రెండున్నర శతాబ్దాలు.. "ఆమె"కు దక్కని పీఠం
రెండున్నర శతాబ్దాలుగా అమెరికా అధ్యక్ష పీఠం మహిళలకు అందని ద్రాక్షే.
దిశ, వెబ్ డెస్క్: 248 ఏళ్ల ప్రజాస్వామ్యం. అగ్రపీఠం కోసం టఫ్ ఫైట్. మహిళలు ప్రత్యర్థుల వరకే పరిమితం. ఒక్కరంటే ఒక్కరు కూడా.. రెండున్నర శతాబ్ధాల్లో అధ్యక్ష పీఠాన్ని అధిరోహించలేకపోయారు. చాలా సంవత్సరాలు అక్కడ మహిళలకు ఓటు హక్కే లేదు. ఎన్నో పోరాటాల తర్వాత మహిళలకు ఓటు హక్కు వచ్చింది. చట్టసభల్లోనూ చోటు దక్కింది. కానీ.. అధ్యక్ష పీఠానికి అడుగు దూరంలోనే ఆగిపోతున్నారు. ఇందుకు కారణం "ఆమె"పై వివక్షా అంటే.. కాదు. అన్నిరంగాల్లోనూ మహిళలు రాణిస్తున్నారు. సింగపూర్ (Singapore), ఫిన్లాండ్ (Finland) వంటి దేశాలకు సారథులు మహిళలే. కానీ.. అమెరికా అధ్యక్ష పీఠం మాత్రం మహిళలకు అందని ద్రాక్షగానే మిగిలింది.
ఎన్నో సంవత్సరాల పోరాటం తర్వాత గానీ 1920లో అమెరికా (America) మహిళలకు ఓటు హక్కు దక్కలేదు. అది కూడా కొంతమంది వరకే అది పరిమితమైంది. ఎన్నో ఏళ్ల పోరాటం తర్వాత.. 1960ల్లో అన్నివర్గాల మహిళలకు ఓటు హక్కు దక్కింది. ఆ తర్వాత క్రమంగా చట్టసభల్లోనూ అడుగుపెట్టి.. రాణిస్తున్నారు. కానీ అధ్యక్ష పీఠాన్ని దక్కించుకోవాలన్నది మహిళల కలగానే మిగిలింది. మార్గరేట్ చేస్ స్మిత్ నుంచి కమలా హారిస్ వరకూ.. గంపెడాశలతో పోటీ చేసినా.. వైట్ హౌస్ కు దూరంగానే ఉన్నారు.
1964లో మార్గరేట్ చేస్ స్మిత్ (margaret chase smith) అధ్యక్ష పీఠం కోసం రిపబ్లికన్ పార్టీ (Republican Party) నుంచి పోటీ పడ్డారు. కానీ అభ్యర్థిత్వం కూడా దక్కలేదు. అధ్యక్షపీఠం కోసం పోటీ పడిన తొలిమహిళ ఆమె. ఆ తర్వాత 1968లో నల్లజాతి మహిళ అయిన షిర్లే చిషోమ్ (Shirley Chisholm) మహిళా సెనెటర్ గా ఎన్నికయ్యారు. 1972లో డెమెక్రాటిక్ పార్టీ (Democratic Party)నుంచి అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడగా.. నిరాశ తప్పలేదు. 1984లో.. డెమెక్రాటిక్ పార్టీ నుంచి గెరాల్డిన్ ఫెరారో (Geraldine A. Ferraro) అధ్యక్ష అభ్యర్థుల బరిలో నిలిచారు. ఓడినా.. మహిళల తరఫున ముందడుగు పడింది. 2008లో హిల్లరీ క్లింటన్ (hillary clinton) డెమోక్రాటిక్ అభ్యర్థిగా పోటీకి దిగారు. కానీ.. ఆమె కూడా అభ్యర్థిత్వాన్ని సంపాదించుకోలేకపోయారు. 2016లో ట్రంప్ పై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తాజాగా మరోసారి ట్రంప్ పై భారత సంతతి మహిళ కమలా హారిస్ (kamala harris) పోటీ చేసి.. పరాజయం పాలయ్యారు. అగ్రరాజ్యానికి పెద్దన్నే తప్ప.. పెద్దక్క ఇప్పటి వరకూ ఎన్నిక కాలేదు. భవిష్యత్ లో అయినా ఈ చరిత్రను ఎవరైనా మారుస్తారో లేదో చూడాలి.