నకిరేకల్ కాంగ్రెస్ అభ్యర్థిగా వేముల వీరేశం?
రాష్ట్రంలో పార్టీల్లో చేరికల వార్తలు వినిపించిన ప్రతిసారి నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం పేరు ప్రస్తావనకు వచ్చేది.
దిశ, నకిరేకల్: రాష్ట్రంలో పార్టీల్లో చేరికల వార్తలు వినిపించిన ప్రతిసారి నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం పేరు ప్రస్తావనకు వచ్చేది. కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో ఈ ఊహగానాలకు తెరపడినట్లు తెలుస్తోంది. త్వరలోనే వేముల వీరేశం కారు దిగి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అధికార పార్టీలో టికెట్ వస్తుందనే ఆశతో ఉన్నా టికెట్ రాదనేది తేటతెల్లమైపోయింది. కాంగ్రెస్‌లో టికెట్‌పై హామీతోనే చేరుతున్నారని స్పష్టమైంది. అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. సునీల్ కొనుగోలు సర్వేలోనూ వేముల వీరేశం పేరు ఉండడంతో రాహుల్ గాంధీ సైతం తన అభ్యర్థిత్వానికి ఓకే చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. వీటన్నింటినీ పరిశీలిస్తే నకిరేకల్ కాంగ్రెస్ అభ్యర్థిగా వేముల వీరేశం దాదాపు ఖరారు అయినట్లే.
ఢిల్లీలో చేరిక... నకిరేకల్‌లో సభ
రాహుల్ గాంధీ లేదా ప్రియాంక గాంధీ సమక్షంలో ఢిల్లీలో వేముల వీరేశం త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. పార్టీలో చేరిక తర్వాత నకిరేకల్ పట్టణంలో భారీ బహిరంగ సభ ఏర్పాటుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే తన అనుచరులతో పలుమార్లు చర్చించి పార్టీ మార్పుపై ఓ క్లారిటీకి వచ్చారు. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ నాయకులతో సైతం మంతనాలు జరిపి పూర్తి సహకారం అందించాలని కోరుతున్నారు. ఇప్పటికే నకిరేకల్ నియోజకవర్గంలో దైద రవీందర్, కొండేటి మల్లయ్య, నేతకాని కృష్ణ, వేదాసు వెంకయ్య, వేదాసు శ్రీధర్ కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు. వీరందరినీ కాదని కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్న వేములకు టికెట్ ఇస్తే వీరంతా మద్దతు పలుకుతారా అనే అనుమానాలు వ్యక్తమువుతున్నాయి.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఒప్పుకున్నట్లేనా?
నకిరేకల్ నియోజకవర్గం కోమటిరెడ్డి సొంత నియోజకవర్గం. ఇక్కడ ఆయనకు క్యాడర్ ఉంది. అయితే గతంలో కోమటిరెడ్డి నల్లగొండ జిల్లాలో పార్టీలో ఎవరు చేరాల్సిన అవసరం లేదని.. 12 మంది అభ్యర్థులు ఇప్పటికే ఉన్నారని తేల్చి చెప్పారు. ఈ పరిణామాలతో వేముల వీరేశంను పార్టీలో చేర్చుకోవడానికి వెంకటరెడ్డి ఒప్పుకున్నారా?.. అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కానీ వీరేశం అనుచరులు మాత్రం అలాంటిది ఏమీ లేదు.. అందరూ ఓకే చెప్పారని.. పార్టీలో చేరడం ఖాయమని.. టికెట్ సైతం ఖరారు అయినట్లేనని చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ నకిరేకల్ కాంగ్రెస్ అభ్యర్థిగా వేముల వీరేశం దాదాపుగా ఖాయమనే ప్రచారం జోరందుకుంది.