ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల పేరిట ఘరానా మోసం.. రూ. కోటితో మహిళ జంప్

ఔట్ సోర్సింగ్ అటెండర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి అక్రమంగా వసూలు చేసిన సుమారు రూ. కోటితో ఓ కిలాడీ లేడీ ఉడాయించింది‌.

Update: 2023-06-24 07:02 GMT

దిశ, వైరా : గురుకుల పాఠశాలల్లో ఔట్ సోర్సింగ్ అటెండర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి అక్రమంగా వసూలు చేసిన సుమారు రూ. కోటితో ఓ కిలాడీ లేడీ ఉడాయించి ఘరానా మోసానికి పాల్పడింది. దీంతో ఆ కిలాడి లేడీకి నగదు చెల్లించిన బాధితులు లబోదిబోమంటున్నారు. ఖమ్మం జిల్లా వైరా మండలంలోని రెబ్బవరం గ్రామంలో ఉన్న మహాత్మ జ్యోతిబాపూలే బీసీ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో ఔట్ సోర్సింగ్‌లో అటెండర్‌గా పనిచేస్తున్న బాజి జ్యోతి గురుకుల పాఠశాలల్లో అటెండర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికి ఒక్కొక్కరి వద్ద రూ. 1.50 లక్షలు చొప్పున సుమారు 70 మంది వద్ద కోటి రూపాయలకు పైగా అక్రమంగా వసూలు చేసింది. నగదు చెల్లించి ఆరు నెలలు గడుస్తున్నా ఉద్యోగాలు ఇప్పించకపోవడంతో బాధితులు ఆమెపై ఒత్తిడి పెంచడంతో సుమారు నెలన్నర క్రితం పరారైంది. అప్పటినుంచి ఇప్పటివరకు ఆమె ఆచూకీ కనీసం లభించలేదు.

జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో అవుట్ సోర్సింగ్ అటెండర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, హైదరాబాద్ లో తనకు సంబంధం ఉన్న ఉన్నతాధికారుల ద్వారా ఆ ఉద్యోగాలు ఇప్పిస్తానని ఆమె నమ్మ పలికింది. ఒక్కో ఉద్యోగానికి రూ.3 లక్షలు చెల్లించాలని ఆ కిలాడీ లేడి బాధితులకు స్పష్టం చేసింది. ముందుగా రూ.1.50 లక్షల నగదు అడ్వాన్స్ చెల్లించాలని, 15 రోజుల్లో ఉద్యోగం వస్తుందని.. ఆ తర్వాత మిగిలిన రూ. 1.50 లక్షలు ఇవ్వాల్సి ఉంటుందని ఆమె పేర్కొంది. నాపై నమ్మకం లేకుంటే ముందుగా మీరిచ్చే నగదుకు ప్రామిసరి నోటు రాసిస్తానని హామీ ఇచ్చింది.

ఆ మేరకు నగదు చెల్లించిన ప్రతి ఒక్కరికి లక్షన్నర రూపాయలతో ఆమె ప్రామిసరీ నోటు రాసి ఇచ్చింది. దీంతో నమ్మిన అమాయక ప్రజలు తమ పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని ఆశపడి సుమారు జిల్లాలో 70 మంది ఆమెకు రూ.1.50 లక్షలు లెక్క చెల్లించినట్లు తెలిసింది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగంలో చేరిన తర్వాత మొదటి మూడు సంవత్సరాలు నెలకు రూ. 25000 జీతం వస్తుందని, ఆ తర్వాత ఉద్యోగం పర్మినెంట్ అయి రూ.40 వేల జీతం వస్తుందని ఆమె బాధితులకు ఆశ చూపింది. ప్రామిసరీ నోటు రాసి ఇవ్వటంతో పాటు ఉద్యోగం పర్మినెంట్ అవుతుందని నమ్మ పలకడంతో నిరుపేదలు వడ్డీకి అప్పుచేసి, బంగారు నగలు తాకట్టు పెట్టి ఆమెకు నగదును చెల్లించారు. ఆమె గత మే నెల 9వ తేదీ నుంచి కనిపించకుండా పోయింది.

కిలాడీ లేడీ బాదితులు వీరే....

ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన నిరుపేదలు ఉద్యోగంపై ఆశతో కిలాడి లేడీ బాజి జ్యోతికి ఒక్కో ఉద్యోగానికి ముందుగా రూ.1.50 లక్షలు అడ్వాన్స్ చెల్లించారు. వైరా మండలంలోని వైరా, గౌండ్లపాలెం, రెబ్బవరం, ముసలమడుగు, సిరిపురం, కొణిజర్ల మండలం చిన్న మునగాల, పెద్ద మునగాల బోనకల్లు మండలం బ్రాహ్మణపల్లి, కలకోట గ్రామాలతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆమె అక్రమ వసూళ్లకు పాల్పడింది. సుమారు 70 మందికి పైగా బాధితుల నుంచి ఆ కిలాడీ లేడి కోటి రూపాయలకు పైగా అక్రమంగా వసూలు చేసి ఉడాయించింది.

