2 రోజుల్లో రుణమాఫీ మార్గదర్శకాలు..రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి పొంగులేటి
రైతు రుణమాఫీపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: రైతులకు రుణమాఫీ చేసే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తున్న వేళ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. మంగళవారం సచివాలయంలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన ఆయన.. రెండు రోజుల్లో రూ.2 లక్షల రుణమాపీ పై మార్గదర్శకాలు విడుదల చేస్తామన్నారు. అయితే రూ.2 లక్షల లోపు ఉన్న పంట రుణాలన్నింటినీ ఆగస్టు 15 లోపు మాఫీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ రుణాల మాఫీకి 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు కట్ ఆఫ్ తేదీగా ప్రభుత్వం నిర్ణయించింది. రుణమాఫీ పథకం అమలు కోసం మొత్తం రూ.31 వేల కోట్లు అవసరమవుతాయని కేబినెట్ ప్రాథమికంగా అంచనా వేసింది. అయితే రుణమాఫీకి అవసరమయ్యే నిధుల సమీకరణ ఇప్పటికే మొదలైందని మంత్రి తాజాగా స్పష్టం చేశారు. తాను ఇంత వరకు రైతుబంధు తీసుకోలేదని వెల్లడించారు. తనకు వచ్చిన చెక్ లు తిరిగి ప్రభుత్వానికే రిటర్న్ చేసినట్లు తెలిపారు.
రేపటి నుంచి రైతు భరోసాపై అభిప్రాయ సేకరణ:
తెలంగాణ రైతాంగం ఆశగా ఎదురు చూస్తున్న రైతు భరోసా స్కీమ్ పై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు చేశారు. రైతు భరోసాపై రేపు ఖమ్మం నుంచి అభిప్రాయాల సేకరణ ప్రారంభిస్తామని చెప్పారు. రైతులు, ఉద్యోగులు, మేధావులు, రైతు సంఘాల నేతల నుంచి అభిప్రాయాలు స్వీకరిస్తున్నట్టు వెల్లడించారు. కాగా రాష్ట్రంలో రైతు భరోసా విధివిధానాల రూపకల్పన కోసం ప్రభుత్వం ఇటీవలే కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సభ్యులుగా ఉన్న ఈ కమిటీ రైత భరోసా విధివిధానాలపై కసరత్తు చేస్తున్నది. త్వరలోనే ఈ పథకానికి సంబంధించి కమిటీ కీలకమైన రిపోర్ట్ ను ప్రభుత్వానికి అందజేయనున్నది.