ఊహించని రీతిలో బెడిసికొట్టిన సర్కార్ ప్రతిష్టాత్మక నిర్ణయం.. అరిగోస పడుతున్న లక్షలాది రైతులు!

Update: 2023-06-04 02:38 GMT

అద్భుతం.. అత్యద్భుతం అంటూ ధరణి పోర్టల్ గురించి ఓ వైపు ప్రభుత్వం ప్రచారం చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. ప్రతి ఊర్లో భూ సమస్యలు దర్శనమిస్తున్నాయి. పరిష్కారం కోసం వేలాది మంది రైతులు ప్రతి రోజు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. సమస్యలు పరిష్కారం కాక కొందరు ఆత్మహత్యలు సైతం చేసుకున్నారు.

పోర్టల్ రూపకల్పనలో తలెత్తిన లోపాలను ప్రభుత్వం కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నది. తహశీల్దార్ పొరపాటు చేస్తే అప్పీల్‌కి వెళ్లే వ్యవస్థ కూడా లేకుండాపోయింది. అధికారులు పొరపాట్లు చేసినా కోర్టుకు వెళ్లాళ్లిన దుస్థితి నెలకొన్నది. అన్ని సమస్యలు పరిష్కరించి జూన్ 15లోగా నివేదిక సమర్పించాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. కాగా, ఆర్‌ఓఆర్‌ చట్టం ప్రకారంగా 20 రకాల సమస్యలు ఉన్నట్లు హైకోర్టు గుర్తించినా, ఈ విషయాన్ని ప్రభుత్వం పెడచెవిన పెడుతున్నదన్న విమర్శలున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: ఆన్ లైన్‌లో రిజిస్ట్రేషన్లు, సేల్ డీడ్స్ వేగంగా చేసినంత మాత్రాన భూ పరిపాలన మొత్తం బాగుందనుకుంటే పొరపాటే. భూ రికార్డుల నిర్వహణ అంటే కేవలం రిజిస్ట్రేషన్లు మాత్రమే కాదని, అనేక అంశాలు ఉంటాయని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చాక సామాన్యులకు న్యాయం దూరమైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామ స్థాయిలో పరిష్కారమయ్యే వాటికి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారుల వరకు వెళ్లాల్సి వస్తున్నది. సమస్యలు పరిష్కరించాలని రెండున్నరేండ్ల కాలంలో సుమారు 12 లక్షల మంది దరఖాస్తులు పెట్టుకున్నారు. ఆఫీసుల చుట్టూ నెలల తరబడి తిరుగుతున్నారు.

అధికారులు చేసిన పొరపాటు వల్ల, ఒకరి భూమి మరొకరి పేరిట నమోదైనా.. ఆ తప్పులను సరిదిద్దే అధికారం తహశీల్దార్‌కు సైతం లేకుండాపోయింది. కోర్టుకు వెళ్లి ఆర్డర్ తీసుకురావాలంటూ అధికారులే సూచిస్తుండడం గమనార్హం. దీంతో చిన్న చిన్న కేసులు కూడా హైకోర్టు వరకు వెళ్తున్నాయి. ఇలా వచ్చిన అనేక సమస్యలను పరిశీలించిన తర్వాత ఆర్‌ఓఆర్‌ చట్టం ప్రకారంగా 20 రకాల సమస్యలు ఉన్నట్లు హైకోర్టు గుర్తించగా, ఆ విషయాన్ని ప్రభుత్వం పెడచెవిన పెట్టిందనే విమర్శలు వస్తున్నాయి. అంతేకాకుండా సమస్యలు పరిష్కారం కాక పది మందిరైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇబ్రహీంపట్నంలో ఇద్దరు కాల్చుకొని చనిపోయారని రైతుసంఘాల నేతలు చెబుతున్నారు.

ధరణి డేటాకు ప్రామాణికత ఉన్నదా?

