ఓఆర్ఆర్ ఆవతల ​71 చెరువులకు ఎఫ్ టీఎల్ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ

జీహెచ్‌ఎంసీ పరిధిలోని చెరువులు, కుంటలు, నాలాల పరిధిలోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా యాక్షన్ కొనసాగుతుండగానే ఓఆర్ఆర్ వెలుపల ఆక్రమణలపై కూడా చర్యలకు ప్రభుత్వం సిద్దమవుతుంది.

Update: 2024-09-25 09:07 GMT

దిశ, వెబ్ డెస్క్ : జీహెచ్‌ఎంసీ పరిధిలోని చెరువులు, కుంటలు, నాలాల పరిధిలోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా యాక్షన్ కొనసాగుతుండగానే ఓఆర్ఆర్ వెలుపల ఆక్రమణలపై కూడా చర్యలకు ప్రభుత్వం సిద్దమవుతుంది. ఓఆర్ఆర్ వెలుపల చెరువులు, కుంటలు ఆక్రమణలకు సంబంధించి భారీగా వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో అక్కడి చెరువులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణలలో భాగంగా ఎఫ్ టీఎల్​నిర్థారించే ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించింది. చెరువులకు పూర్తిస్థాయి నీటిమట్టం(ఎఫ్‌టీఎల్‌) పరిశీలించి నోటిఫికేషన్లు జారీ చేయాలని కలెక్టర్లను ఆదేశించింది. దీంతో ఐదు జిల్లాల కలెక్టర్లు ఎఫ్‌టీఎల్‌ నిర్ధారించే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఇక్కడ 71 చెరువులకు ఎఫ్ టీఎల్​ను నిర్ధారించి ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేశారు. చెరువులకు సంబంధించిన ఎఫ్​టీఎల్, బఫర్ జోన్ల వివరాలతో పాటు మ్యాప్​లను కూడా జతచేసి హెచ్ఎండీఏకి కలెక్టర్లు పంపించారు. వీటిని నోటిఫై చేసి ఏవైనా అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లో తెలుపాలని హెచ్ఎండీఏ కోరింది. నెలరోజుల్లో ఎఫ్ టీఎల్ తుది నిర్ధారణను ప్రకటిస్తారు.

ప్రస్తుతానికి 10హెక్టార్ల కంటే తక్కువ విస్తీర్ణమున్న చెరువులు, కుంటలకు 9 మీటర్ల వరకు బఫర్‌జోన్‌ ఉంటుంది. 10 మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణమున్న చెరువులు, కాలువలు, నాలాలు మొదలైన వాటికి నిర్ణయించిన సరిహద్దు నుంచి 9 మీటర్ల నుంచి 10 మీటర్ల వరకు వెడల్పు ఉంటే 2 మీటర్ల బఫర్‌ జోన్‌ ఉంటుంది. ఎఫ్‌టీఎల్‌ సరిహద్దులను మ్యాప్‌ల ఆధారంగా నీటిపారుదలశాఖ గుర్తించి, సర్వే నంబర్ల ఆధారంగా రెవెన్యూ శాఖ పరిశీలించి సర్టిఫై చేస్తుంది. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఓఆర్‌ఆర్‌ బయట ఉన్న 71 చెరువులకు ఆయా జిల్లాల కలెక్టర్ల నివేదికల ఆధారంగా ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీచేశారు. ఇందులో రంగారెడ్డి జిల్లాలో ఏడు, సంగారెడ్డి జిల్లాలో పది, సిద్దిపేట జిల్లాలో 20, మేడ్చల్‌-మల్కాజిగిరిలో 27, యాదాద్రి-భువనగిరి జిల్లాలో ఐదు చెరువులు ఉన్నాయి.

చెరువులు, ఇతర నీటి వనరులను సంరక్షించడానికి లేక్‌ ప్రొటెక్షన్‌ కమిటీ(ఎల్‌పీసీ) 2010లోనే మొదలైనప్పటికీ పూర్తిస్థాయిలో పనిచేయలేదు. ఈ కమిటీ చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్‌ జోన్‌లను పరిధి గుర్తించి ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేయాలి. 30 రోజుల్లో అభ్యంతరాలను స్వీకరించి తుది నోటిఫికేషన్‌ జారీ చేయాలి. అనంతరం నీటివనరుల రక్షణ చర్యలు చేపట్టాలి. అయితే అప్పట్లో కొన్ని చెరువులకు మాత్రమే తుది నోటిఫికేషన్‌ వరకు వచ్చాయి.

ఇటీవల ఔటర్‌ను ఆనుకొని ఉన్న 51 గ్రామాలను సమీపంలోని మున్సిపాలిటీల్లో విలీనం చేశారు. వాటి వరకు హైడ్రా పరిధి ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. రోజురోజుకు మరింత బలాన్ని పుంజుకుంటున్న హైడ్రా, ఎన్ని విమర్శలు ఎదురైనా ముందుకు సాగుతోంది. హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న చెరువులన్నింటిపై దృష్టి సారించిన హైడ్రా, గ్రేటర్ పరిధిలోని 185, హెచ్ఎండీఏలోని 3 వేలకుపైగా చెరువుల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. జీవో 111లోని ప్రాంతాలను కూడా హైడ్రా పరిధిలోకి తీసుకురావాలని భావిస్తున్నారు. జీవో 111 పరిధిలో 84 గ్రామాలుండగా గత ప్రభుత్వ హయాంలో జీవో 111ను రద్దు చేశారు. జంట జలాశయాలకు ఇబ్బంది లేకుండా నిర్మాణాలు చేసుకునే వెసులుబాటు కల్పించడంతో, చాలా మంది రియల్టర్లు, అక్రమార్కులు యథేచ్చగా నిర్మాణాలు చేపట్టారు.

ప్రభుత్వం గతంలో చెరువుల ఆక్రమణలు తొలగించి వాటిని రక్షించడంతోపాటు ఎఫ్‌టీఎల్‌ను నదులతో పాటు చెరువులు, లేక్‌లు, ఇతర నీటి వనరుల్లో ఎఫ్‌టీఎల్‌, బఫర్ జోన్ల పరిధిలో ఎలాంటి అక్రమ నిర్మాణాలను అనుమతించరాదని 2012, 2016లో పురపాలకశాఖ వేర్వేరు జీవోలు ఇచ్చింది. నగరపాలక సంస్థలు, పురపాలక, నగర పంచాయతీలు, హెచ్‌ఎండీఏ ప్రాంతాల్లో నది సరిహద్దుకు 50 మీటర్ల వరకు బఫర్‌ జోన్‌ ఉంటుంది. 2016లో పురపాలకశాఖ ఇచ్చిన జీవో-7 ప్రకారం నీటిపారుదల, రెవెన్యూ శాఖలు ఈ సరిహద్దును నిర్ణయించాలి. పది హెక్టార్ల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న లేక్‌లు, చెరువులు, కుంటల్లో ఎఫ్‌టీఎల్‌ నుంచి 30 మీటర్ల వరకు బఫర్‌జోన్‌ ఉంటుంది. ఈ 30 మీటర్లలో 12 అడుగుల మేర వాకింగ్, సైక్లింగ్‌ ట్రాక్‌ వంటివి ఏర్పాటు చేసుకునే వెసులుబాటు కల్పించారు.


Similar News