గోషామహల్ బరిలో BRS కీలక నేత..?
బీఆర్ఎస్ పార్టీ పెండింగ్ పెట్టిన గోషామహల్ నియోజకవర్గం నుండి పోటీ చేయాలనుకుంటున్న ఆశావహుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది.
దిశ ప్రతినిధి, హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ పెండింగ్ పెట్టిన గోషామహల్ నియోజకవర్గం నుండి పోటీ చేయాలనుకుంటున్న ఆశావహుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. ఇప్పటికే నియోజకవర్గంలో ఎక్కువ మంది నాయకులు పార్టీ టిక్కెట్‌ను ఆశిస్తుండడంతో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఈ నియోజకవర్గాన్ని పెండింగ్ లిస్ట్‌లో ఉంచారు. అయితే తాజాగా ఈ నియోజకవర్గం నుండి పోటీ చేసే వారిలో మరో ముఖ్య నేత పేరు వినబడుతోంది.
బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ గ్రేటర్ అధ్యక్షుడు కట్టెల శ్రీనివాస్ యాదవ్ గోషామహల్ నియోజకవర్గం నుండి రాబోయే ఎన్నికలలో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఈ మేరకు సీఎం కేసీఆర్‌ను కలిసి తనకు అవకాశం ఇవ్వాలని కోరినట్లుగా తెలిసింది. ఇక్కడ బీసీలు, ప్రత్యేకించి యాదవ్ కమ్యునిటీ ఓట్లు కూడా అధికంగానే ఉంటాయి. దీంతో గెలుపు సులువు అవుతందని, తొలి సారి నియోజకవర్గంలో బీఆర్ఎస్ జెండా ఎగురవేసే అవకాశం ఉంటుందని, ఒక్క అవకాశం ఇవ్వాలని కట్టెల సీఎం కేసీఆర్‌ను కోరినట్లు విశ్వసనీయంగా తెలిసింది.