ఎన్నికల వేళ సీఎం కేసీఆర్‌కు ఊహించని గండం.. సర్కార్‌కు సవాల్‌గా మారిన ‘సాయం’..!

రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వానికి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. ఇప్పటికే ఖజానా ఖాళీతో పరేషాన్‌లో ఉన్న ప్రభుత్వానికి వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు మరింత ఇబ్బందుల్లోకి నెట్టాయి.

Update: 2023-07-28 02:58 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వానికి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. ఇప్పటికే ఖజానా ఖాళీతో పరేషాన్‌లో ఉన్న ప్రభుత్వానికి వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు మరింత ఇబ్బందుల్లోకి నెట్టాయి. కుంభవృష్టితో అనేక జిల్లాల్లో వందలాది రోడ్లు దెబ్బతిన్నాయి. వీటి మరమ్మతులకు ప్రభుత్వంపై రూ.వందల కోట్ల మేర భారం పడనున్నది.

ఊహకందని విధంగా వచ్చిన ఖర్చుకు తగినట్లు ఆర్థిక వనరులు సమకూర్చుకోవటం ఇప్పుడు గవర్నమెంట్‌కు అనివార్యంగా మారింది. వరదలు తగ్గుముఖం పట్టిన తర్వాత రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్ శాఖల నుంచి రోడ్లకు ఏ మేరకు నష్టం జరిగిందో నివేదిక తెప్పించుకున్న తర్వాత ఎంత ఖర్చు చేయాల్సి ఉంటుందనే దానిపై సర్కారు ఒక అంచనాకు రానున్నది. రోడ్లకు మరమ్మతులు చేసేందుకు డబ్బుల తిప్పలు, చేయకపోతే ఎన్నికల టైంలో ఓట్ల చిక్కులు ఇప్పుడు అధికార పార్టీకి తలనొప్పిగా మారింది.

వరద బాధితులకు నగదు, వస్తు రూపంలో సాయం చేయడం కూడా ఇప్పుడు ప్రభుత్వానికి తక్షణ కర్తవ్యంగా మారింది. గతేడాది వరదల సమయంలో బాధిత కుటుంబాలకు తలా రూ.10 వేల చొప్పున, దానికి ముందు జీహెచ్ఎంసీ వరదల సమయంలోనూ ఇదే మొత్తంలో సాయం అందించింది. తాజా వరదలకు కూడా ప్రభుత్వం ఇదే తీరులో సాయం అందించకపోతే అధికార పార్టీ ఓటు బ్యాంకుపై ప్రభావం పడే అవకాశం ఉన్నది. దీన్ని దృష్టిలో పెట్టుకుని వరదలు తగ్గుముఖం పట్టిన తర్వాత సీఎం ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది.

గతేడాది వెయ్యి కోట్ల హామీ

2022 జూలైలో వరదల టైంలో కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్ తదితర జిల్లాల్లో ఏరియల్ సర్వే నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.వెయ్యి కోట్లు కేటాయించనున్నట్లు హామీనిచ్చారు. భద్రాచలం ప్రాంతం ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ఈ నిధులతో అభివృద్ధి పనులు, కరకట్ట నిర్మాణం గురించి ప్రస్తావించారు. సరిగ్గా ఏడాది పూర్తయినా ఆ వెయ్యి కోట్ల ఊసే లేదు. వరద బాధితులకు తలా రూ.10 వేల నగదు, రెండు నెలల పాటు కుటుంబానికి 20 కిలోల ఉచిత బియ్యం హామీ మాత్రం నెరవేరింది.

ప్రభుత్వం నుంచి సాయంపై ఆసక్తి

గతేడాది వరదలతో పలు జిల్లాల్లో రోడ్లు దెబ్బతినడంతో సుమారు రూ.323 కోట్ల మేర నష్టం వాటిల్లిందని, 827 ప్రాంతాల్లో మరమ్మత్తు పనులు చేపట్టక తప్పదని వివిధ శాఖల అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. పంచాయతీరాజ్ శాఖకు చెందిన పలు భవనాలూ ధ్వంసమైనట్లు పేర్కొన్నారు. డ్రైనేజీ వ్యవస్థ కూడా దెబ్బతిన్నదని పేర్కొన్న సీఎం ఒక్కో జిల్లాకు తక్షణ సాయాన్ని ప్రకటించారు. పనులు, మరమ్మతుల కోసం కలెక్టర్ల దగ్గరున్న నిధులు వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. ఈసారి కూడా వరదలు రావడంతో నష్టాన్ని అంచనా వేయాలని అధికారులను ఆదేశించడంతో పాటు ప్రభుత్వం నుంచి ఏ మేరకు నిధుల విడుదల ఉంటుందనే ఆసక్తి అందరిలోనూ నెలకొన్నది.

