ఒకే రోజు నాలుగు మీటింగ్స్.. స్పీడ్ పెంచిన CM KCR

ఉమ్మడి పాలమూరు జిల్లాలో సోమవారం ఒకే రోజు బీఆర్ఎస్ నాలుగు నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచార సభలు నిర్వహించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Update: 2023-11-06 02:15 GMT

దిశ బ్యూరో, మహబూబ్ నగర్: ఉమ్మడి పాలమూరు జిల్లాలో సోమవారం ఒకే రోజు బీఆర్ఎస్ నాలుగు నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచార సభలు నిర్వహించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొదటి దఫా ఎన్నికల ప్రచారం పూర్తి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ రెండవ విడతగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో రెండవసారి పర్యటనకు రానున్నారు. ఈ మేరకు దేవరకద్ర, గద్వాల, మక్తల్, నారాయణపేట అసెంబ్లీ నియోజకవర్గాలలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనలు ఖరారు అయ్యాయి. కేసీఆర్ రాక సందర్భంగా స్థానిక ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ అభ్యర్థులు ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

పనులు పర్యవేక్షించిన ఎమ్మెల్యేలు

ఉమ్మడి పాలమూరు జిల్లా దేవరకద్ర, గద్వాల, మక్తల్, నారాయణపేట అసెంబ్లీ నియోజకవర్గాలలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనల సందర్భంగా ఎమ్మెల్యేలు సభ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ సభలకు ఊహించని విధంగా జనాలను సేకరించేలా ఇప్పటికే ఎమ్మెల్యేలు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేశారు. దేవరకద్రలో జరిగే కార్యక్రమాలను ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో జరిగే ఈ సభకు జనాన్ని భారీగా తరలించేలా ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఆయా మండలాల ప్రజాప్రతినిధులు పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలకు ఆదేశాలు జారీ చేశారు.

గద్వాలలో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, మక్తల్‌లో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, నారాయణపేటలో ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి సారథ్యంలో ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఎన్నికల సమయంలో పరిస్థితులను తమకు పూర్తిగా అనుకూలంగా మలుచుకునే విధంగా ఎమ్మెల్యేలు సన్నద్ధం అయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనే సభలకు జనాన్ని భారీగా తీసుకువచ్చేలా ఇప్పటికే ముఖ్య నాయకులు కార్యకర్తలకు ఎమ్మెల్యేలు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం జరగనున్న సభలను దిగ్విజయం చేయాలన్న సంకల్పంతో ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

వ్యతిరేకతను అధిగమించేలా...

ఉమ్మడి పాలమూరు జిల్లాలో రెండు దఫాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికార పార్టీ ఎమ్మెల్యేలు కొనసాగడంతో అక్కడక్కడ కొన్ని వ్యతిరేకతలు ఉన్నాయి. కొంతమంది నాయకులు కార్యకర్తలు పార్టీలు మారుతున్నారు. కానీ ఎమ్మెల్యేలు, మంత్రులు పరిస్థితులు చేయి దాటకుండా ఉండేందుకు వీలుగా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పలు నియోజకవర్గాలలో అధికార పార్టీకి వ్యతిరేక పవనాలు వేస్తున్న నేపథ్యంలో. వాటిని అధిగమించేలా పార్టీ శ్రేణులు సన్నద్ధం అవుతున్నాయి.

అందరి దృష్టి సీఎంపైనే

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా పలు నియోజకవర్గం అధిగమించి వ్యూహ రచనలు చేసేలా బీఆర్ఎస్ అడుగులు ముందుకు వేస్తుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇప్పటికే అధికార బీఆర్ఎస్ పార్టీ పటిష్టంగా ఉండగా మరికొన్ని మరికొన్ని చోట్ల బలోపేతంగా రూపొందబోతుంది. ఈ క్రమంలో పార్టీ శ్రేణులలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఏర్పాట్లు జరగనున్నాయి.

Tags:    

Similar News