ధరణిలో నిక్షిప్తమైన డేటాకు ఏ రికార్డులను ప్రామాణికంగా తీసుకుంటున్నారో అర్థం కావడం లేదు. ఖాస్రా పహాణీ ప్రకారం నేచర్ ఆఫ్ ల్యాండ్‌ని ప్రామాణికంగా తీసుకుంటే, మరి ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలను ఎలా పరిగణిస్తారు? అవన్నీ ఇల్లీగల్‌గా చేశారా? వాటిని కూడా పరిష్కరిస్తామని గ్యారంటీ ఇస్తున్నారా? ఆ మార్పులను సీడ్ చేసేందుకు కలెక్టర్లకు ఏమైనా గైడ్ లైన్స్ ఇచ్చారా? నిషేధిత జాబితాలో చేర్చిన పట్టా భూములను విడిపించేందుకు ఇదే అతి పెద్ద ప్రశ్న. దీనికి సమాధానం లభిస్తే 80 శాతం పీఓబీ సమస్యలు గట్టెక్కుతాయి. రంగారెడ్డి జిల్లాలో ఒకాయన భూమి కొనుగోలు చేయగా, ఇనాం ల్యాండ్ పేరుతో మ్యుటేషన్‌ను పెండింగులో పెట్టారు.

1983 నుంచి ఆ భూమి చేతులు మారగా, లింక్ డాక్యుమెంట్లు చూపించినా ససేమీరా అంటున్నారు. ఖాస్రాలో ఏది ఉంటే అదే ఫైనల్ అని చెబుతున్నారు. మరి అంతకు ముందు సేల్ డీడ్ చేసిన సబ్ రిజిస్ట్రార్, పట్టాగా మార్చిన రెవెన్యూ యంత్రాంగంపై ఎవరు చర్యలు తీసుకోవాలి? భూమి చేతులు మారిన ప్రతిసారీ స్టాంపు డ్యూటీ కట్టించుకున్నప్పుడు ప్రభుత్వానికి బాధ్యత ఉండదా? అని రైతులు ప్రశ్నిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాంలో ఓ దొరకు వందల ఎకరాలు ఉన్నది. ఇప్పటికీ ధరణిలో అలాగే ఉన్నది.

ఈ భూములపై నవాబులకు, ఈ దొరకు మధ్య 1950 నుంచి కేసులు నడుస్తున్నాయి. ఆ తర్వాత సీలింగ్ యాక్ట్ అమలైంది. కానీ ఈ భూములు వివాదంలో ఉండడంతో వదిలేశారు. మరి కేసులు కొలిక్కి వస్తే సీలింగ్ యాక్ట్ అమలవుతుందా? లేదా? 1973లో అమలైన సీలింగ్ యాక్ట్ తర్వాత సీలింగ్ భూములు ప్రభుత్వ ఖాతాలో చేరాయి. మరి ఖాస్రా పహాణీని ప్రామాణికంగా తీసుకుంటే అవి పట్టా భూములుగానే కనిపిస్తాయి. 2017లో భూ రికార్డుల ప్రక్షాళన చేశారు. అయితే దాని తర్వాత రూపొందించిన రెవెన్యూ రికార్డు లేదా డేటా ఉత్తదేనా? అప్పటి దాకా పట్టా భూములుగా కొనసాగిన భూములను సర్కారీ అంటూ పీవోబీలో పెడితే కొనుగోలు చేసిన రైతులు ఎక్కడికి పోవాలి? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

అప్పీల్ వ్యవస్థ ఏది?

కొత్త ఆర్‌ఓఆర్‌ చట్టం రాకముందు కొన్ని ఆర్డర్లు పాస్‌ అయ్యాయి. అయితే కొత్త చట్టం ప్రకారం వాటిపై అప్పీల్‌కు వెళ్లే అవకాశం లేదు. కొత్త చట్టం వచ్చే నాటికి ఉన్న పెండింగ్‌ కేసులపై ట్రిబ్యునల్‌కు వెళ్లాలని ప్రభుత్వం చెప్పింది. అయితే పాతచట్టం ప్రకారం వచ్చిన ఆర్డర్లపై అప్పీల్‌కు వెళ్లే అవకాశం ఇవ్వాలని, వాళ్లు ఆ చట్టం ప్రకారం అప్పీల్‌ చేసుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ అంశాలన్నీ నిత్యం కోర్టు ముందుకు వస్తూనే ఉన్నాయి. ఆర్ఓఆర్ చట్టం 2020 లక్ష్యాలను సాధించాలన్నా, పెండింగ్‌ కేసుల భారాన్ని తగ్గించాలన్నా ప్రభుత్వం తప్పనిసరిగా సమస్యలన్నింటినీ గుర్తించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని హైకోర్టు పేర్కొన్నది.

