ముగిసిన సర్పంచుల పాలన.. నేటి నుంచి పంచాయతీల్లో ప్రత్యేక పాలన
గ్రామ సర్పంచుల పదవీ కాలం బుధవారంతో ముగిసింది. స్పెషల్ ఆఫీసర్ల పాలన విధించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.
దిశ, తెలంగాణ బ్యూరో: గ్రామ సర్పంచుల పదవీ కాలం బుధవారంతో ముగిసింది. స్పెషల్ ఆఫీసర్ల పాలన విధించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కానీ సర్పంచులు మాత్రం ఎన్నికల షెడ్యూల్ వచ్చేంత వరకూ తమనే పదవిలో కొనసాగించాలని కోరుతున్నారు. లేదంటే పెండింగ్‌లో ఉన్న బిల్లులు మంజూరు చేసిన తర్వాత స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగించాలని పట్టుబడుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం కొనసాగింపు ఉండదని తేల్చి చెప్పేసింది.
హైకోర్టుకు సర్పంచులు
తమ పదవీకాలాన్ని పొడిగించాలని కోరుతూ సర్పంచులు హైకోర్టును ఆశ్రయించారు. ప్రత్యేక అధికారులను నియమించకుండా సకాలంలో ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికలు నిర్వహించడం కుదరకపోతే తమ పదవీ కాలాన్ని పొడిగించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. ప్రత్యేక ఆఫీసర్ల నియామకంపై స్టే ఇవ్వాలని హైకోర్టుకు విన్నవించుకున్నారు. వారి పిటిషన్‌ను విచారించిన హైకోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది. దీంతో ప్రత్యేక అధికారుల నియామకానికి అడ్డంకులు తొలగిపోయాయి. మళ్లీ పంచాయతీ ఎలక్షన్లు జరిగేంత వరకూ గ్రామాల్లో ప్రత్యేక ఆఫీసర్ల పాలనే ఉండనున్నది.
ఫిబ్రవరి 3న సమావేశం
ప్రత్యేక అధికారుల పాలనకు సంబంధించి నిర్వర్తించాల్సిన విధివిధానాలు, చేపట్టాల్సిన పనులు, పర్యవేక్షణ వంటి అంశాలు చర్చించేందుకు ఈ నెల 3న మంత్రి సీతక్క సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో వేసవిలో తాగునీటి సరఫరా, రోడ్ల మరమ్మతులపై చర్చించనున్నారు.
నియామకపు అధికారం కలెక్టర్లు అప్పజెప్పాం: పి.రామారావు, డిప్యూటీ కమిషనర్ పంచాయతీ రాజ్ శాఖ
ప్రత్యేక అధికారులను నియమించే అధికారం జిల్లా కలెక్టర్లకు అప్పజెప్పాం. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేస్తాం. ప్రత్యేక అధికారుల విధులు, బాధ్యతలు వంటి అంశాలు జిల్లా అధికారులు పర్యవేక్షిస్తారు.