తట్ట మట్టి ఎత్తకముందే.. వందల కోట్లు దండుకున్నది కాంగ్రెస్ కాదా..? హరీష్ రావు ఫైర్

కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయ విమర్శలు మానుకొని ప్రాజెక్టు పునర్ వినియోగంలోకి తీసుకు రావడంపై శ్రద్ధ పెట్టండని మాజీ మంత్రి హరీష్

Update: 2024-07-21 15:18 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయ విమర్శలు మానుకొని ప్రాజెక్టు పునర్ వినియోగంలోకి తీసుకు రావడంపై శ్రద్ధ పెట్టండని మాజీ మంత్రి హరీష్ రావు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సూచించారు. ప్రాజెక్టు నిర్మాణంలో కమీషన్లు కోసం మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వ నిధులను ఎక్కువగా ఖర్చుపెట్టారని మంత్రి ఉత్తమ్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ప్రాజెక్టు నిర్మాణంపై మంత్రి చేసిన వ్యాఖ్యలను ఆదివారం మీడియా ప్రకటనలో ఖండించారు. ప్రాజెక్టుపై మంత్రి అవాకులు చెవాకులు పేలి తన అవగాహనారాహిత్యాన్ని మరొక్కసారి బయటపెట్టుకున్నారన్నారు. ఒకవైపు మేడిగడ్డ పునాదిని బలపరిచేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని అంటూనే మేడిగడ్డ వద్ద సాయిల్ పరీక్షలు సాధ్యపడలేదని అంటున్నాడన్నారు.

ఈ ఏడాది మే 5న ఒక నివేదిక ఇచ్చిన ఎన్డీఎస్ఏ, వర్షాకాలం వరదలు రాకముందే.. జూలై మొదటి వారంలోపే పలు సాంకేతిక పరీక్షలు నిర్వహించాలని నివేదికలో పేర్కొన్నదని, దీంతో జూన్ రెండో వారంలో కేంద్ర సంస్థలు సీబ్య్లూపీఆర్ఎస్, సీఎస్ఎంఆర్ఎస్‌లతో సాంకేతిక పరీక్షలు చేయించాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం రెండు సంస్థలు సాంకేతిక పరీక్షలకు ఉపక్రమించే సమయానికి వరద రావడంతో టెస్ట్‌లు ఆపివేసినట్టు ఉత్తమ్ పేర్కొనడం గమనార్హం అన్నారు. ఈ వైఫల్యానికి ఎన్డీఎస్ఏ నిర్లక్ష్య వైఖరి కారణమైతే, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ వైఫల్యానికి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ 2023 అక్టోబర్ చివరలో హడావుడిగా వండి వార్చిన రాజకీయ నివేదికపై ఆనాడే విమర్శలు వెల్లువెత్తాయన్నారు. ఎటువంటి పరిశీలన జరపకుండానే, ఎటువంటి భూభౌతిక పరీక్షల ఫలితాలు లేకుండానే, తెలంగాణ ఇంజనీర్లతో ఏమీ చర్చకుండానే ఇటువంటి నిర్ధారణలకు రావడం కేంద్రం అధీనంలో పని చేసే ఒక సాంకేతిక సంస్థ చేయాల్సిన పని కాదన్నారు. ప్లానింగ్ లోపాలు ఉండవచ్చునని, డిజైన్‌లో లోపాలు ఉండవచ్చునని, నిర్మాణంలో నాణ్యతా లోపాలు ఉండవచ్చునని, నిర్వాహణ లోపాలు ఉండవచ్చునని ఊహాగానాలతో కేంద్రంలోని పాలక పక్షానికి ఎన్నికల్లో లబ్ది చేకూర్చడానికి నివేదికను వండి వార్చినట్టు విమర్శలు వెల్లువెత్తినాయన్నారు.

ఇవన్నీరాసి చివరికి భూభౌతిక పరీక్షలను జరిపి ఆ నివేదికలను తమకు అందజేయాలని ఉచిత సలహా పారేసి నివేదికను ముగించారన్నారు. అయితే అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ నది గర్భంలో జరిగే మార్పుల కారణంగా ఈ ఘటన జరిగి ఉంటుందని డ్యాం సేఫ్టీ అథారిటీ వారే ఆ నివేదికలో పేర్కొనడం గమనార్హం అన్నారు. అది దురదృష్టకరమైనదే... ప్రభుత్వం గాని, ఇంజనీర్లు గాని ఎవరూ ఇటువంటి సంఘటన జరగాలని కోరుకోరన్నారు. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ వారు ఏవైనా పునరుద్దరణ చర్యలు సూచిస్తారని ఆశించిన ప్రాజెక్టు ఇంజనీర్లకు తీవ్ర నిరాశ ఎదురైందన్నారు.

పీసీ ఘోష్ విచారణ కమిషన్ ఆదేశాలు జారీ చేసిన తర్వాతనే వారు తాత్కాలిక రక్షణా చర్యలు సూచిస్తూ మేలో నివేదిక పంపారన్నారు. దీనిలో కొత్త పరిష్కార మార్గాలు ఏమీ లేవని దీని కోసం నాలుగు నెలల విలువైన కాలాన్ని హరించి వేశారని ఇంజనీర్లు వాపోయారని, ఇదీ నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ నిర్వాకం అని మండిపడ్డారు. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ చెప్పినవే పరిష్కారాలు అని ప్రభుత్వం కూడా భావించి రాష్ట్ర ఇంజనీర్లను ముందుకు సాగనివ్వలేదని ఆరోపించారు. గోదావరికి వరదలు రాకముందే బ్యారేజీకి సరైన రక్షణ చర్యలు తీసుకోవలసిన ప్రభుత్వం ఎన్డీఎస్ఏ నివేదిక కోసం ఎదురు చూస్తూ 4 నెలల విలువైన కాలాన్ని వృథా చేసిందని, ఇప్పుడేమో వరదల కారణంగా పరీక్షలు ఆపివేశామని చెప్పడం బాధ్యతా రాహిత్యం కాదా? అని మంత్రిని నిలదీశారు.