అందుకనుగుణంగా గ్రామ, మండల, డివిజన్‌ స్థాయిలో పని చేస్తున్న రెవెన్యూ అధికారులు, కలెక్టర్ల అభిప్రాయాలను స్వీకరించి, ఆర్ఓఆర్ యాక్ట్ 2020 లక్ష్యాల సాధనకు, ధరణి పోర్టల్‌లో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సీసీఎల్‌ఏను కోర్టు నిర్దేశించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీసీఎల్‌ఏ ఇద్దరూ కలిసి ఉత్తర్వు కాపీ అందిన నాటి నుంచి నాలుగు వారాల్లో పరిష్కరించి, జూన్ 15వ తేదీకల్లా నివేదికను అందజేయాలని హైకోర్టు తెలిపింది.

సంపన్నులకు వరం

ధరణి పోర్టల్ సంపన్నులకు వరంగా మారింది. ఎన్ని వందల ఎకరాలైనా కొనుగోలు చేసి, వాటిని గోప్యంగా ఉంచేలా రైట్ టూ ప్రైవసీ ఆప్షన్‌ను ప్రభుత్వం తీసుకొచ్చింది. దీన్ని రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, సిద్ధిపేట, వరంగల్ జిల్లాల్లోనే ఎక్కువగా వినియోగించుకుంటున్నారు. ప్రధానంగా శంషాబాద్, గండిపేట, కొత్తూరు, కేశంపేట, మొయినాబాద్, శంకర్ పల్లి, షాబాద్, షాద్ నగర్ మండలాల్లో కొనుగోలు చేసిన వారే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుండడం గమనార్హం. పైగా ఆ లావాదేవీలన్నీ తాజాగా చేసినవే కావడం విశేషం. గండిపేట మండలం వట్టినాగులపల్లిలో వివాదాస్పద భూములను కొనుగోలు చేసిన రాజకీయ అండదండలు పుష్కలంగా కలిగిన కొన్ని సంస్థలు, వ్యక్తులు ఈ ఆప్షన్ ద్వారా డేటాను దాచేశారు.

ఆఖరికి కోర్టు డిక్రీ వచ్చి అమలుకు నోచుకోని భూములను కూడా పాత రైతుల నుంచి సేల్ డీడ్ చేయించుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వాటి విలువ రిజిస్ట్రేషన్ ప్రకారమే రూ.వందల కోట్లుగా ఉంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్ నగర్‌లో ఓ బడా కంపెనీకి చెందిన వారు 30 నుంచి 40 ఎకరాలు, పెద్దమంగళారంలో ఓ రాజ్యసభ సభ్యుడికి 30 ఎకరాలు, అజీజ్ నగర్‌లో ఓ బడా పారిశ్రామికవేత్తకు 12 ఎకరాలు, హిమాయత్నగర్‌లో ఓ మంత్రి కుటుంబ సభ్యులు, బినామీలకు 12 ఎకరాలు, అజీజ్ నగర్‌లో ఓ ఎమ్మెల్సీకి 4.20 ఎకరాలు, ఓ ఐఏఎస్ అధికారికి 2.20 ఎకరాలు, మేడిపల్లిలో ఓ ఎమ్మెల్సీకి 10 ఎకరాలు వంతున ఎంతో మందికి భూములు ఉన్నట్లు తెలిసింది.

