ఫార్మా కంపెనీల కోసం ప్రభుత్వం భూములు గుంజుకుంటుర్రు.. బండికి బాధితుల మొర
దిశ ప్రతినిధి, నల్లగొండ: ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో ఫార్మా కంపెనీలకు అప్పగించేందుకు తాము ఏళ్ల తరబడి సాగు
దిశ ప్రతినిధి, నల్లగొండ: ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో ఫార్మా కంపెనీలకు అప్పగించేందుకు తాము ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న అసైన్డ్ భూములను టీఆర్ఎస్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటోందని నల్లగొండ జిల్లా వెలిమినేడు గ్రామానికి చెందిన బాధితులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్‌తో మొర పెట్టుకున్నారు. తమకు జీవనాధారం ఆ భూములేనని.. అవి లేకపోతే తమకు బతుకులు లేవన్నారు.
వెలిమినేడు గ్రామానికి చెందిన పలువురు బాధితులు బుధవారం గుండ్రాంపల్లి లోని పాదయాత్ర శిబిరం వద్ద బండి సంజయ్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. 418, 415, 396, 348, 385 సర్వే నెంబర్లకు చెందిన దాదాపు 300 ఎకరాల అసైన్డ్ భూములు ఉన్నాయని, 150 కుటుంబాలు దశాబ్దాల తరబడి ఈ భూములను సాగు చేసుకుంటున్నాయని పేర్కొన్నారు.
అయినప్పటికీ ఫార్మా కంపెనీలకు అప్పగించేందుకు ప్రభుత్వం ఆ భూములను స్వాధీన పరచుకునేందుకు యత్నిస్తోందని, అందుకోసం ఇప్పటికే రెండు సార్లు నోటీసులు కూడా తమకు పంపిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రాంతంలో ఇప్పటికే 18 ఫార్మా కంపెనీలున్నాయని.. అవి వెదజల్లే కాలుష్యంతో అల్లాడిపోతున్నామని వాపోయారు. అయినా మళ్లీ టీఆర్ఎస్ నేత ఏర్పాటు చేసే ఫార్మా కంపెనీ కోసం ఆ భూములను లాక్కోవాలని యత్నిస్తున్నారని, మీరే న్యాయం చేయాలని వేడుకున్నారు. సానుకూలంగా స్పందించిన బండి సంజయ్ తప్పకుండా బాధితులకు న్యాయం జరిగేలా చూస్తానని, అందుకోసం అవసరమైన కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు.
గుండ్రాంపల్లిని చౌటుప్పల్‌లో కలపాలె..: బీఎస్కేకు వినతి
చారిత్రాత్మక పోరాటాల నేపథ్యమున్న గుండ్రాంపల్లి గ్రామాన్ని చౌటుప్పల్ మండలం లో విలీనం చేయాలని కోరుతూ ఆ గ్రామానికి చెందిన పలువురు గ్రామస్తులు బుధవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్‌కు వినతి పత్రం అందజేశారు. ప్రస్తుతం గుండ్రాంపల్లి గ్రామం 15 కిలోమీటర్ల దూరంలోని చిట్యాల మండలం లో ఉందని, అదే సమయంలో నల్లగొండ రెవిన్యూ డివిజన్‌లో ఉండటంవల్ల 50 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
తమ గ్రామానికి 8 కిలోమీటర్ల దూరంలోనే చౌటుప్పల్ మండలం తో పాటు రెవెన్యూ డివిజన్ కేంద్రం ఉందన్నారు. చౌటుప్పల్‌లో తమ గ్రామాన్ని విలీనం చేయడం ద్వారా తమకు మేలు జరుగుతుందని స్థానికులు పేర్కొన్నారు. సానుకూలంగా స్పందించిన బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఈ విషయం తీసుకువెళతానని హామీ ఇచ్చారు.