ఆ కీలక హామీని నిలబెట్టుకునేందకు సర్కార్ యాక్షన్ స్టార్ట్

నిజాం డెక్కన్ షుగర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌పై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ప్రైవేటు ఆధీనంలో ఉన్న ఈ కంపెనీని ప్రభుత్వం ఆధీనంలోకి తెచ్చుకొని నడిపేందుకు ప్రయత్నిస్తోంది.

Update: 2024-11-21 03:21 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: నిజాం డెక్కన్ షుగర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌పై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ప్రైవేటు ఆధీనంలో ఉన్న ఈ కంపెనీని ప్రభుత్వం ఆధీనంలోకి తెచ్చుకొని నడిపేందుకు ప్రయత్నిస్తోంది. అందుకు సంబంధించిన ప్రణాళికలు సైతం రూపొందించింది. అందులో భాగంగానే కన్సల్టెంట్ గా కాపిటల్ ఫార్చన్స్ ప్రైవేటు కంపెనీని ఎంపిక చేశారు. వచ్చే ఏడాది మార్చిలోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం సూచించినట్లు సమాచారం. నిజాం షుగర్స్ కు ఎన్ని ఆస్తులు ఉన్నాయి... వాటి విలువను లెక్కించి ప్రభుత్వానికి కాపిటల్ ఫార్చన్స్ అందజేయనున్నదని తెలిసింది.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు నిజాం షుగర్స్ తెరిచేందుకు ముందుడుగు వేసింది. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ కేంద్రంగా 1938లో నిజాం సర్కారు నిజాం చక్కెర కర్మాగారం ప్రారంభించింది. పరిశ్రమకు కావాల్సిన చెరుకు ఉత్పత్తి కోసం 16వేల ఎకరాల భూమిని సేకరించి చక్కెర ఉత్పత్తి ప్రారంభించింది. ఈ పరిశ్రమ ఉమ్మడి రాష్ట్రంలో మెదక్, నల్గొండ, అనంతపురం జిల్లాలను కలుపుకొని 7 యూనిట్లుగా విస్తరించింది. బోధన్, ముత్యంపేట, మొంబోజీపేట్ యూనిట్లు 51% ప్రైవేటు, 49 % ప్రభుత్వ వాటా భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. అంతర్జాతీయ ఒడిదొడుకులు ఓ వైపు, గత ప్రభుత్వ విధానాలు కూడా పరిశ్రమ నష్టాల బాట పట్టిందన్న కారణంతో 2002లో ప్రైవేటీకరించారు. అయినా నష్టాల నుంచి బయట పడకపోవడంతో 2015 డిసెంబర్‌ 23న లేఆఫ్‌గా నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ యాజమాన్యం ప్రకటించింది. ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ తెరిపించే ప్రయత్నం చేయలేదు. అయితే కాంగ్రెస్ ఎన్నికల సమయంలో తిరిగి తెరిపిస్తామని హామీ ఇచ్చింది. అందులో భాగంగానే ప్రభుత్వం మంత్రి శ్రీధర్ బాబు చైర్మన్‌గా, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సహా చైర్మన్గా నియమించింది. సిఫార్సుల కమిటీ సభ్యులుగా ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, రోహిత్‌రావు, మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్‌, ఆర్థిక, పరిశ్రమలు, వ్యవసాయ, సహకార శాఖల ముఖ్య కార్యదర్శుతో పాటు నిజాం షుగర్స్ లిమిటెడ్ ఎండీలు కూడా కమిటీ సభ్యులుగా నియమించింది. వచ్చే ఏడాది డిసెంబర్ లోగా నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు.

