంట్ అన్నీ అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. ప్రతి జిల్లాలోనూ సెంట్రల్ మెడిసినల్ స్టోర్స్ ఏర్పాటు చేశామన్నారు. మెడిసిన్ డిస్ట్రిబ్యూషన్‌కు వాహనాలు సమకూర్చామన్నారు. అన్ని సీఎంఎస్‌లు, ఫార్మసీ స్టోర్లలో కంప్యూటర్లు, ఇంటర్నెట్ ఫెసిలిటీ అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. కానీ మందులు దొరకడం లేదనే ప్రచారం ఎలా జరుగుతుంది ? అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత సూపరింటెండెంట్లపై ఉన్నదన్నారు.

నిర్లక్ష్యం ఎక్కడ జరుగుతుందో? ఆ ఆసుపత్రిలో ఎంక్వైయిరీ చేసి వేగంగా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చారు. మందుల పంపిణీలో ఈ ప్రభుత్వం సీరియస్ గా ఉన్నదన్నారు. ఇకపై ఎక్కడైనా పేషెంట్‌ ఇబ్బంది పడినట్టు తమ దృష్టికి వస్తే, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మెడిసిన్‌కు సంబంధించిన అంశంపై రెగ్యులర్ మానిటరింగ్‌ కోసం ప్రతి జిల్లాలోనూ త్రీమెన్ కమిటీని నియమిస్తున్నామన్నారు. జిల్లా డీఎంహెచ్‌వో, డీసీహెచ్‌ఎస్, జిల్లాలోని టీచింగ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ కమిటీలో ఉంటారన్నారు. అన్ని హాస్పిటల్స్‌లో మెడిసిన్ ఉండేలా కమిటీ చర్యలు తీసుకుంటుందన్నారు. సమస్యలు ఏవైనా ఉంటే ఫార్మసిస్టులు కమిటీ దృష్టికి తీసుకురావాలన్నారు. ఫార్మసిస్టులు, డాక్టర్లు, హాస్పిటల్ సూపరింటెండెంట్లు కో–ఆర్డినేషన్‌తో పని చేయాలన్నారు. ఫార్మసీలో అందుబాటులో ఉన్న మెడిసిన్ వివరాలను ఎప్పడికప్పుడు డాక్టర్లకు తెలియజేయాలన్నారు. అందుబాటులో ఉన్న మెడిసిన్ వివరాలను డాక్టర్లు, ఈ-ఔషధి పోర్టల్‌లో చెక్ చేసుకునే అవకాశం కూడా ఉన్నదన్నారు. సూపరింటెండెంట్లు, ఆర్‌ఎంవోలు ప్రతిరోజూ మార్నింగ్ హాస్పిటల్‌‌లోని ఫార్మసీ స్టోర్‌ను తనిఖీ చేయాలన్నారు. మెడిసిన్ లిస్ట్‌ చెక్ చేయాలన్నారు. మెడిసిన్ సరిగా భద్రపరుస్తున్నారా? లేదా? అనేది కూడా చూడాల్సిన బాధ్యత ఉన్నదన్నారు. ఈవర్క్ షాపులో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా, కమిషనర్ ఆర్వీ కర్ణన్, టీజీఎంఎస్‌ఐడీసి ఎండీ హేమంత్, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, డీహెచ్ రవిందర్ నాయక్, అన్ని జిల్లాల నుంచి ఫార్మసీ సూపర్‌వైజర్లు, డీఎంహెచ్‌వోలు, డీసీహెచ్‌ఎస్‌లు, టీచింగ్ హాస్పిటళ్ల సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.

ప్రైవేట్ ఆసుపత్రులపై సీరియస్ గా వ్యవహరించాలి: మంత్రి దామోదర

రాష్ట్రంలో అన్ని ప్రైవేట్ ఆసుపత్రులలో క్లినికల్ ఎస్టాబ్లిష్ యాక్ట్ ను సమర్థవంతంగా అమలు చేయాలని మంత్రి దామోదర అధికారులకు సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఏ స్థాయి హాస్పిటలైనా రూల్స్ పాటించాల్సిదేనని నొక్కి చెప్పారు. ఇక ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎన్ సీడీ క్లినిక్ లను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ లు బాధ్యత తీసుకొని విజయవంతంగా నడిపించాలన్నారు. జిల్లా స్థాయిలో డీఎమ్హెచ్ వో, డీసీహెచ్ ఎస్ లు సమన్వయంతో మెరుగైన వైద్యం అందించేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.ఇక ప్రైవేటు ఆసుపత్రులు, డయాగ్నిస్టిక్ సెంటర్ లలో సరోగసి, పీసీపీఎన్ డీటీ యాక్ట్ నిబంధన ఉల్లంఘనలకు పాల్పడే వారిపై చట్ట పరమైన చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. డీఎమ్ హెచ్ వోలు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రతి నెల 15 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను విజిట్ చేసి స్టేట్ హెల్త్ డైరెక్టర్ కు నివేదిక సమర్పించాలన్నారు.

Tags:    

Similar News