అజీజ్ నగర్‌లో ఓ మంత్రి సోదరుడు, ఆయన బినామీలు 4 ఎకరాల్లో విల్లాలు కట్టి అమ్మేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇవేవీ రికార్డుల్లో కనిపించకుండా చేశారు. ఆయా సంస్థలకు, వ్యక్తులకు అంత పెద్ద మొత్తంలో డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని ఎవరైనా ప్రశ్నిస్తారని, ఐటీ శాఖకు ఫిర్యాదు చేస్తారని ముందుగానే పసిగట్టి ఈ మేరకు గోప్యతను అమల్లోకి తెచ్చుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలా ఒకరిద్దరు కాదు.. బడాబాబులకు ఈ ఆప్షన్ బాగా ఉపయోగపడుతున్నది.

వారసత్వ ధ్రువీకరణ ఏది?

కొత్త రెవెన్యూ చట్టంలో విచారణేదీ అవసరం లేకుండానే విరాసత్(వారసత్వ మార్పిడి) చేసే అధికారం కట్టబెట్టింది. ఇప్పుడది కొంపలు ముంచుతున్నది. వారసుల్లో ఒకరికి తెలియకుండా మరొకరు రాసిచ్చే సెల్ఫ్ డిక్లరేషన్‌తో చేపట్టే భూ మార్పిడి పెద్ద చిచ్చు పెడుతున్నది. పచ్చని కుటుంబాల్లో గొడవలు సృష్టిస్తున్నది.

ఆన్లైన్ ద్వారా డాక్యుమెంట్లు, అఫిడవిట్ అప్ లోడ్ చేయడంతో ఎలాంటి విచారణ అవసరం లేకుండానే భూ మార్పిడి చేయాలని కొత్త ఆర్వోఆర్ చట్టం చెప్తున్నది. ఇదే ఇప్పుడు వారసుల మధ్య గందరగోళాన్ని సృష్టిస్తున్నది. ఇటీవల రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలో అత్యంత ఖరీదైన భూముల్లో చిచ్చు తలెత్తింది. ఆఖరికి ఈఐపీఎల్ కన్స్ట్రక్షన్ సంస్థ యాజమాన్యంపైనా కేసు నమోదు కావడం విశేషం. ఓ వీఆర్ఏ కూడా కేశంపేటలో మండలంలో బాధితుడిగా మారాడు.

ఆటోమెటిక్ వెరీ డేంజర్

తెలంగాణ రాష్ట్రంలో ఆటోమెటిక్ మ్యుటేషన్ వివాదరహితమేనా? ఇన్ని తప్పులు కలిగిన రెవెన్యూ రికార్డుతో ఎలా? ఆర్ఎస్ఆర్ తేడా ఉన్న సర్వే నంబర్లు ఎన్ని? ప్రతి రెవెన్యూ విలేజ్‌లో 20 నుంచి 30 శాతం సర్వే నంబర్లలో ఆర్ఎస్ఆర్ తేడా ఉన్నట్లు తెలుస్తున్నది. మరి పొషెషన్ లేని భూములు రిజిస్టర్ అవుతుంటే వాటిని మ్యుటేషన్ చేస్తూ పోతే ఏదో ఒక రోజు లేని భూమిని చూపించమని ప్రభుత్వాన్ని అడిగే హక్కు కొనుగోలు చేసిన వ్యక్తికి ఉండదా? లేని భూముల క్రయ విక్రయాలను నిలుపుదల చేయాలంటే కనీసం మ్యుటేషన్ సమయంలోనే గ్రౌండ్‌లో వెరిఫై చేసుకోవడం అధికారులకు తప్పనిసరి. కనీసం సేల్ డీడ్‌లో హద్దులు రాయడం లేదు. ఇలాగైతే ఆటోమెటిక్ మ్యుటేషన్ ఎంత డేంజర్? ప్రతి ఊరిలో 20 నుంచి 30 శాతం భూముల పొషెషన్‌కి, రికార్డుకు మధ్య చాలా తేడా ఉన్నది. దీనికి పరిష్కారం ఏమిటి?