కన్సల్టెంట్‌గా ‘కాపిటల్‌ ఫార్చూన్స్‌’ కంపెనీ

నిజాం షుగర్ ఫ్యాక్టరీపై అధ్యయనం చేసేందుకు కాపిటల్ ఫార్చూన్ కంపెనీకి కన్సల్టెన్సీ బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. వచ్చే ఏడాది మార్చిలోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం డెడ్ లైన్ విధించింది. నిజాం షుగర్ కు ఎన్ని ఎకరాలు ఉన్నది... దాని విలువ ఎంత?...అనేదానిపై అధ్యయనం చేసి నివేదిక అందజేయనుంది. ప్రస్తుతం కంపెనీ ఆస్తుల విలువ లెక్కిస్తున్నారు. కర్మాగారాల్లోని యంత్ర పరికరాలు మరమ్మతులతో వినియోగించే స్థితిలో ఉండాలి... లేకుంటే కొత్తవి కొనుగోలుకు భారీ వ్యయం చేయాల్సి ఉంటుందనే వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే మూతపడిన కర్మాగారాలు బ్యాంకుల్లో అప్పుల్లో ఉండగా వీటికి సంబంధించి, వన్‌టైం సెటిల్మెంట్ కింద రూ.190 కోట్ల వరకు చెల్లించాల్సి ఉండగా మూడు విడతల్లో రూ.160కోట్లు చెల్లించగా, ఈ సెప్టెంబర్ లో మరో రూ.30కోట్లు చెల్లించారు. దీంతో కంపెనీకి రుణవిముక్తి లభించింది.

ప్రభుత్వమే నడపాలనే ఆలోచన?

ప్రభుత్వమే నిజాం షుగర్ ఫ్యాక్టరీని నడిపితే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే కంపెనీని నడిపి లే ఆఫ్ ప్రకటించిన ప్రైవేట్ కంపెనీ.. బ్యాంకులకు బకాయిలు చెల్లించినా తాము నడపలేమని స్పష్టం చేసింది. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కంపెనీని స్వాధీనం చేసుకొని ప్రభుత్వ భూముల్లోనూ చెరుకు పంట సాగు చేయించి నడిపితే లాభాల బాటపట్టించే అవకాశం ఉందా? అనే అంశంపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. లేకుంటే మరో ప్రైవేటు కంపెనీకి అప్పగించాలా? అనేదానిపైనా ఆరా తీస్తున్నట్లు తెలిసింది.

తొలుత మెట్ పల్లి లేదా బోధన్

మూతపడిన యూనిట్లన్నింటిని ఒకేసారి తెరిపిస్తే ఇబ్బందులు పడే అవకాశం ఉందని, అలా కాకుండా తొలుత మెట్ పల్లి లేదా బోధన్ యూనిట్ ను తెరిపించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఆ యూనిట్ తో అధ్యయనం చేయవచ్చని, లాభనష్టాలు, ఎదురయ్యే సవాళ్లను తెలుసుకోవచ్చని ప్రభుత్వం భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆ తర్వాత మిగిలిన యూనిట్లను తెరిపిస్తే మళ్లీ నష్టాలు రాకుండా ఉంటుందని, అదే విధంగా చెరుకు రైతులను సైతం ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. మరోవైపు ప్రస్తుత పరిస్థితుల్లో చక్కెర ఉత్పత్తి కంటె ఇథనాల్ బ్లెండింగ్ కు నిజాం షుగర్ యూనిట్లను ఉపయోగించుకుంటే ఎలా ఉంటుందనే ఆలోచన సైతం చేస్తున్నట్లు తెలిసింది. అయితే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది... ప్రభుత్వమే నిజాం షుగర్ కంపెనీని కొనసాగిస్తుందా? లేకుంటే ప్రైవేటు కంపెనీలకు మళ్లీ అప్పగిస్తుందా? చెరుకు రైతులకు ఎలాంటి భరోసా కల్పించనుంది... ఈకంపెనీతో ఎంతమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించనున్నదనేది హాట్ టాఫిక్ గా మారింది.

నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ: మేనిఫెస్టోలోని ప్రధాన అంశం: మంత్రి శ్రీధర్ బాబు

గత ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే నిజాం షుగర్ ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది. నిజాం షుగర్ ప్యాక్టరీల పునరుద్ధరణ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోని ప్రధాన అంశం. ఆరు నూరైనా 2025 డిసెంబర్ లోగా నిజాం షుగర్ ఫ్యాక్టరీలను తెరిపిస్తాం. ఇథనాల్, మొలాసిస్ తో పాటు చెరుకు వ్యర్థాలతో తయారయ్యే పరిశ్రమలను అనుబంధంగా నెలకొల్పితే ఫ్యాక్టరీకి 150 ఏండ్ల దాకా ఢోకా ఉండదు. శాస్త్రీయ వంగడాలు అందించి, చెరుకు రైతులను ప్రోత్సహించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుంది.

Tags:    

Similar News