ఆ వివరాలన్నీ బయటపెట్టాలి.. మంత్రి కేటీఆర్‌కు ఫోరంఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ
కంపెనీల వారీగా పెట్టుబడులు, ఉద్యోగ కల్పనపై స్పష్టమైన వివరాలు ప్రకటించాలని ఫోరంఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ఎం. పద్మనాభరెడ్డి కోరారు.
దిశ, తెలంగాణ బ్యూరో: కంపెనీల వారీగా పెట్టుబడులు, ఉద్యోగ కల్పనపై స్పష్టమైన వివరాలు ప్రకటించాలని ఫోరంఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ఎం. పద్మనాభరెడ్డి కోరారు. లేకుంటే 3.3 లక్షల కోట్ల పెట్టుబడి 22.5 లక్షల ఉద్యోగాల కల్పన అంటే అంతా మిధ్యేనని ప్రజలు భావించాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, ఉద్యోగాల వివరాలు అందజేయాలని కోరుతూ బుధవారం మంత్రి కేటీఆర్‌కు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ రాసింది.
రాష్ట్రంలో 14 రంగాలకు ప్రాధాన్యం ఇచ్చి ఒక్కొక్క రంగానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించి పక్కా ప్రణాళికతో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధంగా ఉన్న కంపెనీలతో నిరంతరం సంప్రదింపులు చేస్తూ తెలంగాణ ప్రభుత్వ విధానాలు, మౌలిక వసతులు వివరించడంతో ఐటీ, పరిశ్రమల్లో 3.3లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, దాంతో 22.5లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని ప్రభుత్వం ప్రకటించిందన్నారు.
పరిశ్రమల వారీగా పెట్టుబడి, ఉద్యోగాల వివరాలు ఇవ్వాలని ఐటీశాఖ ముఖ్య కార్యదర్శికి ఈ ఏడాది జనవరి 1న సమాచారహక్కు చట్టం కింద దరఖాస్తు చేశామన్నారు. కానీ ఎలాంటి సమాచారం లేదని, దరఖాస్తును తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్‌కు పంపారన్నారు. డైరెక్టర్ పేరు, ఎప్పుడు నియమించారన్న సమాచారం లేదని పరిశ్రమలశాఖను సంప్రదించాలని సూచించినట్లు తెలిపారు.
పరిశ్రమలశాఖకు దరఖాస్తు చేసినా తమవద్ద ఎలాంటి సమాచారం లేదని కమిషనర్ ఇండస్ట్రీస్‌ను సంప్రదించాలని సూచించారని, తిరిగి కమిషనర్‌కు దరఖాస్తు చేసినా నేటివరకు ఎలాంటి సమాధానం రాలేదన్నారు. గత ఐదునెలలుగా సంబంధిత ప్రభుత్వశాఖలు కోరిన సమాచారం లేదని జవాబు ఇస్తున్నాయని, అయితే ప్రభుత్వం చెబుతున్నట్లు లక్షలకోట్ల పెట్టుబడి, లక్షల ఉద్యోగాల అంకెలు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. ప్రభుత్వం కల్పించింది ఉత్తుత్తి ఉద్యోగాలే అని ప్రజలు భావించకముందే పూర్తి వివరాలు అందజేయడంతోపాటు బహిరంగంగా ప్రకటించాలని కోరారు.