గత ప్రభుత్వంపై, తెలంగాణ ఇంజనీర్లపై బురద జల్లే ప్రయత్నమే తప్ప బ్యారేజి పునరుద్దరణకు నిర్మాణాత్మక సూచనలు చేయడంలో నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ దారుణంగా విఫలమైందన్నారు. వారి నుంచి నివేదికను తెప్పించుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రదర్శించిందన్నారు. ఈ వరదల్లో మేడిగడ్డ బ్యారేజీకి ఏదైనా ప్రమాదం వాటిల్లితే ఆ బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. రక్షణ చర్యలు చేపట్టడంలో విఫలం చెందడమే కాక మా ప్రభుత్వంపై దుమ్మెత్తి పోయడం ఇంకా ఎంతకాలం చేస్తారు..? వానాకాలం ముగిసే నాటికి ఎన్డీఎస్ఏ నుంచి శాశ్వత రక్షణ చర్యలకు సంబందించిన నివేదికను తెప్పించుకోవడంపై శ్రద్ధ వహించాలని ఉత్తమ్‌ను కోరారు. తుమ్మిడి హట్టి వద్ద కొత్త ప్రాజెక్టు నిర్మాణం అని మంత్రి ఉత్తమ్ చెప్తున్నారు సంతోషకరం అన్నారు.

తుమ్మిడి హట్టిలో ఒప్పందం ప్రకారం 148 మీటర్ల వద్దనా..? 152 మీటర్ల వద్దనా..? ఉత్తమ్ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. 152మీటర్ల వద్ద కట్టాలని భావిస్తే ముందు మహారాష్ట్రను ఒప్పించాలన్నారు. ఆనాడు మహారాష్ట్రను ఒప్పించలేక పనులు చేయకుండా వదిలేసింది ఎవరు..? ఆ వైఫల్యం మీది కాదా..? తుమ్మిడి హట్టి వద్ద బ్యారేజీ కట్టినా లిఫ్ట్ లేకుండా ఎల్లంపల్లికి గ్రావిటీ ద్వారా నీళ్లు వెళ్లవని ఉత్తమ్‌కు తెలీదా..? అని నిలదీశారు. తలను వదిలేసి తోక నుంచి పనులకు టెండర్లు పిలిచి మొదలుపెట్టి, మొబిలైజేషన్ అడ్వాన్స్‌ల పేరు మీద, సర్వే, డిజైన్ల పేరు మీద తట్ట మట్టి ఎత్తక ముందే వందల కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లించి కమీషన్లు దండుకున్నది కాంగ్రెస్ కాదా..? అని ప్రశ్నించారు. 2013లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి పృథ్విరాజ్ చవాన్ రాసిన లేఖలోని అంశాలు ఉత్తమ్ మరొక్కసారి చదువుకోవాలని సూచించారు.వారు చేసిన సూచనలను దృష్టిలో ఉంచుకొని తుమ్మిడిహట్టి బ్యారేజీపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

2022 లో సంభవించిన వరద గోదావరి చరిత్రలోనే అతి పెద్దదని, మేడిగడ్డ బ్యారేజి వద్ద 28 లక్షల క్యూసెక్కులకు పైబడి వరద ప్రవాహం నమోదు అయ్యిందన్నారు. బ్యారేజి కింద సిమెంట్ బ్లాకులు అక్కడక్కడ లేచిపోయి ఉన్నందున చిన్నలీకేజీలు బుంగలుగా మారి రాఫ్ట్ కింద సొరంగం ఏర్పడడానికి దోహదం చేసిందని, బ్లాక్ 7 లో రాఫ్ట్ కింద ఏర్పడిన ఈ సొరంగం 2023 లో సంభవించిన భారీ వరదల అనంతరం అక్టోబర్ చివరి వారంలో మూడు పిల్లర్ల కుంగుబాటుకు కారణమయ్యిందని తెలుస్తూనే ఉన్నదన్నారు. ఇది అనుకోకుండా జరిగిన ఒక దురదృష్టకరమైన సంఘటన అన్నారు. భూభౌతిక పరీక్షల ద్వారా నిర్ధారణ కాకుండానే ప్లానింగ్ లో లోపాలు, నిర్మాణ లోపాలు, డిజైన్ లోపాలు, నాణ్యతా లోపాలు, నిర్వాహణ లోపాలు ఉన్నాయని ఆపాదించడం నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీకి, మంత్రిగా ఉత్తం లాంటి వారికి సమంజసం కాదన్నారు. ఇక రాజకీయాలు పక్కనబెట్టి బ్యారేజీని పునరుద్దరించి ప్రాజెక్టును మళ్ళీ వినియోగంలోకి తీసుకు రావలసిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. తెలంగాణ రైతాంగం కోరుతున్నది ఇదేనని, ఉత్తం రాజకీయ విమర్శలు కట్టిపెట్టి ప్రాజెక్టు పునర్ వినియోగంలోకి తీసుకు రావడం పట్ల శ్రద్ధ పెడితే రైతాంగానికి మేలు జరుగుతుందన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మంచి జరుగుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు వస్తుందని తెలిపారు.


Similar News