బీఆర్ఎస్‌లో మరో బిగ్ వికెట్ ఔట్.. సీఎం రేవంత్‌ను కలిసిన మాజీ ఎమ్మెల్యే!
స్టేషన్ ఘన్‌పూర్ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. నియోజకవర్గ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు.
దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తో్న్న వేళ స్టేషన్ ఘన్‌పూర్ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. నియోజకవర్గ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయమై చర్చించేందుకు శుక్రవారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. హైదరాబాద్‌లోని సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. చర్చలు సఫలం కావడంతో కాంగ్రెస్‌లో చేరేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. రెండ్రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. కాగా, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలైన నాటి నుంచి క్రమంగా బీఆఎస్ బలహీన పడుతున్నట్లు కనిపిస్తోంది. కీలక నేతలంతా వరుసగా పార్టీని వీడుతున్నారు.
పార్టీ అధికారం కోల్పోయిన కేవలం నెలల వ్యవధిలోనే గులాబీ నేతలంతా పక్కచూపులు చూస్తున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి దంపతులు, హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు, టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. వీరే కాకుండా మరికొందరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు త్వరలో హస్తం పార్టీలో చేరే అవకాశాలు ఉన్నట్లు చర్చ జరుగుతోంది. దీంతో ఇదే అవకాశంగా భావించిన కాంగ్రెస్.. రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే కీలక నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు.