ఈడీకి ఫుల్ పవర్స్.. మనీ లాండరింగ్‌పై ఫోకస్
కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన లక్ష్యంతో పావులు కదుపుతున్నది. ఆర్థిక నేరాల సంఖ్య, తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఇటీవల ఈడీకి విస్తృతాధికారాలు కల్పించింది.
దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన లక్ష్యంతో పావులు కదుపుతున్నది. ఆర్థిక నేరాల సంఖ్య, తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఇటీవల ఈడీకి విస్తృతాధికారాలు కల్పించింది. ఎన్ఐఏ, నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, మిలిటరీ ఇంటెలిజెన్స్, డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, అన్ని రాష్ట్రాల పోలీసు శాఖలు, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఫారిన్ ట్రేడ్ డైరెక్టర్ జనరల్, విదేశాంగ శాఖ, నేషనల్ టెక్నికల్ రీసెర్చి ఆర్గనైజేషన్, వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో.. ఇలా మొత్తం 15 శాఖలకు సంబంధించిన సమాచారాన్ని యాక్సెస్ చేసేలా ఈడీకి అధికారాలను కల్పించింది. ఈ మేరకు నవంబరు 22న గెజిట్‌ను కూడా విడుదల చేసింది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా ఈ అన్ని విభాగాల సమాచారాన్ని, డాటాను, వివరాలను, డాక్యుమెంట్లను, ఎవిడెన్సులను, ఇన్వెస్టిగేషన్ రిపోర్టులను, చార్జిషీట్లను పరిశీలించడానికి ప్రత్యేకంగా సాఫ్ట్ వేర్‌ను వినియోగించుకోవాలనుకుంటున్నది.
కోర్ ఈడీ ఆపరేషన్స్ సిస్టమ్స్ (సీడాస్) పేరుతో అందుబాటులోకి తెచ్చుకోవాలనుకుంటున్న ఈ అంశాన్ని ఇటీవల ఒక ఆంగ్ల పత్రికతో ఈడీ అధికారులు పంచుకున్నారు. కన్సల్టెన్సీ సంస్థతో జరిగిన సంప్రదింపుల మేరకు ఇప్పటికే సమగ్ర ప్రాజెక్టు నివేదికను ఈడీ అధ్యయనం చేసినట్లు తెలిసింది. సాంకేతిక నిపుణులతో చర్చించిన తర్వాత ఈడీ ఉన్నతాధికారులు దీనిపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని, ఆ తర్వాతనే కొత్త సాఫ్ట్ వేర్ వినియోగంలోకి వస్తుందని అధికారుల సమాచారం. దీన్ని వాడడం ద్వారా ఆ 15 సంస్థలు వివిధ కేసుల్లో జరుపుతున్న దర్యాప్తు వివరాలను, సేకరించిన ఆధారాలను, డాక్యుమెంట్లను, అభియోగాలను పొందడంతో పాటు మనీ లాండరింగ్ కోణం నుంచి ఆలోచించి ఆ అంశాలపై దృష్టి పెట్టడానికి వెసులుబాటు లభిస్తుందని అధికారులు పేర్కొన్నారు.
ఆర్థికంగా ఎక్కడెక్కడ అక్రమాలు, అవకతవకలు జరుగుతున్నాయో సీబీఐ, నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ తదితర సంస్థల నుంచి ఎప్పటికప్పుడు తీసుకునే సౌకర్యం లభిస్తుంది. ఒక్కో దర్యాప్తు సంస్థ వాటికి అవసరమైన తీరులో డాటాను నిక్షిప్తం చేస్తూ ఉన్నందున వాటన్నింటినీ విడివిడిగా సేకరించి విశ్లేషించడానికి ఎక్కువ సమయం పడుతూ ఉన్నది. ఇప్పుడు కొత్త సాఫ్ట్ వేర్ ద్వారా వాటన్నింటినీ ఒకే ఫార్మాట్లో పొందుపర్చడానికి వీలవుతుంది. దీనికి తోడు ఎప్పటికప్పుడు ఈ సంస్థలు చేస్తున్న దర్యాప్తు, సోదాలు, లభించిన ఎవిడెన్సు తదితరాలపై అధికారుల స్థాయిలో సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం కూడా ఈ నూతన విధానంలో ఒక కీలకమైన అంశం. రియల్ టైమ్ పద్దతిలోనే సమాచారాన్ని తీసుకోవడానికి వీలవుతుంది.
