నేను జైలుకు పోవడానికి సిద్ధం.. మాజీ మంత్రి KTR ప్రకటన

ఎన్నికల సంఘం స్వతంత్ర సంస్థ అయితే ప్రధాని మోడీపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు.

Update: 2024-05-02 12:59 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల సంఘం స్వతంత్ర సంస్థ అయితే ప్రధాని మోడీపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. గురువారం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాకెట్ వేగంతో కేసీఆర్‌పై ఈసీ చర్యలు తీసుకుంది.. మరి మోడీ చేసిన అనుచిత వ్యాఖ్యలు కనిపించలేదా? అని అడిగారు. కాంగ్రెస్, బీజేపీ సోషల్ మీడియాల్లో వ్యక్తిగత దూషణలు చేస్తున్నారని అన్నారు. ఎన్నికల కమిషన్ ఒక పార్టీకి, కొంతమంది నాయకులకు తొత్తుగా మారిందని ఆరోపించారు. మాపై నిషేధం విధించి మా ప్రత్యర్థులను అచ్చోసిన ఆంబోతుల్లా ప్రజల మీదకు వదలారని సీరియస్ కామెంట్స్ చేశారు. ఓయూలో హాస్టల్స్‌ను ఖాళీ చేయాలని 18వ తేదీన చీఫ్ వార్డెన్ పేరుతో సర్క్యులర్ ఇచ్చారు. దీనిపై విద్యార్థులు ఆందోళనకు దిగారు. 11 రోజుల తర్వాత ఓయూ సర్క్యులర్‌ను జత చేసి కేసీఆర్ ట్వీట్ చేశారు. మంచినీళ్లు, కరెంటు ఇవ్వడం లేదని ప్రభుత్వంపై కేసీఆర్ ట్వీట్ చేశారు. ప్రభుత్వం చీఫ్ వార్డెన్‌కు షోకాజు నోటీసులు ఇచ్చింది. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు సర్క్యులర్ ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

ఫేక్ డాక్యుమెంట్‌తో రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. రేవంత్ రెడ్డి పెట్టిన ఫేక్ సర్క్యులర్‌లో చీఫ్ వార్డెన్ ముద్రను ఫోర్జరీ చేశారని అన్నారు. ఫేక్ సర్క్యులర్ పెట్టి మా నాయకుడు క్రిశాంక్‌ను అరెస్ట్ చేశారని ఖండించారు. జైల్లో ఉండాల్సింది రేవంత్ రెడ్డా...? క్రిశాంక్ ఉండాలా...? అని అడిగారు. తాను బయటపెట్టిన ఆధారాలు ఫేక్ అయితే నేను జైలుకు పోవడానికి సిద్ధం అని ప్రకటించారు. రేవంత్ రెడ్డి ట్వీట్ చేసిన సర్క్యులర్ తప్పు అయితే రేవంత్ రెడ్డిని జైల్లో వేయాలని డిమాండ్ చేశారు. క్రిశాంక్ అరెస్టును బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డిపై ఓయూ విద్యార్థులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని తెలిపారు. ఎన్నికల కమిషన్‌కు నిజంగా స్వతంత్ర సంస్థ అయితే రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలు ఉడత ఊపులకు బెదరాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. రాహుల్ గాంధీ ప్రేమను పంచుతామని అంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విద్వేషాన్ని నింపుతోందని అన్నారు.

Read More..

మోడీకి భయపడి నడ్డాకు ఈసీ నోటీసులు ఇచ్చింది.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు 

Tags:    

Similar News