టీ-కాంగ్రెస్‌లో సీఎం పదవి లొల్లి.. MP కోమటిరెడ్డిపై రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ కాంగ్రెస్‌లో అప్పుడే సీఎం పదవి లొల్లి షురూ అయింది. ముఖ్యమంత్రి రేస్‌లో తామంటే తాము ఉన్నామంటూ నేతలు ప్రకటనలు చేస్తున్న తరుణంలో కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2023-04-25 06:20 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్‌లో అప్పుడే సీఎం పదవి లొల్లి షురూ అయింది. ముఖ్యమంత్రి రేస్‌లో తామంటే తాము ఉన్నామంటూ నేతలు ప్రకటనలు చేస్తున్న తరుణంలో కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేస్‌లో భట్టి విక్రమార్క ఒక్కరే లేరని నిజానికి కాంగ్రెస్‌లోని ప్రతి కార్యకర్త సీఎం క్యాండిడేటే అన్నారు. ఓ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పూటకో మాట మాట్లాడుతున్నారని ఆయన ఏమంటున్నారో ఆయనకే తెలియదన్నారు. దళిత సీఎం విషయంలో ఆయన జోస్యం చెప్పినంత మాత్రాన అదే నిజం అని ఎట్లా అనుకుంటారని ప్రశ్నించారు. దళిత సీఎం అనేది ఇవాళ వీళ్లు అంటున్నారని నిజానికి దళితుల కోసం కాంగ్రెస్ పార్టీనే ఎంతో చేసిందన్నారు. ఉమ్మడి ఖమ్మంలో పది ఎమ్మెల్యే స్థానాల్లో ఐదు సీట్లు ఎస్టీలకు మిగతా ఐదులో మూడు ఎస్సీలకు పోరాడి తీసుకువచ్చింది రేణుకా చౌదరినే అని చెప్పారు.

భట్టి జిల్లాలో లేని సమయంలో జిల్లాలో రేవంత్ రెడ్డి ర్యాలీ నిర్వహించి ఆ ర్యాలీలో రేణుకా చౌదరి నాయకత్వంలో జిల్లాలోని పది సీట్లను గెలుస్తామని చెప్పడంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్న వేళ రేణుకా చౌదరి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఉమ్మడి ఖమ్మంలో తప్పక పది సీట్లు గెలిపిస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ సర్వేల్లో కూడా కాంగ్రెస్ దే విజయం అని తేలిందన్నారు. తనపై అనవసరమైన కేసులు పెడుతున్నారని ఒక్క సారి తన మూడు మారితే ఆ బ్రహ్మదేవుడు కూడా తనను ఆపలేడని హెచ్చరించారు. కాంగ్రెస్ కార్యకర్తలను వేధిస్తున్నారని, 144 సెక్షన్ పేరుతో తనను నిలువరించాలని చూస్తే అది జరిగే పని కాదన్నారు. మంత్రి పువ్వాడ అజయ్ ఓ క్రిమినల్, ఆయనది ఓ సైకో మెంటాలిటీ అని పోలీసులను వెనుక ముందు పెట్టుకుని తిరిగే అజయ్.. దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పువ్వాడకు ప్రజల్లో తిరిగే అర్హత కూడా లేదని దుయ్యబట్టారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..