Gummadi Narsaiah: ఐదుసార్లు ఎమ్మెల్యే...కంటి పరీక్షకు క్యూలైన్ లో..!

ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిస్తేనే పెద్ద కారు...గన్ మెన్లు..వెంట అనుచర గణం, నలగని ఖద్దరు చొక్కా, స్టార్ హోటల్స్ భోజనం..విలాసవంతమైన జీవనం వారి సొంతం.

Update: 2024-11-14 12:07 GMT

దిశ, వెబ్ డెస్క్ :ఒక్కసారి ఎమ్మెల్యే(MLA)గా గెలిస్తేనే పెద్ద కారు...గన్ మెన్లు..వెంట అనుచర గణం, నలగని ఖద్దరు చొక్కా, స్టార్ హోటల్స్ భోజనం..విలాసవంతమైన జీవనం వారి సొంతం. ఈ రోజుల్లో వార్డు మెంబర్, ఎంపీటీసీలే పదవుల దర్పం దర్జాలు ప్రదర్శించుకుంటుంటారు. అలాంటిది ఏకంగా 21 ఏళ్లు ఎమ్మెల్యేగా కొనసాగితే ఎలా ఉండాలి?. కాని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య(Gummadi Narsaiah)మాత్రం ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా అధికార దర్పానికి, విలాసాలకు దూరంగా వ్యవహరిస్తు నీతి, నిజాయితీకి, సాదాసీదా జీవితానికి నిలువెత్తు నిదర్శనంగా అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. నిరాడంబర జీవనం గడిపే ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఇప్పటికీ తన జీవన పంథా మార్చుకోవడం లేదు. పదవిలో ఉన్నంతకాలం బస్సు, ట్రైన్ లో హైదరాబాద్ వచ్చి విద్యానగర్ లోని పార్టీ ఆఫీసులో పడుకుని ఆటోలో అసెంబ్లీకి వచ్చేవాడు. జీహెచ్ఎంసీ రూ.5 భోజనం చేసేవారు.

పబ్లిసీటీకి అవినీతికి దూరంగా ఉండే నర్సయ్యకు కొద్ధిపాటి పొలం తప్పా ఆస్తులు లేవు. అయిదు సార్లు ఎమ్మెల్యేగా పొందిన జీతం మొత్తం పార్టీకే ఇచ్చేవారు. ఇప్పటికి సైకిల్‌పై వెళ్లడం, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడం వంటివి ఆయన విషయంలో సర్వ సాధారణంగా కనిపిస్తాయి. ఈ క్రమంలోనే తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని ఎల్‌వీ ప్రసాద్‌ ఆస్పత్రిలో కంటి పరీక్షల కోసం వచ్చిన గుమ్మడి నర్సయ్య మాజీ ఎమ్మెల్యే అన్న ప్రోటోకాల్ కు దూరంగా సాధారణ జనం మాదిరిగానే వ్యవహరించి మరోసారి తన నిరాడంబరత చాటుకున్నారు. అక్కడ అందరితో పాటే ఓపీ చీటీ తీసుకుని వైద్యుల గది ముందు క్యూలో వేచి ఉండి తన వంతు వచ్చాక కంటి పరీక్ష చేయించుకున్నారు. గుమ్మడి నర్సయ్య మాత్రం ఔన్నత్యాన్ని చూసి పలువురు అభినందించారు. గుమ్మడి నర్సయ్య ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇల్లందు నియోజకవర్గం నుంచి 1983, 1985, 1989, 1999, 2004లో ఐదు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు.

Tags:    

Similar News