Harish Rao: తెలంగాణ మహిళలను ‘దసరా’ నిరూత్సాహపరిచింది

ఈ దసరా పండుగ తెలంగాణ ఆడబిడ్డలను నిరూత్సాహపరిచిందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) అన్నారు.

Update: 2024-10-16 10:10 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఈ దసరా పండుగ తెలంగాణ ఆడబిడ్డలను నిరూత్సాహపరిచిందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) అన్నారు. బుధవారం తెలంగాణ భవన్‌లో మీడియా ప్రతినిధులతో హరీష్ రావు చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉన్న పథకాలు బంద్ పెట్టడమే కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) తెచ్చిన మార్పు అని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఒక చీర కాదు.. బతుకమ్మ పండుగకు రెండు చీరలు ఇస్తామని రేవంత్ రెడ్డి(Revanth Reddy) హామీ ఇచ్చారు. రెండు కాదు కదా అసలేం ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. దసరా పండుగ వేళ అక్కా, చెల్లెళ్ళను‌ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు.

ఇవే కాదు.. రైతుబంధు రూ.15 వేలు అన్నారు. కేసీఆర్ కిట్ కంటే మంచి కిట్ ఇస్తామన్నారు. ముదిరాజ్, గంగపుత్రులకు చేప పిల్లలు ఇస్తామన్నారు. ఇచ్చిన హామీలు అన్నీ గాలికి వదిలి బీఆర్ఎస్‌పై విమర్శలు చేస్తున్నారని హరీష్ రావు ప్రభుత్వంపై సీరియస్ అయ్యారు. ఆగస్ట్‌లో పోయాల్సిన చేప పిల్లలను అక్టోబర్ వచ్చినా పోయలేదని మండిపడ్డారు. చేప పిల్లల కోసం తాము రూ.100 కోట్లు ఖర్చు చేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.16 కోట్లు మాత్రమే కేటాయించిందని గుర్తుచేశారు. చెరువులు నిండుకుండలా ఉన్నప్పటికీ.. చేప పిల్లల సగమే పోయాలంటున్నారని.. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన మార్పు అని ఎద్దేవా చేశారు.


Similar News