రాష్ట్రంలో మరో నాలుగు ఫైన్ ఆర్ట్స్ గురుకులాలు
రాష్ట్రంలోని గురుకులాల్లో మరో నాలుగు ఫైన్ ఆర్ట్స్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2025–26 విద్యా సంవత్సరంలో వీటిని హైదరాబాద్ పరిసరాల్లోని గురుకులాల్లో అదనంగా ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని గురుకులాల్లో మరో నాలుగు ఫైన్ ఆర్ట్స్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2025–26 విద్యా సంవత్సరంలో వీటిని హైదరాబాద్ పరిసరాల్లోని గురుకులాల్లో అదనంగా ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. మేడ్చల్ జిల్లా ఏదులాబాద్‌లో ఉన్న గురుకుల ఫైన్ ఆర్ట్స్ స్కూల్ మంచి ఫలితాలు ఇస్తుంది. నిరుపేద వర్గాలు 12 రకాల కూచిపూడి, కథక్, తబలా, సంగీతం, వయోలిన్, పెయింటింగ్ తదితర సంగీత విద్యలను ఉచితంగా నేర్చుకుంటున్నారు. వారి కోసం నిపుణులైన టీచర్లను నియమించి శిక్షణ ఇప్పిస్తున్నారు. ఇలాంటి వాటికి విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి డిమాండ్ ఉండటంతో మరో నాలుగింటిని ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించింది. ఒక్కో స్కూల్‌లో 80 మంది చొప్పున ఆరో తరగతిలో అడ్మిషన్ ఇస్తారు. శిక్షణ అనంతరం తెలుగు యూనివర్సిటీలో డిప్లొమా పరీక్ష రాయడానికి అర్హత సాధిస్తారు. టోలిచౌకి, నార్సింగి స్కూల్స్‌ను పూర్తి స్థాయి స్పోర్ట్స్ స్కూళ్లుగా మార్చాలని నిర్ణయించారు.
కొత్త ఎన్సీసీ యూనిట్లు ఇక్కడే..
రాష్ట్రంలో రెండు గురుకులాల్లో మాత్రమే ఎన్సీసీ యూనిట్లు ఉండగా, మరో 16 గురుకులాల్లో ఎన్సీసీ యూనిట్లు ఏర్పాటు చేయాలని కేంద్ర రక్షణ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఎన్సీసీ యూనిట్లలో శిక్షణ పొందిన విద్యార్థులకు మెరుగైన అవకాశాలు ఉంటాయి. రాష్ట్రంలోని గురుకులాల్లో తక్కువ ఎన్సీసీ యూనిట్లు ఉన్న విషయాన్ని గుర్తించిన మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి తనకు రక్షణ శాఖలో ఉన్న సంబంధాలు, ఎన్సీసీ ప్రాధాన్యతను గుర్తించి ఎక్కువ యూనిట్లకు ప్రతిపాదించాలని సూచించారు. మంచిర్యాల జిల్లా జైపూర్, పెద్దపల్లి జిల్లా మల్లాపూర్, ఆదిలాబాద్ జిల్లా కేంద్రం, నిర్మల్ జిల్లాలో ముథోల్, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్, మెదక్ జిల్లా కేంద్రం, ఖమ్మం జిల్లా కేంద్రం, హనుమకొండ జిల్లా వర్ధన్నపేట, నల్లగొండ జిల్లా డిండి, జనగామ జిల్లా కేంద్రం, సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ఖేడ్, జహీరాబాద్, హైదరాబాద్‌లోని ఫలక్‌నామా, నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట, మహబూబ్‌నగర్ జిల్లా నాన్‌చర్ల, వనపర్తి జిల్లా మదనాపురంలో మంజూరు చేయాలని కోరారు.
ప్రతి స్కూల్‌లో 50 కంప్యూటర్లు
ప్రతి గురుకులంలో కనీసం 50 కంప్యూటర్లు ఉండేలా గురుకుల ఉన్నతాధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతానికి ప్రతి స్కూల్‌లో 20 కంప్యూటర్లు ఉన్నాయి. విద్యార్థులకు కంప్యూటర్‌లో మరింత శిక్షణ ఇవ్వడానికి వాటి సంఖ్యను మరింత పెంచాలని అధికారులు నిర్ణయించారు. దీనిలో భాగంగా హైసియా సహకారాన్ని కోరారు. వారు కూడా దానికి అంగీకరించారు. వారు అంతర్జాతీయ కంప్యూటర్ సంస్థలను సంప్రదించినట్లు తెలిసింది. త్వరలోనే ఆచరణలోకి రానున్నాయి.