త్వరలో ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే..?

గతేడాది వరదల సందర్భంగా సీఎం ఏరియల్ సర్వే నిర్వహించారు. రోడ్డు మార్గం ద్వారా కొన్ని ప్రాంతాలను పరిశీలించారు. బాధితులతోనూ మాట్లాడారు. పరిస్థితిపై అధికారులతో సమీక్షించారు. ఈసారి వరదలు తగ్గుముఖం పట్టిన తర్వాతా సీఎం ఈ తరహా పర్యటించే అవకాశం ఉన్నది. సుమారు 108 గ్రామాలకు చెందిన పది వేల మందికిపైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ప్రధాన కార్యదర్శి పేర్కొనడంతో ఫీల్డ్ విజిట్ సందర్భంగా బాధితులకు ముఖ్యమంత్రి స్వయంగా కొన్ని హామీలిచ్చే అవకాశం ఉన్నది. నగదు సాయంతో పాటు వస్తు రూపేణా ఆదుకునేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవచ్చని సమాచారం. ఇప్పటికే సహాయ పునరావాస చర్యల కోసం కలెక్టర్ల దగ్గరున్న నిధులు వినియోగించుకునేలా ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు.

కేంద్రానికి సాయం కోసం విజ్ఞప్తి

గతంలో కేంద్రంతో సంబంధాలు సరైన తీరులో లేకపోవడంతో వరద సాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోలేదు. కేంద్రం.. తెలంగాణ పట్ల వివక్షతో వ్యవహరిస్తున్నదని, సాయం చేయడంలేదని, బీజేపీ పాలిత రాష్ట్రాలకు మాత్రమే అందిస్తున్నదంటూ మంత్రి కేటీఆర్ సహా అధికార పార్టీ నేతలు బహిరంగంగానే విమర్శించారు. హైదరాబాద్ నగరానికి వరదలు వచ్చినప్పటి అంశాన్ని వారు ప్రస్తావించారు.

రూ.5 వేల కోట్ల మేరకు నష్టం జరిగినా కేంద్రం సాయం చేయలేదని ఆరోపించారు. కానీ ఇప్పుడు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యే సానుకూల వాతావరణం నెలకొన్న నేపథ్యంలో రాష్ట్రంలో వరదలతో జరిగిన నష్టానికి కేంద్ర ప్రభుత్వం తరఫున సాయం చేయాలని కోరే అవకాశం ఉన్నది. వరద పరిస్థితి సద్దుమణిగిన తర్వాత దీనిపై రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసి దానికి అనుగుణంగా కేంద్రానికి లేఖ రాసే అవకాశం ఉన్నది.

ఎన్నికల టైమ్‌లో పొలిటికల్ చిక్కులు

అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రోడ్లను వెంటనే బాగు చేయడం, వరద బాధితులకు సాయం అందించడం బీఆర్ఎస్‌కు ఇప్పుడు కీలకంగా మారింది. రోడ్లకు మరమ్మతులు చేయకపోతే ఎన్నికల ప్రచారానికి వెళ్లే సమయంలో ప్రజలు నిలదీస్తారనే భయంతో పాటు ఓటింగ్‌పైనా ప్రభావం పడుతుందనే భయం వెంటాడుతున్నది. అవసరమైన నిధులు సమకూర్చుకోవడం ఇప్పుడు సర్కారుకు సవాల్‌గా మారింది.

సంక్షేమ పథకాలకే పైసల్లేని దయనీయ పరిస్థితుల్లో ఇప్పుడు వరద రూపంలో అదనపు ఖర్చు వచ్చి పడడంతో ఆర్థిక శాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. వీటిని సమకూర్చుకోవడం వారికి కత్తిమీద సాములా మారింది. వీటిని బాగుచేయడానికి నిధుల కొరత, బాగుచేయకుంటే ఓట్ల బాధ సవాలుగా మారింది. అధికారులతో రివ్యూ తర్వాత సీఎం దీనిపై స్పష్టమైన నిర్ణయం తీసుకోనున్నారు.


Similar News