ఈ అక్రమ నగదుతో జల్సా చేసేందుకు హోండా కారును ఆమె కొనుగోలు చేసింది. TS04FF4468 నెంబర్ గల హుండాయ్ కారులో ఆమె సుమారు నెలన్నర క్రితం వైరా నుంచి ఊడాయించింది. వైరాలోని పాత బస్టాండ్ పెట్రోల్ బంక్ సమీపంలో ఉన్న ఓ అపార్ట్ మెంట్ పక్కనే ఆమె అద్దెకు ఉన్న ఇంటి కేంద్రంగా అక్రమ వసూళ్లకు పాల్పడింది. సుమారు నెలన్నర క్రితం ఆమె ఆ ఇంటిని ఖాళీ చేసి తల్లాడ రోడ్‌లో ఉన్న సాకేత్ కృష్ణ హాస్పిటల్ వెనక భాగంలో ఓ కానిస్టేబుల్ ఇంటిని అద్దెకు తీసుకుంది. రెండు రోజులు ఆ ఇంట్లో ఉన్న ఆమె ఆ ఇంటికి తాళం వేసి పరార్ అయింది. దీంతో ఆమె ఆచూకీ తెలవక బాధితులు ప్రస్తుతం కిరాయికి ఉన్న ఇంటి చుట్టూ, రెబ్బవరంలోని గురుకుల పాఠశాల చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్నారు.

ఒకరి ద్వారా మరొకరికి ప్రచారం..

ఔట్ సోర్సింగ్ అటెండర్ ఉద్యోగం కోసం ఒకరి ద్వారా మరొకరు కిలాడీ లేడీకి నగదును చెల్లించారు. వైరాలోని ఎస్సీ కాలనీలో నివాసముంటున్న మరకల కృష్ణ ముందుగా ఉద్యోగం కోసం నగదును చెల్లించాడు. ఆయన ద్వారా ముసలిమడుగు గ్రామానికి చెందిన పాల వ్యాపారి ఎం కృష్ణ నగదును చెల్లించారు. ఎం కృష్ణ ద్వారా గౌండ్లపాలెం గ్రామంలో మొక్కా చందుతోపాటు మరి కొంతమంది నగదు చెల్లించారు. అదేవిధంగా కొణిజర్ల మండలం చిన్న మునగాల, పెద్ద మునగాల, బోనకల్ మండలం బ్రాహ్మణపల్లి, కలకోట గ్రామాలకు చెందిన వారు ఆ కిలాడి లేడీ మాటలు నమ్మి నగదు చెల్లించి మోసపోయారు. నెలన్నరగా ఆమె ఫోన్ పనిచేయకపోవడంతో పాటు అందుబాటు లేకుండా పరారీ కావడంతో బాధితులు ఆమె చేతిలో ఘరానా మోసానికి గురయ్యామని తెలిసి ‘దిశ’ పత్రికను ఆశ్రయించి వారి గోడును చెప్పుకున్నారు.

50 రోజులుగా కిలాడీ లేడి విధులకు ఎగనామం

వైరా మండలం రెబ్బవరం గ్రామంలో ఉన్న మహాత్మ జ్యోతిబాపూలే బిసి వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో ఔట్ సోర్సింగ్ విధానంలో అటెండర్‌గా పనిచేస్తున్న కిలాడీ లేడీ బాజి జ్యోతి ఏలాంటి సమాచారం లేకుండా 50 రోజులుగా తన విధులకు ఏగనామం పెట్టింది . ఈ ఏడాది మే మూడో తేదీ నుంచి ఆమె పాఠశాలలో విధులకు హాజరు కావడం లేదు. విధులకు ఎందుకు హాజరు కావడం లేదనే విషయాన్ని ఆమె కనీసం సమాచారం కూడా ప్రిన్సిపాల్ కి ఇవ్వలేదు. అయితే ఆమె కోసం బాధితులు గత నెలన్నర రోజులుగా పాఠశాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

ఆమె ఉద్యోగాలు ఇప్పిస్తామని నగదు అక్రమంగా వసూలు చేసిన విషయాన్ని పాఠశాల ప్రిన్సిపాల్ ఈ ఎస్ సుశీల దృష్టికి తీసుకువెళ్లారు. ఏలాంటి సమాచారం లేకుండా విధులకు గైర్హాజరైన ఆ కిలాడి లేడీ‌పై నేటి వరకు శాఖాపరమైన చర్యలు కూడా తీసుకోలేదు. ఈ విషయమై ప్రిన్సిపాల్ ఈఎస్.సుశీలను దిశ వివరణ కోరింది. ఔట్ సోర్సింగ్ అటెండర్ జ్యోతి మే 3వ తేదీ నుంచి పాఠశాలకు గైర్హాజరవుతున్నారని ఆమె స్పష్టం చేశారు. ఎలాంటి సమాచారం లేకుండా ఆమె గైర్హాజరవుతున్న విషయాన్ని సెక్రటరీ మల్లయ్య బట్‌కు సమాచారం అందించామని ఆమె వివరణ ఇచ్చారు.


Similar News