కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతుల వెరైటీ నిరసన.. గౌరవం కాపాడుకోవాలంటూ రేవంత్ రెడ్డికి సూచన

అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్న తరుణంలో సిద్దిపేట రైతుల నుంచి వినూత్నంగా పోస్ట్ కార్డు ఉద్యమం ప్రారంభమైంది.

Update: 2024-04-15 07:43 GMT

దిశ, డైనమిక్ బ్యూరో:అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్న తరుణంలో సిద్దిపేట రైతుల నుంచి వినూత్నంగా పోస్ట్ కార్డు ఉద్యమం ప్రారంభమైంది. ఇచ్చిన హామీలు అమలు కావడం లేదంటూ సిద్దిపేట జిల్లా రైతులు సీఎం రేవంత్ రెడ్డికి పోస్ట్ కార్డుల ద్వారా తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ మేరకు సిద్దిపేట పత్తి మార్కెట్ యార్డ్ లో సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్, చిన్నకోడూర్ మండలం మార్కెట్ యార్డ్ లో రైతులు సీఎం రేవంత్ రెడ్డికి పోస్ట్ కార్డు ద్వారా ఉత్తరాలు రాసి తమ నిసరన వ్యక్తం చేశారు. సిద్దిపేట మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన ఓ రైతు పోస్ట్ కార్డు రాస్తూ... తాను 2 ఎకరాల్లో వరి పంట సాగు చేశానని, కోత కూడా పూర్తయిందని కానీ ఇప్పటి వరకు మీరు ఇస్తామని హామీ ఇచ్చిన క్వింటాల్ కు రూ.500 బోనస్ ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రూ. 15000 రైతు బంధు, కౌలు రైతులకు రూ. 15000, రైతు కూలీలకు రూ. 12000, రెండు లక్షల రుణమాఫీ, వరి ధాన్యానికి బోనస్ రూ.500 ఇస్తామని హామీ ఇచ్చి విస్మరించారని ప్రశ్నించారు. ఈ హామీలను వెంటనే అమలు చేసి మీ గౌరవాన్ని కాపాడుకోవాలని లేకుంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఎంపీ ఎన్నికల వేళ కాంగ్రెస్ 100 రోజుల పరిపాలనపై బీఆర్ఎస్ పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News