కాంగ్రెస్ పాలనలో చట్నీల్లో ఎలుకలు, అన్నంలో బల్లులు: మాజీ MLA బాల్క సుమన్ ఫైర్

రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లు, యూనివర్సిటీ క్యాంపస్ హాస్టళ్ల నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్

Update: 2024-07-10 10:09 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లు, యూనివర్సిటీ క్యాంపస్ హాస్టళ్ల నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ సాధారణ విషయంగా మారిందని, చట్నీల్లో ఎలుకలు, అన్నంలో బల్లులు వస్తున్నాయని ఫైర్ అయ్యారు. యూనివర్సిటీల్లో 2014కు ముందు నాటి పరిస్థితులు నెలకొన్నాయని.. వర్సిటీలకు పూర్తి స్థాయి వైస్ ఛాన్సలర్లను నియమించలేదని ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులపై దమన కాండ నడుస్తోందని, రాష్ట్రంలో ప్రజా పాలన కాదు అన్ని వర్గాల దగా పాలన నడుస్తోందని ధ్వజమెత్తారు.

రేవంత్ పాలనలో సామాజిక న్యాయం కొరవడిందని.. మైక్ దొరికితే చాలు సీఎం తాము సామాజిక న్యాయం పాటిస్తున్నాం అంటున్నారు కానీ ఎస్సీ, బీసీ మంత్రులకు, అధికారులకు అడుగడుగునా అవమానం జరుగుతోందనన్నారు. యాదాద్రి గుడిలో భట్టికి అవమానం జరిగింది.. నిన్న బల్కం పేట ఎల్లమ్మ గుడిలో మంత్రి పొన్నం ప్రభాకర్‌కు అవమానం జరిగిందన్నారు. దళిత ఎస్ఐ శ్రీరాములు శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నారని.. రేవంత్ పాలనలో మాటల్లో తప్ప చేతల్లో సామాజిక న్యాయం లేదని విమర్శలు గుప్పించారు. కార్పొరేషన్ల చైర్మన్ల నియామకంలో సామాజిక న్యాయం లేదన్నారు.రే వంత్ రెడ్డి అందర్నీ బెదిరించే ధోరణిలో మాట్లాడుతున్నారని.. నిన్న మహబూబ్ నగర్లో నిరుద్యోగులను అవమాన పరిచేలా సీఎం మాట్లాడిన తీరును ఖండిస్తున్నామన్నారు. రేవంత్ అందరి గొంతులు నొక్కుతున్నారని.. జర్నలిస్టులకు ప్రతి రోజూ పోలీసుల చేతిలో అవమానాలు జరుగుతున్నాయన్నారు. హోంశాఖ బాధ్యతలు తనవద్దే పెట్టుకుని పోలీసులతో నిరసనలు అణచి వేద్దామనుకుంటున్నారని మండిపడ్డారు.

రేవంత్‌కు కండువాలు కప్పే తీరిక ఉంది కానీ నిరుద్యోగులతో రెండు నిముషాలు మాట్లాడే టైం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగుల అండతో గద్దె నెక్కిన రేవంత్ ఇపుడు వారిని అణచివేస్తున్నారని నిప్పులు చెరిగారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఓ ఛానల్ ప్రతినిధిపై పోలీసులు వ్యవహరించిన తీరును ఖండిస్తున్నామన్నారు. సమస్యలపై గొంతెత్తుతున్న ప్రతీ వర్గానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని తేల్చి చెప్పారు. కాంగ్రెస్లో ఎస్సీ, బీసీ ప్రతినిధులకు గౌరవం లేదని, కాంగ్రెస్ బీసీ ఎమ్మెల్యే స్వయంగా రేవంత్ రెడ్డి సామాజిక న్యాయంపై సోషల్ మీడియాలో నిరసన స్వరం వినిపించారని గుర్తు చేశారు. కొన్ని గంటల్లోనే ఆ ఎమ్మెల్యేపై ఒత్తిడి తెచ్చి సోషల్ మీడియాలో పెట్టిన వ్యాఖ్యలు తీసేయించారని అన్నారు. రేవంత్ తెస్తానన్న ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ పాలన అని ఇపుడు అర్థం అవుతోందని ఎద్దేశా చేశారు.


Similar News