రివ్యూలపైనే ఫోకస్..! సర్కారుపై సమరమేది?
ప్రభుత్వంపై ఫైట్ చేయడంలో కాంగ్రెస్ వెనకబడుతున్నది.
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వంపై ఫైట్ చేయడంలో కాంగ్రెస్ వెనకబడుతున్నది. ఆశించిన స్థాయిలో పోరాటం చేయలేకపోతున్నది. తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అనేక తప్పిదాలు స్పష్టంగా కనిపిస్తున్నా.. దాన్ని అందిపుచ్చుకొని యుద్ధం చేయడంలో కాంగ్రెస్ ఫెయిలవుతున్నది. ప్రభుత్వం నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాలకు ఏ మాత్రం తగ్గకుండా కాంగ్రెస్ ఆధ్వర్యంలోనూ సెలబ్రేషన్స్ చేస్తామని గతంలో పార్టీ ప్రకటించింది. 21 రోజుల పాటు బీఆర్ఎస్ మార్క్ కనిపించకుండా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు చేయనున్నట్లు నేతలు చెప్పారు.
ప్రభుత్వ తప్పిదాలను వెలికితీసి ప్రజల ముందు ఉంచుతామని గాంధీభవన్ సాక్షిగా వెల్లడించారు. కానీ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన దశాబ్ది ఉత్సవాలు కేవలం ఒక రోజుకే పరిమితమైనట్లు స్పష్టంగా అర్థమవుతున్నది. జూన్ 2న లోక్ సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ వచ్చిన నేపథ్యంలో ర్యాలీ తీసి గాంధీభవన్ లో హడావిడి చేశారు. ఆ తర్వాత ముఖ్య నేతలతోపాటు కేడర్ కూడా సైలెంట్ అయిపోయింది. అన్ని జిల్లాల్లో ఆందోళనలు నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. కానీ కనీసం హైదరాబాద్ లో కూడా ఈ కార్యక్రమాలేవీ కనిపించకపోవడం గమనార్హం.
రాష్ట్ర స్థాయి నేతలంతా గాంధీభవన్ లో రివ్యూలు, మీటింగ్‌లు, ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్నారు. క్షేత్రస్థాయిలో కేడర్‌ను ఉత్తేజ పరుస్తూ పార్టీ గెలుపు కోసం కృషి చేయడం లేదనే విమర్శలు సొంత కార్యకర్తల నుంచే వినిపిస్తున్నాయి. దీంతో ఏఐసీసీ రాష్ట్ర ఇన్ చార్జి మానిక్రావు థాక్రే టీ కాంగ్రెస్ నేతలకు క్లాస్ పీకాల్సిన పరిస్థితి వచ్చింది.
ప్రభుత్వానికి ‘నో’ కౌంటర్..
ప్రభుత్వం 21 రోజుల పాటు డిపార్ట్ మెంట్‌ల వారీగా సెలబ్రేషన్స్ చేస్తున్నది. స్కీమ్లు, కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. అయితే ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన పథకాల్లో జరుగుతున్న తప్పిదాలు, వైఫల్యాలను కాంగ్రెస్ పార్టీ ఎండగట్టలేకపోతున్నది. ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఇతర కార్యక్రమాలు తమ ప్రభుత్వ హయాంలో గొప్పగా నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ ప్రచారం చేసుకుంటున్నది.
దీంతోపాటు రైతు బంధు, కల్యాణ లక్ష్మీ, దళిత బంధు, సబ్సిడీ లోన్లు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, ప్రభుత్వాస్పత్రుల్లో పనితీరు, ఇంటింటికీ నల్లా నీరు, 24 గంటల పవర్ వంటివన్నీ తమ ఆధ్వర్యంలోనే గొప్పగా జరిగాయని బీఆర్ఎస్ దశాబ్ది ఉత్సవాల్లో విస్తృతంగా చెప్పుకుంటున్నది. అయితే ఈ స్కీమ్లలో జరిగిన అన్యాయం, లోపాలు, వైఫల్యాలను కాంగ్రెస్ పార్టీ వివరించే ప్రయత్నాలేవీ చేయడం లేదు.
ప్రతి ఇంటికి ప్రత్యేక కరపత్రాలతో వాస్తవాలను తెలియజేస్తామని గతంలో పేర్కొన్నా... ఇప్పటి వరకు ఆ దిశగా అడుగులు వేయకపోవడం విచిత్రంగా ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలు ఎదురుదాడులు చేస్తున్నా.. కాంగ్రెస్ పార్టీ అందుకు మద్దతు, భాగస్వామ్యం అయ్యేందుకు ఆసక్తి చూపకపోవడం ఆశ్చర్యంగా ఉన్నది.
ఈ అవకాశాన్నీ కోల్పోతే..
పదేళ్ల ప్రభుత్వ పాలనపై ప్రజల నుంచి వ్యతిరేకత క్రమంగా పెరుగుతున్నది. దీన్ని అడ్వంటేజ్ చేసుకొని ముందుకు పోవాల్సిన కాంగ్రెస్ పార్టీ ఆ స్థాయిలో పోరాటం చేయలేక సతమతమవుతున్నది. దీనికి గల కారణాలు చెప్పడంలో పార్టీ విఫలమైంది. దీంతో కార్యకర్తలు, క్షేత్రస్థాయిలో పనిచేసే కేడర్ రాష్ట్ర స్థాయి నేతలపై గుర్రుగా ఉన్నారు. గట్టి ఫైట్ చేస్తూ ఈ సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి రాకపోతే తమ భవితత్వం ఏమిటని కార్యకర్తలు ఆందోళనకు గురికావల్సిన పరిస్థితి నెలకొన్నది. వాస్తవానికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభావాన్ని ఎదుర్కొన్నది. దీంతో ఈ సారి ప్రత్యేక వ్యూహాంలో ముందుకు వెళ్లాల్సిన కాంగ్రెస్... నత్తనడకన వెళ్లడంపై సొంత పార్టీ నేతలే విమర్శల వర్షం కురిపిస్తున్నారు.