అవసరం ఉన్నంత వరకే ఉచిత రేషన్ ఇవ్వండి: వెంకయ్యనాయుడు

ప్రజలకు అవసరం ఉన్నంత వరకు ఉచిత రేషన్​ పథకం కొనసాగించాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కేంద్రానికి సూచించారు.దేశ ప్రజలకు ప్రధాని అందిస్తున్న సేవలు కొనసాగించాలని కోరారు.

Update: 2024-06-30 17:30 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజలకు అవసరం ఉన్నంత వరకు ఉచిత రేషన్​ పథకం కొనసాగించాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కేంద్రానికి సూచించారు.దేశ ప్రజలకు ప్రధాని అందిస్తున్న సేవలు కొనసాగించాలని కోరారు. హైదరాబాద్​ గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్​ సెంటర్​లో వెంకయ్యనాయుడు జీవితం, 13వ ఉప రాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు లక్ష్యం, సందేశం, మహానేత వెంకయ్యనాయుడు జీవితం, ప్రయాణం అనే మూడు పుస్తకాలను ప్రధాని మోడీ వర్చువల్ గా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. ప్రధాని మోడీ రిఫార్మ్​, పర్​ఫార్మ్​, ట్రాన్స్​ఫార్మ్​ నినాదంతో ముందుకెళ్తున్నారని కొనియాడారు. యువత నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను కొనసాగించాలని కోరారు. మాతృభాషలను కేంద్రం ప్రోత్సహించడం గొప్ప విషయమని తెలిపారు. తాను ఆంగ్ల భాషకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.

ప్రభుత్వ ఆదేశాలన్నీ భారతీయ భాషల్లోనే ఉండాలని పేర్కొన్నారు. భారతీయ భాషల తర్వాతే ప్రభుత్వ ఆదేశాలు ఆంగ్ల భాషలో ఉండాలని సూచించారు. మాతృభాష, సోదర భాష తర్వాతే ఇతర భాషలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. 'ఉత్సాహం ఉన్నవాళ్లు రాజకీయాల్లోకి రావాలన్నారు. సిద్ధాంతపరమైన రాజకీయాలను ప్రోత్సహించాలని, చట్ట సభలకు ఎంపికైన వారు హుందాగా ప్రవర్తించాలన్నారు. విలువలు పాటిస్తూ మాతృభాషను ప్రోత్సహిస్తూ ముందుకు సాగాలని కోరారు. విలువలు కాపాడాల్సిన బాధ్యత రాజకీయ నాయకులపై ఉందన్నారు. సిద్ధాంతం నచ్చకపోతే నాయకులు పార్టీ మారవచ్చని అయితే పార్టీ ద్వారా వచ్చిన పదవిని వదిలి వెళ్లాలని సూచించారు. రాజకీయాల్లో జవాబుదారీతనం తీసుకురావడానికి ప్రయత్నించాలన్నారు. రాజకీయాల్లో కులం, ధనం ప్రభావం తగ్గి పోవాలని. గుణం చూసి నాయకులకు ఓటు వేయాలన్నారు. మార్పు రాకపోతే ప్రజాస్వామ్యం బలహీనపడుతుందని, దేశ ప్రతిష్టను నిలబెట్టాలంటే చెడు పోకడలను అడ్డుకోవాలి' అని వెంకయ్య నాయుడు కోరారు.


Similar News