CM Revanth Reddy: నిరుద్యోగ యువతకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్

నిరుద్యోగ యువతకు సీఎం గుడ్ న్యూస్ చెప్పారు.

Update: 2024-09-25 09:41 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: గడిచిన 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో విద్యార్థులకు అన్యాయం జరిగిందని దాంతో విద్యార్థులంతా రోడ్డున పడ్డారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పదేళ్ల తర్వాత కూడా రాష్ట్రంలో భారీగా నిరుద్యోగం ఉందని, తెలంగాణలో 50-60 లక్షల మంది నిరుద్యోగుల ఉన్నారన్నారు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినా రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పోదన్నారు. కానీ మేమొచ్చాక నిరుద్యోగ సమస్యను గుర్తించి అన్ని శాఖల్లో భర్తీ ప్రక్రియ చేపట్టామన్నారు. బుధవారం హైదరాబాద్ లోని జేఎన్ఎఫ్ఏయూలో బీఎఫ్ఎస్ఐ (బ్యాకింగ్‌, ఫైనాన్స్‌ సర్వీసెస్, ఇన్సూరెన్స్‌) రంగాలకు అవసరమైన నైపుణ్యాలు నేర్పేందుకు స్కిల్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్ ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలోని యువతకు ఉద్యోగాల భర్తీని బాధ్యతగా తీసుకున్నామని మేమొచ్చాక 35 వేల పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. త్వరలో మరో 35 వేల పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వబోతున్నామని 2,3 నెలల్లో ఈ భర్తీ పూర్తవుతుందన్నారు.

యువత ఈ సూత్రం గుర్తుంచుకోవాలి:

నిరుద్యోగ యువత డిమాండ్-సప్లై సూత్రం గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా సీఎం సూచించారు. నాలెడ్జ్, కమ్యూనికేషన్ ఉంటేనే మంచి ఉద్యోగాలు వస్తాయని ఎంత చదువుకున్నా కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే ఉద్యోగాలు రావన్నారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను నేర్చుకోవాలి. టీజీపీఎస్ సీ వెబ్ సైట్లో 30 లక్షల మంది నమోదు చేసుకున్నారన్నారు. పరిశ్రమలకు, నిరుద్యోగులకు మధ్య గ్యాప్ ఉందన్న సీఎం.. వీటిని పరిష్కరించేందుకు స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించామని ఐటీఐలను ఏటీసీలుగా అప్ గ్రేడ్ చేస్తున్నామన్నారు. మొత్తం 75 ఐటీఐలను ఏటీసీలుగా మారుస్తున్నామన్నారు. అలాగే పాలిటెక్నిక్ కాలేజీలు కడా అప్ గ్రేడ్ చేస్తున్నట్లు వెల్లడించారు. నైపుణ్యమైన యువత ఉంటేనే పెట్టుబడులు వస్తాయన్నారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుతో క్రీడలకు మేలు జరగబోతున్నదని రాష్ట్రంలో ప్రపంచ స్థాయి క్రీడాకారులను తయారు చేస్తామన్నారు. గత పాలకుల్లో కొందరు డ్రగ్స్, చైన్ స్నాచింగ్ వృత్తి అనుకున్నారు. ఇంజినీరంగ్ విద్యార్థులు డ్రగ్ పెడ్లర్ గా మారుతున్నారు. ఇది తెలంగాణకు అత్యంత ప్రమాదకరం. రాష్ట్రంలో యువతను గాలికి వదిలేద్దామా అన్నారు. అసాంఘీక కార్యకలపాలకు యువత పాల్పడకుండా చూస్తామన్నారు. ఉపాధి అవకాశాలు కల్పిస్తే యువత సరైన మార్గంలో నడుస్తారన్నారు. మాదక ద్రవ్యాలపై పోరాటంలో యువతే ముందుండాలన్నారు.

డబుల్ బెడ్ రూమ్, ఇందిరమ్మ ఇండ్లు పెద్ద థికింగ్ కాదు:

వృద్ధాప్య పించన్లు, షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం ఇదంతా పెద్ద విషయమేమి కాదని సీఎం చెప్పారు. ఒకరు వెయ్యి ఇస్తే మరొకరు రెండు వేలు ఆ పై వచ్చే వారు నాలుగు వేలు ఇవ్వొచ్చు. కల్యాణ లక్ష్మికి ఈ సారి లక్ష ఇస్తే వచ్చే సారి రెండు లక్షలు ఇవ్వొచ్చు. ఒకరు డబుల్ బెడ్ రూమ్ అంటే ఇంకొకరు ఇందిరమ్మ ఇండ్లు అనవచ్చు. ఇదంతా పెద్ద ఇన్నోవేటివ్ థింకింగ్ ఏమి కాదు. ఇవన్నీ సంక్షేమంలో భాగం మాత్రమే. కానీ ప్రభుత్వం ఫోకస్ పెట్టవలసింది వీటిపై కాదన్నారు. యువతకు నైపుణ్యం కల్పించి, ఉపాధి మార్గాలు పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. భారతదేశంలో తెలంగాణ ఒక రోల్ మోడల్ చేసేం విషయంలో రాష్ట్ర యువతను తీర్చిదిద్దడంలో మా ప్రభుత్వం అలుపెరగని కృషి చేస్తుందని ఇది నా మాట అన్నారు. తెలంగాణ రాష్ట్రం వన్ ట్రిలియన్ ఎకానమీ రాష్ట్రంగా నిలబెట్టే బాధ్యత మాది అన్నారు. రాబోయే నాలుగేళ్లలో రూ.3 లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్ ను రూ.7 లక్షల కోట్ల బడ్జెట్ కు తీసుకుపోతామన్నారు.


Similar News