కేసీఆర్‌ను ఓడించింది గొల్ల, కురుమలే: ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య హాట్ కామెంట్స్

తాను కూడా మంత్రి పదవిని ఆశీస్తున్నానని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు.

Update: 2024-07-08 16:13 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: తాను కూడా మంత్రి పదవిని ఆశీస్తున్నానని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. సోమవారం ఆయన సీఎల్పీలో మీడియాతో చిట్‌చాట్ చేశారు. గొల్ల కురుమలకు మంత్రి వర్గంలో స్థానం లభిస్తుందనే విశ్వాసం ఉందన్నారు. ఇదే విషయంపై సీఎంకు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు వెల్లడించారు. మంత్రితో పాటు ఎమ్మెల్సీ, ఐదు కార్పొరేషన్లు, ప్రభుత్వ సలహాదారుడు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు గొల్ల కురుమలకు కేటాయించాలని సీఎం, డిప్యూటీ సీఎం, కేబినేట్‌ను కోరుతున్నామని పేర్కొ్న్నారు. యాదవ సామాజికవర్గం తెలంగాణ‌లో అత్యధిక జనాభాను కలిగి ఉన్నదని, సీఎం న్యాయం చేస్తారనే పూర్తి నమ్మకం ఉందన్నారు. రెండో విడత కార్పొరేషన్ పదవులలో తమ సామాజిక వర్గానికి ప్రాధాన్యం దక్కుతుందని ఆశీస్తున్నామని తెలిపారు.

గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 53 శాతం గొల్ల కురుమలు కాంగ్రెస్ వైపు ఉన్నారని సర్వేలు తేల్చాయని గుర్తు చేశారు. ఏపీ ప్రభుత్వంలో యాదవులకు కీలక పదవులు ఇచ్చారని, మన స్టేట్ లోనూ ఇస్తారనే నమ్మకం ఉందని అన్నారు. సరిత తిరుపతయ్యకు జెడ్పీ చైర్మన్ పదవి కొనసాగిస్తూనే, పార్టీలో కీలక పదవికి హామీ దక్కిందన్నారు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో పార్టీలోకి ఎవరు వచ్చినా చేర్చుకుంటామని అన్నారు. పార్టీలోకి వచ్చిన నేతలపై ఆరోపణలు ఉంటే విచారణలు జరుగుతాయన్నారు. ఇక రాష్ట్ర అభివృద్ధి కొరకే కేంద్రంతో, పొరుగు రాష్ట్రంతో సీఎం రేవంత్ సఖ్యత‌తో మెదులుతున్నారని పేర్కొన్నారు. అధిక నిధులు తెచ్చి తెలంగాణ అభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు.

ఇక నల్గొండ పార్లమెంట్ పరిధిలో ఇద్దరికి మంత్రి పదవులు వచ్చాయని ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంత్రులుగా ఉన్నారని గుర్తు చేశారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఒక్కరూ కూడా మంత్రులు‌గా లేరని, ఆ పరిధిలో తనకు అవకాశం కల్పించాలని సీఎం‌ను కోరారు. ఎన్నడూ గొల్లకుర్మలు లేకుండా మంత్రి‌వర్గం లేదని, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా గొల్ల కుర్మలకు ప్రతినిధిగా మంత్రి వర్గంలో తనకు ప్రాతినిధ్యం కల్పించాలని అన్నారు. ఆంధ్రాలో ముగ్గురికి మంత్రి వర్గంలో ఛాన్స్ ఇచ్చారని గుర్తు చేశారు. 50 లక్షల పై‌చిలుకు జనాభా ఉన్న గొల్లకుర్మలకు ప్రభుత్వంలో పదవులు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్‌ను ఆదుకున్నది గొల్ల కుర్మలేనని, కేసీఆర్ గొర్లు, బర్రెలు ఇచ్చినా ఓడగొట్టినామని వెల్లడించారు.


Similar News