బిగ్ న్యూస్: తెలంగాణలో ఢిల్లీ కంటే అతి పెద్ద లిక్కర్ స్కామ్.. మాజీ MP సెన్సేషనల్ కామెంట్స్

Update: 2023-03-15 11:03 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ను తలదన్నేలా తెలంగాణలోనూ అతి భారీ లిక్కర్ స్కామ్ జరుగుతోందని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో జరుగుతున్న ఈ స్కామ్‌కు ఒక్క రోజు మాత్రమే టెండర్ నోటిఫికేషన్ ఇస్తారని, దరఖాస్తు కూడా ఒక్కటే వస్తుందని ఆయన ఆరోపించారు. రోజుకో రూ.కోటి దందా జరుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ లెక్కన ఏడాదికి రూ.365 కోట్ల స్కామ్ తెలంగాణలో జరుగుతోందని పేర్కొన్నారు.

ఢిల్లీలో వంద కోట్ల కుంభకోణమేనని, కానీ.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే పెద్దది తెలంగాణలో జరుగుతోందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఇదంతా ‘టానిక్’ లిక్కర్ మార్ట్‌లో జరుగుతోందని, ఈ కుంభకోణాన్ని పూర్తి ఆధారాలతో బయటపెడుతానని బూర నర్సయ్య గౌడ్ కామెంట్స్ చేశారు. వైన్స్, బెల్ట్ షాపులు, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, ఆర్టీసీ బస్సుల్లో పెట్టుబడులు, అందులోని బినామీలపై శ్వేతపత్రం విడుదల చేసే దమ్ము తెలంగాణ సర్కార్‌కు ఉందా? అని ఆయన ప్రశ్నించారు.

బీఆర్ఎస్ మంత్రులు పెద్ద నోట్ల రద్దుపై ప్రధాని మోడీని క్షమాపణలు కోరడం సిగ్గుచేటని బూర నర్సయ్య గౌడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. నోట్ల రద్దుకు మొదట మద్దతు తెలిపిన వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన తెలిపారు. ముందు కేసీఆర్‌ను క్షమాపణ చెప్పమనండని ఆయన డిమాండ్ చేశారు. నోట్ల రద్దుపై బీఆర్ఎస్ నేతలతో చర్చకు తాము సిద్ధమని, బీఆర్ఎస్ నేతలు దీనికి సిద్ధమా అని ఆయన సవాల్ విసిరారు. నోట్ల రద్దు విషయంలో గోబెల్స్ మించిన అబద్ధాలను హరీష్ రావు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ నేతలు ఎన్నికల్లో డబ్బు పంచేందుకు వినియోగించిన యూపీఐ పేమెంట్స్ కు అవకాశం కల్పించింది కూడా ప్రధాని మోడీయేనని, బీఆర్ఎస్ నేతలు అలాగే ఓట్లు కొనుక్కున్నారని బూర ఆరోపించారు.

బ్లాక్ మనీ, హవాలా మనీ తగ్గడానికి నోట్ల రద్దు నిర్ణయమే కారణమని ఆయన చెప్పారు. ఈ నిర్ణయం వల్ల టెర్రరిజాన్ని కూడా అణిచివేసిన ఘనత మోడీకి దక్కిందన్నారు. పాకిస్థాన్‌లో గతంలో ఇండియన్ కరెన్సీని ముద్రించి దొంగనోట్లు చెలామణి చేయడం ద్వారా భారీగా నిధులు సమకూర్చుకుందని, నోట్లు రద్దు చేయడంతో పాకిస్థాన్ ఆర్థిక మూలాలకు భారీ దెబ్బ తగిలిందన్నారు. యథా సీఎం.. తథా అధికారులు అన్నట్లుగా పరిస్థితి మారిందని, పోటీ పరీక్షలు కూడా నిర్వహించలేని అసమర్థ ప్రభుత్వం కేసీఆర్ సర్కార్‌ది అని ఆయన మండిపడ్డారు. అద్దాల మేడలో ఉండి మోడీ ప్రభుత్వంపై రాళ్లు వేయొద్దని బూర సూచించారు. మీడియా, పత్రికలపై ఆంక్షలను ఖండిస్తున్నట్లుగా చెప్పారు.

బీజేపీ తమిళనాడు సహ ఇన్ చార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ లండన్ పర్యటనలో సంకుచితంగా మాట్లాడారని, దేశం ప్రతిష్ట దిగజార్చేలా వ్యాఖ్యానించారని మండిపడ్డారు. రాహుల్‌కి సోయి ఉండే ఆ వ్యాఖ్యలు చేశాడా అని ప్రశ్నించారు. దేశ ప్రజలకు క్షమాపణ కూడా చెప్పకుండా సిగ్గు లజ్జ వదిలేసి మోడీపై కుయుక్తులు పన్నుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.

కాంగ్రెస్ పరిస్థితి రోజురోజూ దిగజారిపోతోందని పొంగులేటి విరుచుకుపడ్డారు. మునిగిపోయే నౌకలో రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతలు ఊహల్లో విహరిస్తున్నారన్నారు. రాహుల్ గాంధీ ఇప్పటికైనా యావత్ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. టీఎస్ పీఎస్సీ కాస్త టీఎస్ ఎల్ఎస్పీగా మారిందని, పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాస్త లీకేజీ సర్వీస్ కమిషన్‌గా మారిందన్నారు. లీకేజీ ఇష్యూలో బీజేవైఎం నేతల అరెస్ట్ సిగ్గుచేటని పొంగులేటి ఆగ్రహం వ్యక్తంచేశారు.

Tags:    

Similar News