రేవంత్ రాజీనామా చేయ్.. నేను సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తా: హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ రిపేర్ సాధ్యమేనని ఇంజనీర్లు చెబుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే మేడిగడ్డ పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డికి ఆ పని చేతకాకపోతే సీఎం పదవికి రాజీనామా చేయాలని.. తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధణ చేసి చూపిస్తానని సంచలన సవాల్ విసిరారు. ప్రభుత్వం మేడిగడ్డ పునరుద్ధరణపై దృష్టి పెట్టకుండా రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగడాన్ని ప్రభుత్వం భూతద్దంలో చూపుతోందని, కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం కూలిపోయేలా కాంగ్రెస్ సర్కార్ కుట్ర రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక్క మేడిగడ్డ బ్యారేజీ మాత్రమే అనేలా కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడుతోందని, మేడిగడ్డతో కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం కుంగిపోయిందనేలా కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఎంత దుష్ప్రచారం చేసిన కాళేశ్వరం తెలంగాణకు వరప్రదాయని అని తెలిపారు. కాగా, కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో నీళ్లు నింపాలని కేసీఆర్ అంటున్నారని.. ఆ బాధ్యతలు కేసీఆర్, హరీష్ రావులకే అప్పగిస్తామని.. మేడిగడ్డను సరిచేసి చూపించాలని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి మేడిగడ్డను పునరుద్ధరిస్తానని హరీష్ రావు సవాల్ విసరడం సంచలనంగా మారింది. హరీష్ రావు వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారా అని తీవ్ర ఉత్కంఠ నెలకొంది,