తెలియకుండానే మార్పిడి

1983లో మహేశ్వరంలో 8 ఎకరాల ల్యాండ్ కొన్నారు. ఫెన్సింగ్ వేసుకున్నారు. మామిడితోట పెట్టారు. పాసు బుక్స్ కూడా వచ్చినయ్. ఇప్పుడేమో ధరణి పోర్టల్‌లో ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ పేరిట భూమిని మార్చేశారు. ఎక్కడా వాళ్లు సంతకం కూడా పెట్టలేదు. అధికారులను తమకు తెలియదన్నారు. రియల్ ఎస్టేట్ కంపెనీ నుంచి మళ్లీ సేల్ డీడ్ చేసుకోవడమే మార్గమని సూచించారు. హక్కులే లేని కంపెనీ నుంచి ఎందుకు కొనాలి? ఒకవేళ చేసినా తర్వాత లీగల్ ఇష్యూస్‌కి ఎవరు బాధ్యులు? దాంతో హైకోర్టును ఆశ్రయించారు. ఒకరిద్దరు కాదు.. అనేక ఉదంతాలు కనిపిస్తున్నాయి. మరి ట్యాంపరింగ్‌కి అవకాశం లేదన్న డేటాలో ఇలాంటి తప్పులు ఎందుకు తలెత్తాయి?

రిజిస్ట్రేషన్లు మాత్రమే కాదు -మన్నె నర్సింహారెడ్డి, ధరణి సమస్యల పరిష్కారం వేదిక కన్వీనర్

భూ రికార్డుల నిర్వహణ అంటే కేవలం రిజిస్ట్రేషన్లు మాత్రమే కావు. భూమికి సంబంధించిన అనేక అంశాలు ఉంటాయి. ధరణి కంటే ముందు జమాబందీ జరిగేది. పహానీలు క్రమపద్ధతిలో రాసేవారు. కానీ ఇప్పుడు అలాంటివేం జరగడం లేదు. ఇప్పుడు ఇంకా 10 లక్షల మందికి పాసు పుస్తకాలే రాలేదు. 2018 ఎల్‌ఆర్ యూపీలో భూమి లేని వ్యక్తులకి లక్షల పాసు పుస్తకాలు పొరపాటుగా ఇచ్చారు.

వాళ్లకీ రైతుబంధు ఇస్తున్నారు. రైతుబంధు రూపంలో ఇచ్చిన డబ్బుల్లో రూ.5 వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది. దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? కొత్త వ్యవస్థ వచ్చినప్పుడు రైతులకు మంచి జరగాలి. కానీ ధరణి వచ్చాక హక్కులు హరించారు. రెవెన్యూ కోర్టులు తొలగించారు. దీంతో ప్రతి ఒక్కరూ సివిల్ కోర్టు, హైకోర్టుకు వెళ్లాల్సి వస్తున్నది. హైకోర్టులో రెండు లక్షల కేసులు ప్రస్తుతం రైతులు వేసినవే ఉన్నాయి. ఇప్పటికైనా ధరణి పోర్టల్ సమస్యలు పరిష్కరించాలి.

పెద్దల కోసమే ధరణి -నారగోని ప్రవీణ్కుమార్, అధ్యక్షుడు, తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్

మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, దోరల కోసమే ధరణి పోర్టల్‌ని తీసుకొచ్చారు. ధరణి ఒక పాపాల పుట్ట. నేరాల చిట్టా. ధరణి సృష్టించిన సమస్యలతో లక్షలాది మంది రైతులు రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తున్నది. సరిహద్దులు లేకుండా ధరణిలో భూమిని నమోదు చేస్తున్నారు. ఎవరి భూమి ఎక్కడుందో గుర్తించడం ఎట్లా? ధరణి వచ్చాకా ఎన్ని లక్షల ఎకరాలు ఎవరి పేర మారిందో బయట పెట్టాలి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి కుటుంబాల పేరిట ఎన్ని లక్షల ఎకరాలు ఉందో ప్రజల ముందుంచాలి. 

Read More...  రైతు దినోత్సవాలు ఒక వైపు.. ధాన్యం డబ్బుల కోసం రైతుల ఎదురు చూపులు మరో‌వైపు 

Tags:    

Similar News