కొత్త సాఫ్ట్ వేర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని కూడా వాడుతున్నందున దర్యాప్తు ప్రాసెస్ మరింత వేగం అవుతుందని అధికారులు పేర్కొన్నారు. మనీ లాండరింగ్ కేసులు ఇటీవలి కాలంలో ఎక్కవవుతున్నందున మామూలు పద్ధతులతో పోలిస్తే కొత్త సాఫ్ట్ వేర్ ద్వారా చాలా వేగం అవుతుందన్నది వారి అభిప్రాయం. ఇప్పటికే క్రైమ్, క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ (సీసీటీఎన్ఎస్), ఇంటర్ ఆపరేబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ (ఐసీజేఎస్) తదితరాలతో అనుసంధానం కావడంతో ఎప్పటికప్పుడు వివిధ కేసులకు సంబంధించిన ఫస్ట్ ఇన్మర్మేషన్ రిపోర్టులను తెప్పించుకోగలుగుతున్నామన్నారు. తాజాగా 15 సంస్థలతోనూ ఇలాంటి సమన్వయం ఉండడంతో ఆయా కేసులకు సంబంధించిన సపోర్టు డాక్యుమెంట్లు, వాటిల్లో ప్రమేయం ఉన్న వ్యక్తుల ఆధార్ కార్డు, పాన్ కార్డు, కంపెనీ ఇండెక్స్ నంబర్, డైరెక్టర్ ఇండెక్స్ నెంబర్ తదితరాలను కూడా పొందే వీలు చిక్కుతుంది.
ప్రస్తుతం సీసీటీఎన్ఎస్, ఐసీజేఎస్ సంస్తల నుంచి సమారాన్ని తీసుకున్న తర్వాత మనీ లాండరింగ్‌కు సంబంధించి వివరాలను శోధిస్తూ ఉన్నామని, ఇందుకోసం ప్రతీ మూడు నెలలకు ఒకసారి ఆయా సంస్థల ఉన్నతాధికారులతో సమన్వయ సమావేశా (ఫిజికల్/వీడియో కాన్ఫరెన్సు)లు జరుగుతూ ఉన్నాయని, ఇకపైన 15 సంస్థలతో ఆన్‌లైన కనెక్టివిటీ కొత్త సాఫ్ట్ వేర్ ద్వారా ఏర్పడితే మరింత లోతుగా అధ్యయనం చేసిన తర్వాత పాయింట్ల వారీగా ఆయా సంస్థల నుంచి తదనుగుణమైన వివరాలను తీసుకోడానికి వీలు పడుతుందని అధికారులు చెప్తున్నారు. మరోవైపు దర్యాప్తులో కీలకంగా ఉండే డిజిటల్ డివైజెస్లలోని సమాచారాన్ని, డేటాను రికవర్ చేయడానికి ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆరు సైబర్ లాబ్‌లు ఉన్నాయి. వీటికి అదనంగా కొత్తగా మరొకటి త్వరలో అందుబాటులోకి రానున్నది.
గతంలో ఒక్కో కేసుకు సంబంధించిన డిజిటల్ డేటా రికవరీగా ఐదారు నెలలు పట్టేది. ఇప్పుడు ఐదారు రోజుల్లోనే రిట్రీవ్ చేయగలుగుతున్నట్లు ఈడీ అధికారులు పేర్కొన్నట్లు ఆ ఆంగ్ల పత్రిక పేర్కొన్నది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన ఎనిమిదేళ్ళలో సుమారు 3,555 మనీ లాండరింగ్ కేసులు నమోదైతే కేవలం గతేడాదిలోనే సుమారు 1200 మేర ఉన్నట్లు ఇటీవల లోక్‌సభ వేదికగా కేంద్ర మంత్రి వెల్లడించారు. అన్ని వైపుల నుంచీ ఈడీకి విస్తృతాధికారాలు కల్పిస్తూ వేర్వేరు దర్యాప్తు సంస్థలతో సమన్వయం కోసం విధానపరమైన నిర్ణయం తీసుకోవడం రానున్న కాలంలో దూకుడు ఏ స్థాయిలో ఉంటుందో వెల్లడించినట్లయింది. తెలంగాణలో సైతం జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారి స్థానంలో అదనపు డైరెక్టర్ అధికారిని పోస్ట చేయడం ఈ సందర్భంలో గమనార్హం.
Also Read...