సీఎం కేసీఆర్‌పై బూర నర్సయ్య గౌడ్ సంచలన వ్యాఖ్యలు
సీఎం కేసీఆర్‌వి ఒంటెత్తు పోకడలని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ విమర్శలు చేశారు. బీజేపీలో చేరిన అనంతరం తొలిసారి పార్టీ రాష్ట్ర కార్యాలయానికి ఆయన వచ్చారు.
దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం కేసీఆర్‌వి ఒంటెత్తు పోకడలని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ విమర్శలు చేశారు. బీజేపీలో చేరిన అనంతరం తొలిసారి పార్టీ రాష్ట్ర కార్యాలయానికి ఆయన వచ్చారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు బాణసంచా కాల్చి బూరకు ఘనస్వాగతం పలికారు. పార్టీ అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్, ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, కొల్లి మాధవి, శాంతి కుమార్ తదితరులు ఆయనకు ఆహ్వానం పలికారు. బూరకు శాలువాలు, బొకేలు అందజేసి సన్మానించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో బూర నర్సయ్య గౌడ్ మాట్లాడారు. జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతుంటాయన్నారు. డాక్టర్‌గా కొనసాగుతూనే ఉద్యమంలో కీలకంగా పోరాటాలు చేశానని గుర్తుచేశారు. టీఆర్ఎస్ నుంచి ఎంపీగా గెలిచినా కేంద్ర ప్రభుత్వ సహకారంతో భువనగిరిని ఎంతో అభివృద్ధి చేసినట్లు తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్‌ది నియంతృత్వ పాలన అని, ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత పాలన ఎక్కువైందని తీవ్ర విమర్శలు చేశారు. అందుకే బీజేపీలో చేరినట్లుగా చెప్పారు. చేరిక సందర్భంగా ఢిల్లీకి వెళ్లిన తనకు బీజేపీ కార్యాలయం కొత్తగా అనిపించడలేదన్నారు. ఉద్యమకారులైన మాజీ ఎంపీ వివేక్, ఈటల, జితేందర్ రెడ్డి, స్వామి గౌడ్, విశ్వేశ్వరరెడ్డి తదితరులు బీజేపీలోనే ఉన్నారని గత స్మృతులను గుర్తుచేసుకున్నారు. తెలంగాణలో బండి సంజయ్ తగ్గేదేలే అన్నట్లుగా బీజేపీని నడిపిస్తున్నారని కొనియాడారు. బీజేపీ ఉద్యమ నేతల పార్టీగా మారితే.. టీఆర్ఎస్ మాత్రం ఉద్యమ ద్రోహులను అక్కున చేర్చుకున్న పార్టీగా మారిందని తీవ్ర విమర్శలు చేశారు. టీఆర్ఎస్ రాను.. రాను.. తెలంగాణ వ్యతిరేకులకు అడ్డాగా మారిందని మండిపడ్డారు. ఇప్పటి వరకు ప్రజలు కూడా దీన్ని సహించారని, తిరగబడితే టీఆర్ఎస్ పరిస్థితి ఏంటో ఆలోచించుకోవాలని సూచించారు. రాజకీయ వెట్టిచాకిరి అంతం.. తెలంగాణ ప్రజల పంతంగా ముందుకు సాగుతామని చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తంచేశారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రగతిభవన్ గేటు దాటి లోనికి వెళ్లాలంటే వీసా దొరకని పరిస్థితి అని సెటైర్లు వేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఒక్కరోజులో వీసా దొరికేదని, ఇప్పుడు తరాలు మారినా దొరుకుతుందో లేదో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. మునుగోడు ఉప ఎన్నిక కారణంగా కొత్త మండలంగా గట్టుప్పల్‌ను ప్రకటించారని, ఇది రాజగోపాల్ రెడ్డి రాజీనామా వల్లే సాధ్యమైందనే విషయాన్ని ప్రజలు గుర్తుపెట్టుకోవాలని సూచించారు. మునుగోడు బైపోల్‌లో టీఆర్ఎస్ నేతలు ఒక్కో బూత్‌కు కోట్లు ఖర్చు పెడుతున్నారని, TRS నేతలకు కేటాయించిన బూత్ ల్లో ఓటింగ్ శాతం తగ్గితే వచ్చే ఎన్నికల్లో టికెట్ కస్టమని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని పేర్కొన్నారు. యూఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్‌కు కూడా ఇంతగా ఖర్చు పెట్టి ఉండరని ఆయన వాపోయారు. ప్రస్తుతం టీఆర్ఎస్ పరిస్థితి.. బాహుబలి 1, పుష్ప పార్ట్ 1 అని పేర్కొన్నారు. పార్ట్ 2 మొత్తం బీజేపీదేనని బూర నర్సయ్య గౌడ్ చెప్పారు. మంత్రి మల్లారెడ్డి.. సిల్క్ స్మిత లాగా తయారయ్యాడని, ఆయనకంత ఇబ్బంది ఎందుకని ప్రశ్నించారు. అభిమానం వేరు.. బానిసత్వం వేరని బూర తెలిపారు.
ఉప ఎన్నిక తరువాత పార్టీలో వరదలా చేరికలుంటాయన్నారు. ఇప్పుడున్న అధికారులు చాలామంది జైలుకు వెళ్లడం ఖాయమని హెచ్చరించారు. బీజేపీలో పోస్టర్ అతికించే వ్యక్తి కూడా ప్రధాని కాగలడని, ఆఫీస్ బాయ్‌గా ఉన్న వ్యక్తి కేంద్ర మంత్రి కాగలడని తెలిపారు. అదే టీఆర్ఎస్‌లో పాలరాతి భవనంలో ఉన్నా.. రోడ్డుపై వచ్చి కేసీఆర్ చెప్పిన డ్యాన్స్ చేయాల్సిందేనన్నారు. నల్లగొండలో ఫ్లోరోసిస్ పోయిందని చెబుతున్న టీఆర్ఎస్ నేతలు ఫ్లోరోసిస్ అధ్యయన కేంద్రాన్ని ఎందుకు కోరుతున్నారని ప్రశ్నించారు. లేని రోగానికి వైద్యం చేయడానికా? అని నిలదీశారు. తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా మంచినీరు అందిస్తున్నామని చెప్పింది ఏమైందని ప్రశ్నించారు. 2003లోనే శ్రీశైలం నుంచి నల్లగొండకు నీరు తెచ్చారని, అయితే దానికి తమ ఎక్స్ బాస్ కేసీఆర్.. పేరు మార్చి తానే చేపట్టినట్లుగా ప్రచారం చేసుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు హాస్పిటల్‌లో సర్జరీలు చేయడంతో పాటు పొలిటికల్ సర్జరీలు చేయడం కూడా బాగా తెలుసని హెచ్చరించారు.